IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!

  • దుమ్ము, నీరు వంటి బయటి పదార్థాల నుంచి..
  • ఎంతవరకు రక్షణ పొందుతుందో తెలిపే ప్రమాణం IP రేటింగ్..
  • IP67, IP68, IP69 తేడా ఇదే..
Ip67, Ip68, Ip69

Ip67, Ip68, Ip69

IP Ratings: కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ లేదా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు IP67, IP68, IP69 వంటి రేటింగ్స్ కనిపిస్తుంటాయి. ఈ రేటింగ్స్ ఆ డివైజ్ దుమ్ము, నీటి నుంచి ఎంతవరకు రక్షణ కలిగి ఉందో తెలియజేస్తాయి. అయితే ఎక్కువ నంబర్ ఉన్న రేటింగ్ ఎప్పుడూ అన్ని సందర్భాల్లో మెరుగైనదే అని భావించడం సరైనది కాదు. ముఖ్యంగా IP67, IP68, IP69 మధ్య ప్రధాన తేడా నీటి నుంచి లభించే రక్షణలో ఉంటుంది.

IP రేటింగ్ అంటే?

IP అంటే ఇంగ్రేస్ ప్రొటెక్షన్ (Ingress Protection). అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక ఎలక్ట్రానిక్ పరికరం దుమ్ము, నీరు వంటి బయటి పదార్థాల నుంచి ఎంతవరకు రక్షణ పొందగలదో ఈ రేటింగ్ సూచిస్తుంది. సాధారణంగా IP రేటింగ్‌లో రెండు అంకెలు ఉంటాయి. మొదటి అంకె ఘన పదార్థాలు, ముఖ్యంగా దుమ్ము నుంచి రక్షణను సూచిస్తే.. రెండో అంకె నీటి నుంచి రక్షణ స్థాయిని సూచిస్తుంది. IP67, IP68, IP69లో మొదటి అంకె 6. అంటే ఈ మూడు రేటింగ్స్ కలిగిన పరికరాలు దుమ్ము ప్రవేశానికి వ్యతిరేకంగా పూర్తి రక్షణ కలిగి ఉంటాయి. అసలు తేడా రెండో అంకెలో ఉంటుంది.

IP67 అంటే?

స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాల్లో కనిపించే సాధారణ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌లో IP67 ఒకటి. ఈ రేటింగ్ ఉన్న పరికరం పూర్తిగా దుమ్ము నుంచి రక్షణ పొందడంతో పాటు నియంత్రిత పరీక్షా పరిస్థితుల్లో 1 మీటర్ వరకు మంచినీటిలో 30 నిమిషాల వరకు మునిగినప్పటికీ పనిచేసేలా రూపొందించబడుతుంది. అందువల్ల ఫోన్ అనుకోకుండా సింక్‌లో పడిపోవడం, వర్షంలో తడవడం లేదా పరికరంపై నీరు చిందడం వంటి రోజువారీ పరిస్థితుల్లో IP67 ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ రేటింగ్ ఉన్న ఫోన్‌ను స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించడం లేదా ఎక్కువసేపు నీటిలో ఉంచడం సురక్షితమని భావించకూడదు. ఈ రేటింగ్ సాధారణ వినియోగదారులు, బడ్జెట్ మరియు మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు, రోజువారీ వర్షం లేదా ప్రమాదవశాత్తు నీటిలో పడే పరిస్థితులను ఎదుర్కొనే వారికి IP67 సరిపోతుంది.

IP68 అంటే?

IP68 ప్రస్తుతం ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా కనిపించే రేటింగ్. ఇది IP67 కంటే ఎక్కువ స్థాయిలో నీటిలో మునిగే పరిస్థితులను తట్టుకునేలా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. IP68కు అందరికీ వర్తించే ఒకే రకమైన నీటి లోతు లేదా సమయం ఉండదు. ప్రతి తయారీ సంస్థ తన పరికరాన్ని నిర్దిష్ట లోతు, సమయం, ఇతర పరిస్థితుల్లో పరీక్షించి IP68 రేటింగ్‌ను ప్రకటిస్తుంది. కొన్ని ఫోన్లు 1.5 మీటర్ల వరకు, మరికొన్ని 2 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ లోతు కోసం నిర్దిష్ట పరీక్షా పరిస్థితులను పేర్కొనవచ్చు. కాబట్టి IP68 ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్ పేర్కొన్న నీటి లోతు, వ్యవధి వంటి వివరాలను కూడా పరిశీలించడం మంచిది. వర్షం, ప్రమాదవశాత్తు నీరు చిందడం, ప్రయాణాల్లో నీటికి గురయ్యే పరిస్థితులు వంటి రోజువారీ అవసరాలకు IP68 మంచి రక్షణను అందిస్తుంది. అందుకే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు IP68 ప్రాక్టికల్ ఎంపికగా ఉంటుంది.

IP69 అంటే?

IP69ను చాలామంది IP68కు నేరుగా అప్‌గ్రేడ్ అయిన రేటింగ్‌గా భావిస్తారు. కానీ ఇది సరైనది కాదు. IP69 ప్రధానంగా నీటిలో ఎక్కువసేపు మునిగే సామర్థ్యంపై కాకుండా అధిక పీడనంతో, అధిక ఉష్ణోగ్రతతో వచ్చే నీటి జెట్లను తట్టుకునే సామర్థ్యంపై దృష్టి పెడుతుంది. IP69 పరీక్షల్లో డివైస్ పై వివిధ కోణాల నుంచి అధిక పీడనంతో నీటిని స్ప్రే చేయడం వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల తరచుగా ప్రెజర్ వాషింగ్, కఠినమైన పారిశ్రామిక వాతావరణం లేదా ఎక్కువగా నీటితో శుభ్రం చేసే ప్రాంతాల్లో ఉపయోగించే పరికరాలకు ఈ రేటింగ్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ రేటింగ్ ఉన్న మొబైల్ నిర్మాణ రంగంలో పనిచేసేవారు, ఫ్యాక్టరీలు, పారిశ్రామిక రంగాల్లో పనిచేసేవారు, ఔట్‌డోర్ ప్రొఫెషనల్స్ వంటి వారికి IP69 రక్షణ ఎక్కువగా ఉపయోగపడుతుంది.

రోజువారీ వినియోగం కోసం ఫోన్ కొనుగోలు చేస్తున్నట్లయితే IP67 చాలావరకు సరిపోతుంది. వర్షం, నీటి చినుకులు లేదా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయే పరిస్థితుల నుంచి రక్షణ కావాలంటే ఇది ఉపయోగకరమైన ఎంపిక. అలాగే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తూ మరింత మెరుగైన నీటి నిరోధకత కావాలనుకుంటే IP68ను ఎంచుకోవచ్చు. ప్రయాణాలు, ఔట్‌డోర్ వినియోగం వంటి సందర్భాల్లో ఇది ఎక్కువ నమ్మకాన్ని అందిస్తుంది. అయితే ఫ్యాక్టరీలు, నిర్మాణ ప్రాంతాలు లేదా అధిక పీడనంతో పరికరాలను కడిగే వాతావరణంలో ఫోన్‌ను ఉపయోగించాల్సి వస్తే IP69 రేటింగ్ ఉన్న రగ్గడ్ పరికరం మరింత అనుకూలంగా ఉంటుంది.