Site icon NTV Telugu

Moinabad Episode: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్.. వాళ్లపై గురి?

Moinabad Episode Case

Moinabad Episode Case

Another Twist in Moinabad Farm House Episode: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ముగ్గురు నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన సిట్ అధికారులు.. ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు బృందాలుగా విడిపోయి.. ఏపీ, హరియాణా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్‌లో సోదాలు కొనసాగిస్తున్నారు. హరియాణాలో రామచంద్రభారతి నివాసంతో పాటు కర్ణాటకలో ఆయనకు సంబంధించిన ఇంట్లో సోదాలు చేశారు. అటు తిరుపతిలో సింహయాజికి చెందిన ఆశ్రమంలో మరో బృందం సోదాలు చేస్తోంది. ఇటు హైదరాబాద్‌లోని నందకుమార్‌కు చెందిన ఇల్లు, హోటల్‌లో సోదాలు నిర్వహించారు. రామచంద్రభారతికి కేరళలోకి కొచ్చికి చెందిన ఒక వైద్యుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించిన అధికారులు.. అతని ఇంట్లోనూ తనిఖీ చేశారు. అక్కడ వారికి కొన్ని కీలక పత్రాలు దొరికినట్టు తేలింది. ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువు.. తిరుపతి నుంచి హైదరాబాద్‌ రావడానికి సింహయాజీకి విమానం టికెట్‌ బుక్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అనుమానం ఉన్న మరికొంత మందిని అరెస్ట్ చేయొచ్చని సమాచారం.

మరోవైపు.. నందకుమార్‌ ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఫిల్మ్‌నగర్‌ ఆదిత్య హిల్‌టాప్‌ అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో ఉండే నందకుమార్‌ ఇంట్లో దాదాపు ఆరు గంటలపాటు సోదాలు చేయగా.. పలు పత్రాలు దొరికినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఆ ఇంటికి ఎవరెవరొచ్చారనే కోణంలో.. సీసీటీవీ కెమెరాల ఫుటేజిని కూడా పరిశీలించారు. చైతన్యపురిలో నందకుమార్‌ తల్లిదండ్రులు నివసించే ఇంటితో పాటు ఫిల్మ్‌నగర్‌ కూడలిలోని అతడి హోటల్‌ దక్కన్‌ కిచెన్‌లోనూ సోదాలు కొనసాగాయి. గతంలో నిందితులు ఇదే హోటల్లో బస చేసి ఉంటారనే అనుమానంతో ఆ వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలావుండగా.. ఫిల్మ్‌‌నగర్‌లో నందకుమార్‌కి చెందిన అక్రమ నిర్మాణాలు జీహచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. దక్కన్ కిచెన్ హోటల్ ముందు భాగంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని, ఈవిషయమై ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. గతేడాదిలో కూడా ముందుభాగంలో ఉన్న నిర్మాణాల్ని సీజ్ చేవామన్నారు. చివరగా నెల కిందట కూడా నోటీసులు ఇస్తే.. లీజ్ అగ్రిమెంట్ పంపిచారు తప్ప అక్రమ నిర్మాణాలపై స్పందించలేదన్నారు. పదే పదే చెప్పిన అందులో కార్యకలాపాలు సాగిస్తుండడంతో.. అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని స్పష్టం చేశారు.

Exit mobile version