NTV Telugu Site icon

ప్ర‌పంచంలోనే పెద్దాస్ప‌త్రి.. 21న సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న‌

errabelli

బీజేపీ నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. వ‌రంగ‌ల్ మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌… ఈ నెల 21న ఉదయం 10.30 గంట‌ల‌కు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తార‌ని వెల్ల‌డించారు.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాప‌న కూడా జ‌రుగుతుంద‌ని.. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తార‌ని.. ఆ త‌ర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం చేసి యాదాద్రికి బ‌య‌ల్దేరుతార‌ని తెలిపారు.

సెంట్రల్ జైల్ స్థలంలో 30 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తార‌ని.. ప్రస్తుతం కెనడాలో మాత్రమే 24అంతస్తుల ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులోఉంద‌ని గుర్తుచేశారు ఎర్ర‌బెల్లి.. వరంగల్ లో నిర్మించే 30 అంతస్తుల ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్ద‌ద‌న్న ఆయ‌న‌.. ఆస్పత్రులు వస్తే బీజేపీ నేతలను నష్టం ఏంటి..? అంటూ ఫైర్ అయ్యారు.. బీజేపీ నేతలు కోర్టుకు పోయి ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. మీ పార్టీలో చేరిన వారంతా భూములు ఆక్రమించుకున్న వారే నంటూ ఎద్దేవా చేశారు.. వరంగల్ జిల్లా సస్యశ్యామలం కావడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఉంద‌ని ప్ర‌శంస‌లు కురిపించిన ఎర్ర‌బెల్లి.. కరోనా సమయంలో కేంద్రం విఫలమైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి మెరుగైన వైద్యం అందించింద‌న్నారు.. కాగా, వ‌రంగ‌ల్‌లో మ‌ల్లీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణం కోసం వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును అక్క‌డి నుంచి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.