NTV Telugu Site icon

Vijayasanthi: అలాంటి వారి విషయంలో కేటీఆర్, అసదుద్దీన్ స్పందన ఏంటి?

Vijayasanthi

Vijayasanthi

మతపరమైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నవీన్ జిందాల్, నుపుర్ శర్మలపై బీజేపీ అగ్రనాయకత్వం కఠిన చర్యలు తీసుకుందని ఆ పార్టీ నేత విజయశాంతి గుర్తుచేశారు. దేశంలో మత సామరస్యం దెబ్బతినకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగిన నియంత్రణలు చేపట్టిందని తెలిపారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ బీజేపీపై విమర్శలు గుప్పించడం సరికాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ భాగస్వామి పార్టీ, కవల మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుండటాన్ని విజయశాంతి ఖండించారు.

సదరు నేతలందరినీ తాను ఒక ప్రశ్న అడుగుతున్నానని విజయశాంతి ప్రశ్నించారు. అసదుద్దీన్ సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తన బహిరంగ సభల్లో నేరుగా శ్రీరాముడు, సీతామాత సహా పలువురు హిందూ దేవతలను పేర్లు పెట్టి మరీ ప్రస్తావించి విమర్శించి, పరిహసించిన వీడియోలు యూట్యూబ్‌లో ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని ఆరోపించారు. అక్బరుద్దీన్ గోమాతను సైతం అవమానించారని.. మరి ఆయన విషయంలో కేటీఆర్, అసదుద్దీన్ అంతే కఠిన వైఖరిని ప్రదర్శించగలరా అంటూ నిలదీశారు.

BJP: కించపరిచారు.. వేటు వేయించుకున్నారు

అక్బరుద్దీన్ మాత్రమే కాదని.. పలువురు హేతువాదులు, వామపక్ష వాదులు, హైందవేతర మాతాలకు చెందిన మతవాదులు ఎందరో హిందూదేవతలను, హిందూవుల విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలను అవమానించి విమర్శించిన వీడియోలు చాలా ఉన్నాయని విజయశాంతి విమర్శలు చేశారు. మరోపక్క కేరళలో PFI సంస్థ హిందువులు, క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం సాగిస్తోందని.. వీళ్లు తమ లక్ష్యానికి పిల్లల్ని కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. మరి వీరి విషయంలో కేటీఆర్, అసదుద్దీన్ స్పందన ఏంటో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు.