Autos Strike Today: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను కలిసి ఆటో బంద్‌కు సంబంధించి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ బంద్‌కు క్యాబ్‌లు, డీసీఎం, లారీ డ్రైవర్లు కూడా మద్దతు తెలిపారని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు.
Read also: Ratha Saptami 2024: తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే మహిళలు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజూ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 12 లక్షలు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. మహిళలు ఎక్కువగా జీరో టికెట్ తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు. ఆటోలు ఎక్కే వారు కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉందని వారు భావిస్తున్నారు. ప్రయాణికులు లేక రోజువారి ఆదాయానికి గండి పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Japan: దిగజారుతున్న జపాన్ ఆర్థిక వ్యవస్థ.. మూడో స్థానానికి జర్మనీ..