Site icon NTV Telugu

Asaduddin Owaisi: ప్రధానిపై సెటైర్లు.. ఆయనంటే మోడీకి ఎందుకంత భయం?

Asaduddin On Modi

Asaduddin On Modi

Asaduddin Owaisi Satires On PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉయ్‌ఘర్ ముస్లింలపై జరుగుతోన్న అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన మీద.. ఆ దేశాన్ని నిలదీసే తీర్మానానికి భారత్ దూరంగా ఉండడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎందుకు ఈ తీర్మానంపై భారత్ దూరంగా ఉందని మండిపడ్డారు. చైనా అధ్యక్షుడు జి జింపింగ్ అంటే.. మోడీకి ఎందుకంత భయం? అంటూ ట్విటర్ మాధ్యమంగా ఆయన ప్రశ్నించారు.

‘‘ఉయ్‌ఘర్ ముస్లింలపై చైనా అరాచకాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన కీలకమైన ఓటింగ్‌‌కు భారత్‌ ఎందుకు దూరంగా ఉందో ప్రధాని మోడీ వివరించగలరా? ఎందుకు చైనాకు అనుకూలంగా వ్యవహరించగలిగారో సమాధానం చెప్పగలరా? ఇప్పటిదాకా తాను 18 సార్లు కలిసిన చైనా అధ్యక్షుడు జి జింపింగ్‌ అంటే మోడీకి భయమా? జింపింగ్ చేస్తోంది తప్పని చెప్పడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందే’’ అని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. లడఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమించిన చైనాని భారత్ తప్పు పట్టకపోవడం, అంతర్జాతీయంగా చైనాకు అనుకూలంగా వ్యవహరించడం.. ఏ రకమైన విదేశాంగ విధానమని ఆయన నిలదీశారు.

కాగా.. చైనాలోని జిన్‌‌జియాంగ్ రాష్ట్రంలో ఉయ్‌ఘర్ ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే.. చైనా వారి పట్ల దారుణంగా ప్రవర్తించడంతో పాటు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ వస్తోందని చాలాకాలం నుంచి ఆరోపణలున్నాయి. దీని మీద చర్చలు జరిపేందుకు.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు తీర్మానం వచ్చింది. అయితే.. ఈ చర్చ జరగాలంటే, తీర్మానానికి మెజారిటీ దేశాల ఆమోదం అవసరం. ఈ తీర్మానంలో ఓటింగ్‌కు భారత్‌తో పాటు మరికొన్ని దేశాలు ఓటు వేయలేదు. దీంతో.. చైనాకు వ్యతిరేకంగా తీర్మానం జరగలేదు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ పై విధంగా విమర్శలు గుప్పించారు.

Exit mobile version