NTV Telugu Site icon

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

Basara Iiit

Basara Iiit

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆర్. ప్రవీణ్ కుమార్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్‌లోని నాలుగో అంతస్తులో ప్రవీణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తోటకుర్తి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృత దేహాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

రాంతి ప్రవీణ్ కుమార్ ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. ఇళ్లకు వెళ్లే వారికి ఔట్‌ పాస్‌లు అందజేస్తున్నారు.ప్రవీణ్ కుమార్ తో పాటు అతని స్నేహితులు కూడా ఔట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఉదయం ప్రవీణ్ కుమార్ స్నేహితుడు ఔట్ పాస్ తీసుకుని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి ప్రవీణ్ బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడి స్నేహితుడు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన సిబ్బంది యూనివర్సిటీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు బీహెచ్‌లోని ఖాళీ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదికి తాళం వేయకుండా ఖాళీగా ఉంచినట్లు మరికొందరు విద్యార్థులు అనుమానిస్తున్నారు.

మృతుడి తల్లి మూడు నెలల కిందటే గుండెపోటుతో మృతి చెందింది. ఇటీవలే తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రవీణ్ మానసికంగా కుంగిపోయాడని ప్రవీణ్ స్నేహితులు చెబుతున్నారు. రెండో పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో తండ్రి మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆందోళన వ్యక్తం చేశారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో బబ్లూ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బబ్లూ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 13న బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అదే నెల 15న లిఖిత అనే విద్యార్థిని మృతి చెందింది. దీంతో ఈ ఇద్దరి మృతిపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు.
Girls Fight for Selfie: సెల్ఫీ విషయంలో వివాదం.. పొట్టుపొట్టు కొట్టుకున్న యువతులు..