NTV Telugu Site icon

సీతానగరం గ్యాంగ్ రేప్‌ :వెలుగులోకి షాకింగ్‌ నిజాలు

గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. జూన్ 19 రాత్రి సీతానగరం పుష్కరఘాట్‌లో ఉన్న ప్రేమికులపై దాడి చేసి యువతిపై అత్యాచారం చేశారు తాడేపల్లికి చెందిన శేరు కృష్ణకిషోర్, వెంకట్. దాదాపు 50 రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి ఆచూకీ కోసం మొత్తం 14 టీంలు రాత్రింబవళ్లు శ్రమించాయి. యువతి గ్యాంగ్‌ రేప్‌కు ముందు నిందితులు ఓ వ్యక్తిని హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. సీతానగరం రైల్వేబ్రిడ్జిపై కాపర్ వైర్లు దొంగతనం చేస్తుండగా ట్రైన్‌లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి చూశాడు. పోలీసులకు చెబుతాడనే అనుమానంతో అతన్ని హత్య చేశారు.

Read: లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై కేసు నమోదు

ఆ తర్వాత మృతదేహం ఎవరికీ కనిపించకుండా కృష్ణా నదిలో పడేశారు. యువతిని రేప్‌ చేశాక..నిందితులు.. పోలీసులకు దొరక్కుండా ప్లాన్డ్‌గా వ్యవహరించారు. ఒకే చోట కాకుండా వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇందులో కృష్ణా అనే నిందితుడు ట్రైన్‌లో హుబ్లీ పారిపోయాడు. అక్కడి నుంచి నిర్మల్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మకాం పెట్టాడు. అక్కడ నుంచి విజయవాడకు రావడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఏ1 నిందితుడిని పక్కా ప్లాన్‌తో పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమించారన్నారు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌. ఘటనాస్థలంలో ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసు చేధించడం జఠిలంగా మారిందన్నారు. మరోవైపు గ్యాంగ్‌ రేప్‌ కేసులో పరారీలో ఉన్న ఏ2 వెంకట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు.