రాష్ట్రంలో 32 జిల్లా కోర్టులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం, గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.భారత ప్రధాన నాయమూర్తి ఎన్వీ రమణతో కలిసి సీఎం కేసీఆర్ 32 జిల్లా కోర్టులు ప్రారంభించారు. తెలంగాణ తలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం, వ్యవసాయ, ఇండస్ట్రీ, ఐటీ గ్రోత్ లో ముందుందని కేసీఆర్ తెలిపారు. గతంలో ఎన్వీ రమణ గారు హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో నేను కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జడ్జీల సంఖ్య పెంచారని.. పటిష్టమైన హైకోర్ట్ గా తయారైందని అన్నారు. జిల్లా కోర్టులు, జడ్జి పోస్టులు కావాలని కోరినప్పుడు వారు నిర్ణయం తీసుకుని, రాష్ట్ర అవతరణ వేడుకల సమయంలో కొత్తగా 32 జిల్లాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
పరిపాలన వికేంద్రీకరణలో కోసం అప్పుడు ఉన్న 10 జిల్లాలకు తోడుగా 23 జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు మరింత సత్వరంగా పాలన అందేందుకు జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్. మా సొంత జిల్లా మెదక్ అని హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో ఉండేదని సిద్ధిపేట నుంచి సంగారెడ్డి 150 కిలో మీటర్ల దూరంలో ఉండేదని.. సెషన్స్ కోర్టుకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతీ జిల్లాకు కోర్ట్ ఏర్పడటంతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని కేసీఆర్ అన్నారు.
న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉంటే ప్రజలకు సత్వర న్యాయం దొరికి వారి చిక్కులు తొలిగిపోతాయని అన్నారు. నాకున్న సమాచారం ప్రకారం సిటీ సివిల్ కోర్ట్, రంగారెడ్డి కోర్టులపై తీవ్ర భారం ఉందని వీటిని కూడా విభజించాలని సీజేఐ ఎన్వీ రమణను కోరారు. దీంతో ప్రజలకు సత్వర న్యాయం దొరికే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ పరిధిలోని కోర్టులను కూడా విభజించాలని కోరారు.
