BJP MP K Laxman On Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకమని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతుండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని.. ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ సహా అనేక పక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారని అన్నారు. క్రాస్ ఓటింగ్ విషయంలో బీజేపీ ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయలేదని.. తమ మనోభీష్టానికి అనుగుణంగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేశారని విమర్శించారు. బీజేపీ సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.
ఇదిలావుండగా.. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మధ్యాహ్నానికే తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. సాయంత్రం 5.30 గంటలకు రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లను, ఆ తర్వాతి రౌండ్‌లో ఎమ్మెల్యేల ఓట్లను అధికారులు లెక్కించారు. ఎంపీల ఓట్లలో ముర్ముకు 540 ఓట్లు రాగా, వాటి విలువ 3,78,000గా తేలింది.విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు రాగా.. వాటి విలువ 1,45,600గా వెల్లడైంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి.. ముర్ముకు 1,349 ఓట్లు రాగా వాటి విలువ 4,83,299గానూ, యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు రాగా వాటి విలువను 1,79,876గా అధికారులు నిర్ధారించారు.