Bandi Sanjay Strong Counter To CM KCR Comments: తన బిడ్డను బీజేపీలోకి లాగాలని చూస్తూ, ఆ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్‌నే ఎవరు పట్టించుకోవడం లేదని, ఇక ఆయన కూతుర్ని ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం తానే కుటుంబసభ్యుల్ని కేసీఆర్ వాడుకుంటారంటూ విమర్శించారు. పార్టీ మారాలనుకునే వారిని చెప్పుతో కొట్టాలన్న కేసీఆర్, మరి ఇతర పార్టీల నుంచి 37 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి ఎందుకు చేర్చుకున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతారనుకుంటే.. ఏ ఒక్కరూ నోరు విప్పట్లేదన్నారు. ఎంతసేపటికి ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్‌లోకి గుంజాలి, ఇతర పార్టీలపై బురద చల్లాలన్నదే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని నలుగురు ఎమ్మెల్యేలను ఇప్పటివరకు ఎందుకు బయటకు రావడం లేదో.. వారిని కేసీఆర్ గంప కింద ఎందుకు కమ్మి పెట్టారో అర్థం కావడం లేదని బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. సీఎంకు దమ్ముంటే.. దక్కన్ కిచెన్ హోటల్, ఫాంహౌజ్, ప్రగతి భవన్‌లోని సీసీ పుటేజీలను సేకరించి విచారణ జరపాలని సవాల్ విసిరారు. తాము కేవలం హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోనే సిట్ విచారణ జరపాలని కోరామన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వెళ్లొచ్చని, తాము దేనికైనా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, ఆ భయంతోనే గెలుపు కోసం కేసీఆర్ అడ్డదారులు తొక్కుతున్నారని, తన ఎమ్మెల్యేలని సైతం ఆ కోవలోనే నిర్దేశిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేస్తోంది కూడా కేసీఆరేనని అన్నారు. ప్రధానిని కలవకుండా కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదనుకుంటే, మీటింగ్‌కి వచ్చి ఎందుకు అడగట్లేదని చెప్పారు.
తెలంగాణలోనే కేసీఆర్‌కు దిక్కు దివాణ లేరని, మునుగోడులోనే 100 మంది ఎమ్మెల్యేలను మోహరించారని, ఇక దేశమంతా ఎలా పోటీ చేస్తారని బండి సంజయ్ సెటైర్లు వేశారు. ధరణి సమస్యలతో జనం అల్లాడుతుంటే.. నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రతీచోటా భూకబ్జాలేనని, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే వార్తలపై నిజం లేదన్నారు. ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారని, వడ్లు కొనే నాథుడు లేక రైతులు గోస పడుతున్నారని, గొల్ల కురమలకు బ్యాంకుల్లో వేసిన నిధుల్ని ఫ్రీజ్ చేశారని పేర్కొన్నారు. వికృత, ఉన్మాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని.. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ దేనికైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు. ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్‌దే.. చివరకు బ్యూరోక్రసీని కూడా దిగజార్చారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, మునుగోడు ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు.
బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించి, ఎన్నికల్లోకి వెళ్లే దమ్ము కేసీఆర్‌కు దమ్ముందా? అని నిలదీశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిందెవరు? 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మునుగోడు గెలుపోటములతో బీజేపీ కుంగిపోలేదని, మరింత ఉత్సాహంతో పాదయాత్ర-5 ప్రారంభించబోతున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. తమ పక్షాన ఎవరు పోరాడుతున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక సూపర్‌స్టార్ కృష్ణతో తనకు మంచి అనుబంధం ఉందని, గతంలో ఫోన్ చేసి తన పార్లమెంట్ అనుభవాలను తనతో పంచుకున్నారని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు.
