NTV Telugu Site icon

BRS: బీఆర్ఎస్‌ తొలి సభకు సర్వం సిద్ధం.. గులాబీ పార్టీ బాస్‌ ప్రసంగంపై ఉత్కంఠ

Brs

Brs

BRS: మరో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్‌ కె.చంద్రశేఖర్‌రావు.. టీఆర్ఎస్‌ పార్టీని బీఆర్ఎస్‌ పార్టీగా మార్చిన తర్వాత తొలి సారీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్‌ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే సంకల్పంతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్‌.. అడుగులు ఎలా పడనున్నాయి.. తన కార్యాచరణ ఎలా ఉండబోతోంది.. ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెం వద్ద జరిగే భారీ బహిరంగ సభ వేదికగా కేసీఆర్‌ ఎలాంటి ఉపన్యాసం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారిపోయింది..

Read Also: Ind vs NZ : నేడు ఉప్పల్‌ వేదికగా తలపడనున్న న్యూజిలాండ్-ఇండియా

ఇక, ఈ సభకు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు హాజరుకానున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్‌టి బీఆర్‌ఎస్‌ సభవైపు మళ్లింది.. కేసీఆర్‌ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రాష్ట్ర ప్రజలతో పాటు.. జాతీయ నేతలు కూడా కేసీఆర్‌ ప్రసంగం కోసం ఆసక్తిగా చూస్తున్నారు.. మరోవైపు.. బీఆర్ఎస్‌ తొలి సభ కోసం ఖమ్మం నగరం గులాబీ మయం అయిపోయింది.. భారీ కటౌట్లపై ప్రభుత్వ పథకాల కొటేషన్లు, బీఆర్‌ఎస్‌ నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. చరిత్రలో నిలిచిపోయేలా సభ విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.. మతం పేరిట, కులం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీని పడగొట్టి కేంద్రంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సభ నాంది పలుకుతాం అంటున్నారు..

ఈ భారీ బహిరంగసభ కోసం వీ వెంకటాయపాలెం పరిధిలోని వందెకరాల సభా వేదిక సిద్ధమైంది. ఏర్పాట్లను సభ ఇన్‌చార్జి, మంత్రి హరీష్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యవేక్షించి పూర్తి చేయించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా జరిగే సభ ఇదే కావడంతో ఈ సభ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఖమ్మం వేదికగా కేంద్రంలోని బీజేపీకి కేసీఆర్‌ ఎలాంటి సవాళ్లు విసురుతారు.. బీఆర్‌ఎస్‌ అనుసరించే రాజకీయ విధానాలపై సభ ద్వారానే స్పష్టత ఇస్తారా? మరోసారి రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో పాటు కేంద్ర ప్రభుత్వం.. ఇతర పార్టీలపై ఘాటుగా స్పందిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.. మొత్తంగా దేశంలో బీజేపీయేతర పార్టీల బలానికి, బీఆర్‌ఎస్‌ నిర్మాణ శక్తికి వేదికగా సభ నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

Show comments