Pig kidney In Human: మానవ అవయవాలు విఫలమైతే వేరే వ్యక్తులు దానం చేస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని సందర్బాల్లో అవయవాలు దొరకకపోవడం, దొరికినా సెట్ కాకపోవడం వల్ల మనుషులు మరణిస్తున్నారు. అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని మానవుడికి అమర్చారు. ఇది ఏకంగా రెండు నెలల పాటు పనిచేసింది, భవిష్యత్తులపై ఆశలను పుట్టించింది. బ్రెయిన్ డెడ్ అయి, వెంటిలేటర్ పై ఉన్న ఓ వ్యక్తికి పంది కిడ్నీని అమర్చి పరిశోధన నిర్వహించారు.
న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్‌లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రయోగం బుధవారం ముగిసింది. బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ అనే వ్యక్తి కిడ్నీని తొలగించి, పంది కిడ్నీని అమర్చారు. అతడిని రెండు నెలలు వెంటిలేటర్ పై ఉంచి డాక్టర్ల బృందం పరిశోధన సాగించింది. పరిశోధన ముగిసిన తర్వాత మిల్లర్ శరీరం నుంచి పంది కిడ్నీని తొలగించి దహనసంస్కారాలకు పంపారు.
Read Also: IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
జన్యుపరంగా మార్పు చేసిన పంది కిడ్నీ మానవ శరీరంలో సుదీర్ఘకాలంగా పనిచేసినట్లు గుర్తించారు. ఈ ప్రయోగ ఫలితాలను యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(FDA)తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. క్యాన్సర్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ శరీరాన్ని పరిశోధన కోసం వాడుకునేందుకు ఆయన సోదరి మేరీ మిల్లర్-డఫీ శరీరాన్ని దానం చేశారు. జూలై 14న మిల్లర్ పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందు వైద్యులు అతడి కిడ్నీని తొలగించి, జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చారు.
పంది కిడ్నీకి, దాని థైమస్ గ్రంథిని మిల్లర్ కి అమర్చారు. థైమస్ గ్రంథితో రోగనిరోధక కణాలకు శిక్షణ ఇచ్చారు. అయితే కిడ్నీ ఒక నెలపాటు విజయవంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసింది. అయితే తర్వాతి నెలలో మూత్రం తగ్గిపోవడం వంటి సమస్యలను చూశారు. అంటే మానవశరీరం పంది కిడ్నీని తిరస్కరిస్తుందనే దానికి ప్రథమ సంకేతమని గుర్తించారు. అయితే ఇమ్యూన్ సప్రెస్ మెడిసిన్స్ తో వైద్యులు ఈ ప్రమాదాన్ని పరిష్కరించారు.
గతంలో ఇలాగే మేరే జంతువు అవయవాలను మానవ శరీరం వెంటనే రిజెక్ట్ చేసేది. అయితే జన్యుపరంగా మార్పు చెందిన పంది అవయవాల ద్వారా, భవిష్యత్తులో జంతు అవయవాలను మార్పిడి చేయవచ్చనే ఆశను కల్పించింది. తదుపరి పరిశోధనల్లో జెనోట్రాన్స్‌ప్లాంట్ కారణంగా ఏవైనా సమస్యలు వచ్చాయా..? లేదా..? అని తెలుసుకునేందుకు ప్రధాన అవయవాలు, లింప్ నోడ్స్, జీర్ణాశయ వ్యవస్థలోని 180 రకాల టిష్యూలపై పరిశోధనలు చేస్తారు.