Site icon NTV Telugu

Addanki Dayakar: బీజేపీ కుట్రలో శశిధర్ రెడ్డి పావులౌతున్నారు

Addanki Dayakar

Addanki Dayakar

Addanki Dayakar Counter To Marri Sasidhar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్పడిన కల్లోలానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ కారణమంటూ.. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. పీసీసీ, మాణిక్యం ఠాగూర్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడటం ఏమాత్రం సరికాదని సూచించారు. పార్టీకి సలహాలు ఇవ్వాల్సిన సీనియర్లే ఇలా చేయడం కరెక్ట్ కాదని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రల్లో కాంగ్రెస్ పావులుగా మారుతోందని అభిప్రాయపడ్డారు. పీసీసీపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే, అది పార్టీకే నష్టం కలిగిస్తుందని.. ఏమైనా జరిగితే చూసుకోవడానికి పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయని చెప్పారు.

కాగా.. ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డ్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న మర్రి శశిధర్ రెడ్డి, అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు నష్టం కలిగించే పనులకు రేవంత్ పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ కూడా రేవంత్‌కు ఏజెంట్‌గా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగా లేదని అన్నారు. రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే సిగ్గుగా అనిపిస్తోందని, హోమ్ గార్డులతో తమని పోల్చడం ఏంటని నిలదీశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లో కొనసాగాలా? లేక రిటైర్మెంట్ తీసుకోవాలా? అన్న దానిపై కూడా ఆలోచిస్తున్నానని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

Exit mobile version