200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!

  • షావోమీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్స్..
  • సెప్టెంబర్ 23న చైనాలో లాంచ్
  • రెండు మోడళ్లలోనూ డ్యూయల్ 200MP లైకా కెమెరాలు..
Xiaomi 18 Pro

Xiaomi 18 Pro

Xiaomi 18 Pro Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ (Xiaomi) తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల లాంచ్ తేదీని ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే టీజ్ చేసిన షావోమీ 18 ప్రో సిరీస్‌ను సెప్టెంబర్ 23న అధికారికంగా లాంచ్ చేయనుంది. చైనాలో సాయంత్రం 7 గంటలకు నిర్వహించే ‘ఆటమ్ న్యూ ప్రొడక్ట్ లాంచ్’ ఈవెంట్‌లో షావోమీ 18 ప్రో, షావోమీ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లు విడుదల కానున్నాయి.

షావోమీ విడుదల చేసిన టీజర్ పోస్టర్‌లో ‘ఫుల్ అప్‌గ్రేడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఐదు కీలక ఫీచర్లను హైలైట్ చేసింది. షావోమీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ రెండింటిలోనూ ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. రెండు ఫోన్లలో ఒకే చిప్ ప్లాట్‌ఫామ్, కెమెరా సెటప్, డిస్‌ప్లే టెక్నాలజీ ఉండనున్నాయి. ప్రధానంగా బ్యాటరీ సామర్థ్యంలో రెండు మోడళ్ల మధ్య తేడా ఉండనుంది.

ఈ రెండు ఫోన్లలో 2nm GAA ప్రాసెస్‌పై తయారైన కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు షావోమీ వెల్లడించింది. కొత్త చిప్ మెరుగైన పనితీరుతో పాటు పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే చిప్ పేరును మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లీక్‌ల ప్రకారం.. ఈ చిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 కావచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ జరగనుండటంతో ఇదే సమయంలో చిప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

షావోమీ 18 ప్రో సిరీస్‌లో లైకా కెమెరా సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో రెండు 200MP సెన్సర్లు ఉండనున్నాయి. ఒకటి పెద్ద సెన్సర్‌తో కూడిన మెయిన్ కెమెరా కాగా, మరొకటి పెద్ద సెన్సర్‌తో కూడిన పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా. నంబర్డ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో ఇప్పటివరకు తాము ఉపయోగించిన అత్యంత అధునాతన లైకా కెమెరా సెటప్ ఇదేనని షావోమీ పేర్కొంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ గతంలో షేర్ చేసిన వివరాల ప్రకారం 17mm నుంచి 75mm ఫోకల్ రేంజ్, 3.2x పెరిస్కోప్ జూమ్ ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ వివరాలను షావోమీ ఇంకా ధృవీకరించలేదు.

డిస్‌ప్లే విషయంలోనూ షావోమీ భారీ అప్‌గ్రేడ్ తీసుకొస్తోంది. కొత్త తరం సూపర్ పిక్సెల్ ప్యానెల్‌తో పాటు M11 లైట్ ఎమిటింగ్ సిస్టమ్, కొత్త గ్రీన్ లైట్ ఎమిటింగ్ మెటీరియల్‌ను ఉపయోగించనుంది. దీని ద్వారా తక్కువ పవర్ వినియోగంతో ఎక్కువ బ్రైట్‌నెస్ అందించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా కొత్త స్క్రీన్ ప్యాకేజింగ్ టెక్నాలజీతో బెజెల్స్‌ను కేవలం 0.99mmకు తగ్గించినట్లు షావోమీ తెలిపింది.

బ్యాటరీ విషయంలో కూడా షావోమీ 18 ప్రో సిరీస్‌లో భారీ అప్‌గ్రేడ్ కనిపించనుంది. రెండు ఫోన్లలోనూ షావోమీ జీఎస్‌ఆర్ VIII బ్యాటరీ టెక్నాలజీ, 32 శాతం సిలికాన్ కంటెంట్‌ను ఉపయోగించనుంది. షావోమీ 18 ప్రోలో 7,000mAh బ్యాటరీ ఉండగా, 18 ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 8,500mAh బ్యాటరీని అందించనుంది. దీంతో బ్యాటరీ బ్యాకప్ పరంగా ప్రో మ్యాక్స్ మోడల్ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.

లాంచ్ టీజర్‌లో ఛార్జింగ్ స్పీడ్ వివరాలను షావోమీ వెల్లడించలేదు. అయితే ఆగస్టులో వెలువడిన 3సీ సర్టిఫికేషన్‌లో కొత్త సిరీస్‌కు చెందినవిగా భావిస్తున్న రెండు షావోమీ మోడళ్లకు 100W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు కనిపించింది. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సెప్టెంబర్ 23న జరిగే లాంచ్ ఈవెంట్‌లో షావోమీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, ఇతర ఫీచర్లను కంపెనీ వెల్లడించనుంది.