Vishal Garg: ఒక్క వీడియో కాల్‌తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!

  • ఒకప్పుడు ఒక్క కాల్‌లో 900 మందిని తొలగించాడు..
  • ఇప్పుడు తన ఉద్యోగమే కోల్పోయాడు..
  • Better.com సీఈఓ విశాల్ గార్గ్ పరిస్థితి వైరల్..
Vishal

Vishal

Vishal Garg: ఆన్‌లైన్ మోర్టిగేజ్ సంస్థ Better.comకు చెందిన 900 మంది ఉద్యోగుల్ని ఒక్క జూమ్ కాల్‌తో తొలగించారు. 2021లో భారత సంతతి సీఈఓ విశాల్ గార్గ్ ఇంత మంది ఉద్యోగుల్ని ఒకే దెబ్బతో తొలగించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, మరోసారి విశాల్ గార్గ్ వార్తల్లో నిలిచారు. అప్పట్లో 900 మందిని తొలగించిన ఈయనే ఇప్పుడు తన ఉద్యోగం కోల్పోయాడు. తాజాగా తన సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత, తిరిగి తీసుకోవాలని సంస్థ బోర్డును కోరతున్నాడు.

Better.com వ్యవస్థాపకుడు, మాజీ CEO అయిన గార్గ్‌ను ఆగస్టు 3న CEO పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో డేనియల్ లూయిస్‌ను కొత్త CEOగా నియమించారు.గార్గ్ ఆరోపణల ప్రకారం.. డేనియల్ లూయిస్ తొలుత సంస్థ వ్యూహంపై ఆసక్తి చూపిస్తూ తన విశ్వాసాన్ని పొందారు. ఖర్చులను తగ్గించడం, కంపెనీని లాభదాయకంగా మార్చడం వంటి అంశాలపై ఆరు నెలల క్రితం గార్గ్‌తో చర్చలు జరిపారు. అయితే చివరికి బోర్డులోకి ప్రవేశించి, ఇతర డైరెక్టర్ల విశ్వాసాన్ని సంపాదించుకుని తనను CEO పదవి నుంచి తప్పించారని గార్గ్ ఆరోపించారు. లూయిస్ ఖర్చు తగ్గింపుపై చేసిన ఆలోచనలు బాగున్నాయి, కానీ ఆయన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలు అంతగా నచ్చలదేని గార్గ్ చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.

జూలై 27న లూయిస్‌‌ను కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఇతర డైరెక్టర్లను ఒప్పించి గార్గ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించి, తనను తాను కొత్త సీఈఓగా నియమించుకునే పరిస్థితి వచ్చిందని గార్గ్ ఆరోపించారు. బోర్డు పొరపాటు చేసిందని గార్గ్ వ్యాఖ్యానించారు. అయితే, గార్గ్ ఇప్పుడు ఈ పరిణామంపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రముఖ న్యాయవాది అలెక్స్ సాపిరోను నియమించుకున్నాడు. సాపిరో ద్వారా Better.com బోర్డుకు లేఖ పంపించి, తనను తిరిగి సీఈఓగా నియమించాలని డిమాండ్ చేశారు.

2021లో ఒకే కాల్‌లో 900 మంది ఔట్..

2021లో సంస్థలో పనిచేస్తున్న 900 మంది ఉద్యోగుల్ని ఒకే జూమ్ కాల్‌తో తొలగించిన సంఘటన అప్పట్లో సంచలనంగా స‌‌ృష్టించింది. సంస్థ మార్కెట్ పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత వంటి కారణాలతో భారీ లేఆఫ్స్ ప్రకటించినట్లు అప్పట్లో విశాల్ గార్గ్ వెల్లడించారు. ఆ సమయంలో దాదాపు 250 మంది తొలగించబడిన ఉద్యోగులు తమ పని గంటలను అధికంగా చూపిస్తూ సంస్థను మోసం చేశారని గార్గ్ ఆరోపించారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అతనే సీఈఓ పదవిని కోల్పోయారు.