Samsung Galaxy Tab S12: శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా కొత్తగా “గాలక్సీ ట్యాబ్ S12 సిరీస్”ను అమెరికా మార్కెట్లో ప్రకటించింది. ఇందులో గాలక్సీ ట్యాబ్ S12 అల్ట్రా (Galaxy Tab S12 Ultra), గాలక్సీ ట్యాబ్ S12+ (Galaxy Tab S12+) మోడళ్లు ఉన్నాయి. అప్‌డేటెడ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, యాక్సెసరీస్, అధిక యాప్స్‌తో ఈ ట్యాబ్లెట్లు వచ్చాయి.
డిజైన్, పనితీరు
గాలక్సీ ట్యాబ్ S12 అల్ట్రా కేవలం 5.1 మి.మీ మందంతో శామ్‌సంగ్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత పలుచని గాలక్సీ ట్యాబ్ గా నిలిచింది. రెండు మోడళ్లలోనూ స్లిమ్, లైట్‌వెయిట్ డిజైన్‌తో పాటు IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందించారు. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి హెవీ టాస్క్‌ల సమయంలో వేడిని సమర్థంగా నియంత్రించేందుకు కొత్తగా రూపొందించిన 3D వేపర్ ఛాంబర్ ను కూడా అందించారు.
ఈ రెండు ట్యాబ్లెట్లలో 3nm ప్రాసెస్‌పై తయారైన మీడియాటెక్ డిమెంసిటీ 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గాలక్సీ ట్యాబ్ S11 అల్ట్రాతో పోలిస్తే కొత్త ప్రాసెసర్‌లో NPU పనితీరు 61 శాతం వరకు, CPU పనితీరు 19%, GPU పనితీరు 17% మెరుగుపడిందని శామ్‌సంగ్ తెలిపింది.
డిస్‌ప్లే
గాలక్సీ ట్యాబ్ S12 అల్ట్రాలో 14.6 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇక గాలక్సీ ట్యాబ్ S12+లో 12.6 అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌ను అందించారు. ఇందులో గత మోడల్‌తో పోలిస్తే బెజెల్స్ మరింత సన్నగా ఉన్నాయి.
రెండు మోడళ్లలోనూ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,600 నిట్స్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్ ఫీచర్ ఉన్నాయి. పరిసరాల్లోని లైటింగ్ పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను Vision Booster ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఆడియో విషయానికి వస్తే 4 ఛానల్ స్పేషియల్ ఆడియోను అందించారు. ఇది గత తరం కంటే రెండు రెట్లు ఎక్కువ ఛానల్స్‌ను అందిస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్
గాలక్సీ ట్యాబ్ S12 అల్ట్రా 23 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. గాలక్సీ ట్యాబ్ S12+ 21 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. రెండు ట్యాబ్లెట్లూ 45W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తాయి. 45W అడాప్టర్ ఉపయోగిస్తే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 95 నిమిషాలు పడుతుంది.
రెండు ట్యాబ్లెట్లతోనూ పెన్సిల్ ఆకారాన్ని పోలిన ఎర్గోనామిక్ S Pen లభిస్తుంది. దీనితో నోట్స్ రాయడం, డాక్యుమెంట్లపై వ్యాఖ్యలు చేయడం, స్కెచ్‌లు వేయడం వంటి పనులు చేయవచ్చు. శామ్‌సంగ్ ప్రత్యేకంగా “ప్రో కీ బోర్డు”ను కూడా అందిస్తోంది. ఇందులో అల్యూమినియం ఫినిష్‌తో పాటు AI అసిస్టెంట్లను త్వరగా యాక్సెస్ చేసేందుకు గాలక్సీ AI కీ ఉంది. అలాగే బుక్ కవర్ కీ బోర్డు స్లిమ్ తో వివిధ వీయింగ్ యాంగిల్స్‌లో ట్యాబ్లెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
Galaxy AI ఫీచర్లు
గాలక్సీ ట్యాబ్ S12 సిరీస్‌లో ఆండ్రాయిడ్ 17తో One UI 9 అందించారు. ఇందులో శామ్‌సంగ్ తాజా Galaxy AI ఫీచర్లు ఉన్నాయి. మల్టీ విండో ద్వారా ఒకేసారి మూడు విభాగాల్లో యాప్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ ట్యాబ్లెట్లతో Google AI Proకు ఆరు నెలల ట్రయల్ కూడా అందిస్తున్నారు.
7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్
రెండు ట్యాబ్లెట్లకూ దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను శామ్‌సంగ్ ప్రకటించింది. ఇందులో ఏడు తరాల వరకు OS అప్‌గ్రేడ్స్, ఏడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. Samsung Care+ ద్వారా ప్రమాదవశాత్తు జరిగే నష్టాలకు రిపేర్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇంట్లో మరియు విదేశాల్లో సర్టిఫైడ్ నిపుణుల సపోర్ట్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ధరలు
గాలక్సీ ట్యాబ్ S12 సిరీస్ అక్టోబర్ 7 నుంచి అమెరికాతో పాటు పలు దేశాల్లో గ్రే, సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.
* గాలక్సీ ట్యాబ్ S12 అల్ట్రా: 1,399.99 డాలర్లు (సుమారు రూ.1,34,245).
* గాలక్సీ ట్యాబ్ S12+: 1,199.99 డాలర్లు (సుమారు రూ.1,15,065).
భారత్‌లో వీటి అధికారిక ధరలు, లభ్యతపై శామ్‌సంగ్ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

