Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు

Smart Phone Theft

Smart Phone Theft

Smartphone Theft: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం మాట్లాడుకునే పరికరం మాత్రమే కాదు. బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్‌లు, వ్యక్తిగత ఫొటోలు, ఈమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు, ఆధార్, పాన్ వంటి అనేక ముఖ్యమైన వివరాలు ఒకే ఫోన్‌లో ఉంటున్నాయి. అందుకే ఫోన్ పోయినా, దొంగిలించబడినా దాని విలువ కంటే అందులో ఉన్న సమాచారం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సి వస్తోంది. చాలా మంది ఫోన్ కనిపించకపోతే ముందు వెతకడంపైనే దృష్టి పెడతారు. కానీ మొదటి కొన్ని నిమిషాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

ఫోన్ కనిపించకపోయిన వెంటనే మరో ఫోన్ నుంచి ముందుగా కాల్ చేయడం మంచిది. ఇంట్లోగాని, వాహనంలో గాని మరిచిపోయి ఉంటే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నా, ఎవ్వరూ స్పందించకపోతే ఆలస్యం చేయకుండా తదుపరి చర్యలు ప్రారంభించాలి. ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్లలో ఫోన్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం ఉంటుంది. ఆ ఫీచర్ ముందుగానే యాక్టివ్ చేసి ఉంటే ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అవసరమైతే ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయడం మంచిది.

ఇంకో ముఖ్యమైన విషయం బ్యాంకింగ్ భద్రత. ఫోన్‌లో యూపీఐ యాప్‌లు, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్‌లు ఉంటే వెంటనే సంబంధిత బ్యాంకులను సంప్రదించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం, ఖాతాపై అదనపు భద్రత ఏర్పాటు చేయించడం మంచిది. అలాగే మొబైల్ నెట్‌వర్క్ సేవల సంస్థను సంప్రదించి సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి. ఎందుకంటే ఓటీపీలు, ముఖ్యమైన సందేశాలు ఆ సిమ్‌కే వస్తాయి. అవి ఇతరుల చేతికి వెళ్తే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

అంతేకాదు, ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతాలు, క్లౌడ్ స్టోరేజ్ వంటి ముఖ్యమైన సేవల పాస్‌వర్డ్‌లను వీలైనంత త్వరగా మార్చుకోవడం మంచిది. ముఖ్యంగా ఒకే పాస్‌వర్డ్‌ను అనేక యాప్‌లకు ఉపయోగించే అలవాటు ఉంటే వెంటనే కొత్త పాస్‌వర్డ్‌లు సెట్ చేయాలి. తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సంబంధిత ఆన్‌లైన్ సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేయడం కూడా అవసరం. ఆ కంప్లైంట్ తో భవిష్యత్తులో సిమ్ తిరిగి పొందడం, బీమా క్లెయిమ్‌లు, ఇతర అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.

ఫోన్ పోయిందంటే కేవలం కొత్త ఫోన్ కొనడం మాత్రమే పరిష్కారం కాదు. అందులోని వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవడం మరింత ముఖ్యం. చిన్న ఆలస్యం కూడా ఆర్థిక నష్టం, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఫోన్ కనిపించకపోయిన వెంటనే భయపడకుండా, వరుసగా అవసరమైన చర్యలు తీసుకుంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.