NTV Telugu Site icon

భార‌త్ బ‌యోటెక్ టీకాల‌కు ప్రపంచ ఆరోగ్య‌సంస్థ ఆమోదం…

ప్ర‌ముఖ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ భార‌త్ బ‌యోటెక్ త‌యారు చేసిన రోటావాక్-5డికి ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆమోదం తెలిపింది.  పిల్ల‌ల‌కు వ్యాపించే రోటా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ కోసం ఈ వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది.  ఇప్ప‌టికే రోటావాక్ ను త‌యారు చేసిన ఈ సంస్థ మ‌రింత ర‌క్ష‌ణ కోసం 5డీని త‌యారు చేసింది.  ఈ 5డి వ్యాక్సిన్‌కు ఇప్పుడు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆమోదం తెలిపింది.  రోటావాక్ 5డి పిల్ల‌ల‌కు మరింత ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని, అంతేకాకుండా నిల్వ‌, స‌ర‌ఫ‌రాకు కూడా త‌క్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని భార‌త్ బ‌యోటెక్ పేర్కొన్న‌ది.  ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆమోదం తెల‌ప‌డంతో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని మ‌రింత వేగం చేయ‌బోతున్న‌ట్టు భార‌త్ బ‌యోటెక్ తెలియ‌జేసింది.  

Read: తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి! కాంచీవరం చీరకట్టుతో కళ్యాణ మండపంలోకి…

5 ఏళ్ల లోపున్న పిల్ల‌ల‌కు రోటా వైర‌స్ కార‌ణంగా డ‌యోరియా వంటి ప్రాణాంత‌క‌మైన వ్యాధులు వ‌స్తుంటాయి.  ఈ వ్యాధి తీవ్ర‌మైతే పిల్ల‌ల ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది.  అలాంటి వాటి నుంచి ఈ వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా ర‌క్షిస్తుంద‌ని సంస్థ ప్ర‌క‌టించింది.  ప్ర‌తి ఏడాది ఈ రోటా వైర‌స్ కార‌ణంగా దాదాపుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 20 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు ఆసుపత్రి పాల‌వుతుండ‌గా, రెండు ల‌క్ష‌ల మందికి పైగా చిన్నారులు మృతి చెందుతున్నారు.  ఇక ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్ సంస్థ 250 మిలియ‌న్ల రోటావాక్ వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫ‌రా చేసింది.