Site icon NTV Telugu

Amit Shah: ప్రతి కార్యకర్త ఇంట్లో నేనుంటా.. కేసీఆర్ పాలనపై ధైర్యంగా కొట్లాడండి

Amit Shah N Satyanarayana

Amit Shah N Satyanarayana

Amit Shah Visits N Satyanarayana Home: మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని సాంబమూర్తి నగర్‌లో ఎన్. సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. ఒక చిన్న ఇంట్లో అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్న సత్యనారాయణ కుటుంబ సభ్యులను కలిసి అమిత్ షా.. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అమిత్ షాను చూసి ఉబ్బితబ్బిబ్బైన సత్యనారాయణ.. ‘‘సార్, 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా, మీ అంత గొప్ప నాయకుడు నాలాంటి సామాన్య కార్యకర్త ఇంటికి రావడం నా అదృష్టం. నా జన్మధన్యమైంది. పార్టీ కోసం మరింత కష్టపడి పని చేస్తా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల నుంచి దళితుల్ని దారుణంగా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడికి సీఎం పదవి ఇస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ గాలికొదిలేశారని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ సైతం ఇంతవరకూ అమలు కాలేదని అన్నారు. దళిత బంధు పథకాన్ని సైతం పూర్తిగా నీరుగార్చారని, కేసీఆర్ దురాగతాలపై పోరాటం చేసిన తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ‌పాలనను అంతమొందిస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

సత్యనారాయణ చెప్పిందంతా సానుకూలంగా విన్న అమిత్ షా.. తాను ప్రతి కార్యకర్త ఇంట్లో ఉంటానని, మీరంతా ధైర్యంగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి అంటూ భరోసా ఇచ్చారు. కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉన్న అమిత్ షా.. ఆ తర్వాత కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్‌లతో కలిసి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలు దేరారు. కాగా.. మునుగోడులో తమ పార్టీ జెండా ఎగురవేసేందుకే, ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ వ్యూహం రచించింది. ఇతర రాజకీయ పార్టీలు సైతం మునుగోడులో తమ సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Exit mobile version