Site icon NTV Telugu

Agnipath Scheme: న్యాయం కావాల‌ని అడిగితే చంపేస్తారా?

Army

Army

తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ ఆందోళనకారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్‌ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

‘నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు. మూడు ఏళ్లుగా మా జీవితాలు నాశనం అవుతున్నాయి. అవి ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం నాలుగేళ్ల కోసం సర్వీస్‌లో చేరలేం. అందరికీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. వయోపరిమితిని కూడా పెంచాలి. దాదాపు 2 వేల మందికి పైగా వచ్చాం. 8.30 గంటలకు వచ్చాం. మేం ఫిజికల్‌, మెడికల్‌పాస్‌ అయినం. పెండింగ్‌లో ఉన్న కామన్‌ ఎగ్జామ్‌ను నిర్వహించాలి. ’ అంటూ ఆర్మీ అభ్యర్థులు పేర్కొన్నారు.

మరోవైపు బీహార్, యూపీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ ఆర్మీ ఎంపిక పథకానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గత నాలుగు గంటలుగా పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రైల్వేట్రాక్‌పైనే వేలాదిమంది నిరసనకారులు బైఠాయించారు. రైల్వే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు.

రైల్వే స్టేషన్‌ వదిలి వెళ్లిపోవాలని, ఆందోళనలు విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు.సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అలాగే రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Exit mobile version