PVC Ration Card: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ విప్లవంలో భాగంగా సామాన్యులకు అందించే సేవలను మరింత సులభతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా, నిత్యవసర వస్తువుల సరఫరాకు కీలకమైన రేషన్ కార్డును కూడా ఇప్పుడు సరికొత్త రూపంలోకి మార్చుకునే వెసులుబాటును కల్పించాయి. ఇప్పటివరకు మనం వాడుతున్న కాగితం రేషన్ కార్డులు త్వరగా పాడైపోవడం, చిరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ఇప్పుడు మీ రేషన్ కార్డును ఏటీఎం కార్డులాగా ధృడంగా ఉండే పీవీసీ (PVC) కార్డు రూపంలోకి మార్చుకోవచ్చు. దీనివల్ల కార్డు మన్నిక పెరగడమే కాకుండా, పర్సులో సులభంగా క్యారీ చేసే అవకాశం ఉంటుంది.
ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డును పొందడానికి ప్రభుత్వం ‘మేరా రేషన్’ (Mera Ration) అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్ నుంచే డిజిటల్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, మీ ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీ వివరాలు ధృవీకరించబడిన తర్వాత, మీ కార్డుకు సంబంధించిన పూర్తి సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అక్కడి నుండే మీరు డిజిటల్ కాపీని భద్రపరుచుకోవచ్చు. ఈ డిజిటల్ కార్డు అసలు కార్డుతో సమానమైన గుర్తింపును కలిగి ఉంటుంది.
Bangladesh: ఉస్మాన్ హాది హంతకులు భారత్ పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు..
ఇక ఫిజికల్ ప్లాస్టిక్ (PVC) కార్డు కావాలనుకునే వారు, తమ రాష్ట్ర ఆహార భద్రత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ‘ప్రింట్ రేషన్ కార్డు’ ఆప్షన్‌ను ఎంచుకుని, నిర్ణీత ఫీజు చెల్లిస్తే నేరుగా పీవీసీ కార్డును ఆర్డర్ చేసే సౌకర్యం కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ ఆన్‌లైన్ ప్రక్రియ ఇబ్బందిగా అనిపిస్తే, నేరుగా మీ దగ్గరలోని ‘మీ సేవా’ (Meeseva) లేదా ‘కామన్ సర్వీస్ సెంటర్’ (CSC) కి వెళ్లి కూడా ప్లాస్టిక్ కార్డును పొందవచ్చు. అక్కడ మీ కార్డు వివరాలు అందించి, కేవలం ఐదు నిమిషాల్లో స్మార్ట్ కార్డును ప్రింట్ చేయించుకోవచ్చు.
ఈ స్మార్ట్ పీవీసీ కార్డులపై ఉండే క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రేషన్ డీలర్లు సులభంగా లబ్ధిదారుల వివరాలను వెరిఫై చేస్తారు. ఇది కేవలం సరుకులు పొందడానికే కాకుండా, ప్రభుత్వం అందించే ఇతర పథకాలకు కూడా ఒక బలమైన గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు (One Nation One Ration Card) పథకంలో భాగంగా దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకోవడానికి ఈ డిజిటల్ , స్మార్ట్ కార్డులు ఎంతో కీలకం కానున్నాయి. మీ పాత రేషన్ కార్డు చిరిగిపోయినా లేదా అడ్రస్ మారినా, వెంటనే ఈ డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకుని స్మార్ట్ కార్డును పొందడం మంచిది.
