Amit Shah Meeting With Farmers Associations Leaders In Begumpet: మునుగోడులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. బేగంపేట విమానాశ్రయంలో రైతు సంఘాలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైతు సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఆయన.. ఇక్కడి ప్రభుత్వాన్ని మారిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రుణ మాఫీ, ఫసల్ బీమా యోజనపై కూడా చర్చించారు. గో ఆధారిత సాగు చేయాలని సూచించిన ఆయన.. తన వద్ద కూడా 21 అవుతున్నాయని, వాటిలో 12 తరాల ఆవు ఒకటుందని అన్నారు. తానూ ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తున్నానని, మొత్తం 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ చట్టం మార్చాలని రైతులు కోరారు. ఈ భేటీ అనంతరం అమిత్ షా మునుగోడుకు బయలుదేరారు.
అటు.. అమిత్ షాతో భేటీ అనంతరం బేగంపేట విమానాశ్రయంలో రైతు మాణిక్ రెడ్డి మాట్లాడారు. రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం వల్ల పంటలు మునిగిపోయాయని, ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదని ఆయనకు వివరించామని, ఫసల్ బీమా అమలు చేయాలని కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సఖ్యత లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటికి పరిష్కరించి తమకు ఫసల్ బీమా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ యోజనలో భాగంగా 2 వేల నుంచి 5 వేలకు పెంచాలని తాము కోరామన్నారు. ఈ సందర్భంగా.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలని అమిత్ షా సూచించారన్నారు. తనకు 150 ఎకరాలున్నాయని, గోఆధారిత వ్యవసాయం చేస్తున్నట్లు అమిత్ షా చెప్పారని రైతు సంఘం నేతలు వివరించారు.
ఇదే సమయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం దేశమంతా అమలవుతున్నప్పటికీ, తెలంగాణలో అమలు చేయకపోవడంపై అభ్యుదయ రైతులు అమిత్ షాకు వివరించినట్లు తెలిపారు. ఎన్నో ప్రాంతాలకు చెందిన రైతులు ఈ భేటీలో పాల్గొన్నారని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుపైనా అమిత్ షాకు రైతులు వివరించారన్నారు. భూసార పరీక్షలు చేయమని కేంద్రం నిధులిస్తే, అలాంటివేమీ చేపట్టడం లేదని చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని మెరుగైన పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారన్నారు.
