Bhatti Vikramarka: ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యాలు చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. ఉత్పత్తి రంగం కొద్ది మంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సి ఉంటుందని అన్నారు. గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ పేదప్రజలకు భూమిని పంచిన చరిత్ర కాంగ్రెస్ ది అని భట్టి పేర్కొన్నారు. తెలంగాణలో ఏ పోరాటం చూసినా… భూమికోసం జరిగినవే అని గుర్తు చేశారు. స్వతంత్ర భారత దేశంలో పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పేదలకు పంచిన భూములను ధరణి చట్టంలోకి రాకుండా పక్కనబెట్టారని మండిపడ్డారు. వారికి పాస్ బుక్ లు, పట్టాలు ఇవ్వడంలేదన్నారు. ఖాస్తు కాలమ్ ను తొలగించి… భూమిని భూస్వాములకు అప్పగించిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని పేర్కొన్నారు. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో కేసీఆర్ ను నిలదీశామన్నారు. ఫ్యూడల్ వ్యవస్థను, భూస్వామ్య విధానాన్ని బీఆరెస్ మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… ఖాస్తు కాలమ్ తో పాటు ఇతర కాలమ్స్ ను మళ్లీ చేరుస్తామని హామీ ఇచ్చారు.
ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు ధరణి పేరుతో పేదల భూములను వారికి కాకుండా చేస్తోందని మండిపడ్డారు. మీ భూ హక్కులు మీకు తిరిగి కల్పించేందుకు కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. పేదలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఠాక్రే తెలిపారు.
కాంగ్రెస్ జాతీయ నాయకులు కొప్పుల రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ అదాలత్ వుంటుందని అన్నారు. ధరణి పోర్టల్ తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పేదలకు భూ హక్కులు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణలోని 12వేల గ్రామాల్లో ధరణి అదాలత్ లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని అన్నారు. ధరణితో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారికి హామీ ఇస్తుందని తెలిపాపరు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
R Krishnaiah: ప్రజాస్వామ్య దేశంలో ధన స్వామ్యం నడుస్తుంది