ACB Raids : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు ప్రదర్శించారు. హెచ్‌ఎండీఏ (HMDA) నిబంధనల ప్రకారం భూమిని సర్వే చేసి, జాయింట్ ఇన్‌పెక్షన్ సర్వే నివేదికను జారీ చేసేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన అధికారుల గుట్టు రట్టయింది. బాధితుడి నుంచి ఏకంగా రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ లంచం డిమాండ్ వ్యవహారంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఆయనను కూడా నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు.
తొలుత రూ.30 లక్షలు డిమాండ్.. ఆపై తగ్గింపు
ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం, భూ సర్వే నివేదిక ఇవ్వడానికి నిందితులు తొలుత రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత బేరసారాల అనంతరం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు కుదించారు. తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే మండల సర్వేయర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారు నుంచి ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. సర్వేయర్ వద్ద నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, ఆయన చేతి వేళ్లకు రసాయన పరీక్షలు నిర్వహించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులు తమ విధులను అక్రమంగా, అవినీతిమయం చేస్తూ ప్రజలను వేధిస్తున్నట్లు నిర్ధారించారు.
ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు
అవినీతికి పాల్పడిన మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు , తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. నిందితులను హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఎస్‌పీఈ , ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామని, ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ విధుల్లో పారదర్శకతను దెబ్బతీసేలా వ్యవహరించే ఇలాంటి అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

