Site icon NTV Telugu

Ibrahimpatnam issue: డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్, ఆర్వో, ఏఆర్వోకు కలెక్టర్ భారతి నోటీసులు

Ibrahimpatnam Issue Suspension

Ibrahimpatnam Issue Suspension

Deputy Tahasildar Suspended and Notices to RO – ARO in Ibrahimpatnam issue : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆర్డీవో కార్యాలయం వద్ద పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఎలాంటి సమాచారం లేకుండా ఓపెన్ చేసినట్టు పెద్ద ఎత్తున రగడ ఏర్పడిన సంగతి తెలిసిందే. పార్టీల ఏజెంట్లకు తెలియకుండానే పోస్టల్ బ్యాలెట్ల బాక్సులను ఓపెన్ ఎలా చేశారని కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ తదితర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికారపార్టీకి అధికారులు వత్తాసు పలుకుతూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉండాల్సిన పోస్టల్‌ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు అధికారులతో వాగ్వాదానికి దిగి పోస్టల్‌ బ్యాలెట్ బాక్స్‌ సీల్‌ తొలగించి ఉండటం, అందులో ఉన్న బ్యాలెట్లు లేకపోవడంపై రిటర్నింగ్‌ అధికారిని నిలదీశారు. నిజానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3,057 పోస్టల్‌ ఓట్లు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆరు బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉండాలి కానీ ఆ ఆరు బాక్సులు ఆర్డీవో కార్యాలయంలో ఉండటంపై కాంగ్రెస్‌ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. రిటర్నింగ్‌ అధికారి తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టగా కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను ఆర్డీవో కార్యాలయం నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించిన అధికారులు వాటికి సీల్‌ వేశారు.

Telangana Elections Counting NTV Live Updates: ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్.. లైవ్ అప్‌డేట్స్‌

జిల్లా కలెక్టర్‌ భారతి హోలికేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని పరిశీలించగా ఆమె వచ్చిన వెంటనే ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఆర్డీవో కార్యాలయానికి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి చేరుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు ఎలా తెరిచి ఉన్నాయని కలెక్టర్‌ను ప్రశ్నించారు. తప్పు జరిగినట్లు అధికారులు ఒప్పుకోగా పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు ఎలా తెరిచి ఉన్నాయో విచారిస్తామని కలెక్టర్‌ చెప్పారు. విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని కలెక్టర్‌ తెలపగా తప్పు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ భారతి హోలికేరి హెచ్చరించారు. అన్ని విషయాలు స్పష్టం చేసిన తర్వాతే కౌంటింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్న ఆమె డిప్యూటీ తహశీల్దార్ ను సస్పెండ్ చేసి ఆర్వో, ఏఆర్వోకు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ అంశం మీద మీడియాతో సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో పోస్టల్ ఓట్లకు సంబంధించి నిన్న రాత్రి ఫిర్యాదు వచ్చిందని, డిఈఓ వెళ్లి సమస్య పరిష్కరించారని అన్నారు. అభ్యర్థులకు పూర్తి వివరాలు వెల్లడించారని, పోస్టల్ ఓట్లు ఎన్ని పోల్ అయ్యాయి. అక్కడ ఎన్ని పోస్టల్ ఓట్లు ఉన్నాయనేది అభ్యర్థులకు వివరించారని అన్నారు.

Exit mobile version