2 Gates Lifted In Srisailam Project Due To Heavy Floods: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు 10 అడుగుల మేర రెండు గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,42,181 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 1,18,912 క్యూసెక్కులుగా ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.80 అడుగుల మేర నీళ్లు చేరాయి. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 214.3637 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాలో వర్షాలు భారీగా కురవడంతో.. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో.. తీర ప్రాంతంలో ఉండే ప్రజలతో పాటు, లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా.. నెల రోజుల వ్యవధిలోనే ఈ స్థాయి భారీ వరద రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.