AIMIM MLA Akbaruddin Owaisi Praised CM K Chandrashekar Rao at Telangana Assembly budget Session 2022.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలని ఆయన శాసన సభలో ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఉందన్నారు అక్బరుద్దీన్. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు.
పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం మంచి నిర్ణయమని అక్బరుద్దీన్ ప్రశంసించారు. ఐతే ఉద్యోగ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఉర్దూ మీడియంలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన సీఎంను కోరారు.
ఇక, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని అక్బరుద్దీన్ తెలంగాణ ప్రభుత్వ పనితీరును కొనియాడారు. అందరం కలిసి బంగారు తెలంగాణ కల సాకారం చేద్దామని అక్బరుద్దీన్ సభ్యులకు పిలుపునిచ్చారు.
