Jio: రిలయన్స్ జియో వినియోగదారులకు త్వరలో షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిపోయినా ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు అందుకునే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఆ వెసులుబాటుకు జియో స్వస్తి పలకనుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీఛార్జ్ గడువు ముగిసిన వినియోగదారులకు జియో సంస్థ హెచ్చరిక సందేశాలు పంపుతుంది కూడా.
జియో రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు నిలిచిపోవచ్చని వినియోగదారులకు వచ్చిన ఎస్ఎంఎస్ ల ద్వారా అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన ఎస్ఎంఎస్ స్క్రీన్‌షాట్‌ను కూడా కొందరు సోసిల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. JB-JIOURG-S అనే సెండర్ ఐడీ నుంచి వస్తున్న ఈ సందేశంలో.. వినియోగదారుడి రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిందని, ఇన్కమింగ్ కాల్స్ ఎప్పుడైనా నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సేవలు నిరంతరాయంగా కొనసాగాలంటే వెంటనే రీఛార్జ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సందేశంలో ఇన్కమింగ్ కాల్స్ గురించి మాత్రమే ప్రస్తావించారు. ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ల నిలిపివేతపై స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు ఇన్కమింగ్ కాల్స్ ఎప్పుడు నిలిచిపోతాయనే విషయాన్ని కూడా జియో వెల్లడించలేదు. అంతేకాకుండా కాల్స్ తప్పనిసరిగా నిలిపివేస్తామని కాకుండా.. నిలిచిపోయే అవకాశం ఉందని మాత్రమే సందేశంలో పేర్కొంది. దీనిపై రిలయన్స్ జియో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే జియో ఇప్పటివరకు కొంత భిన్నమైన విధానాన్ని అనుసరిస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి సంస్థలు రీఛార్జ్ గడువు ముగిసిన వారం రోజుల్లోపే సాధారణంగా ఇన్కమింగ్ కాల్స్‌ను నిలిపివేస్తుంటాయి. కానీ జియోలో మాత్రం ప్లాన్ గడువు ముగిసిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి.
దీంతో చాలామంది తమ సెకండరీ సిమ్‌లను జియో నెట్‌వర్క్‌లో కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఓటీపీలు, యూపీఐ లావాదేవీలు, ఇతర ముఖ్యమైన సేవల కోసం రెండో సిమ్‌ను ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే జియో కొత్త నిబంధనలు అమలు చేస్తే అలాంటి వినియోగదారులు కూడా క్రమం తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో జియో ఇప్పడు తన నిబంధనలను కఠినతరం చేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రీఛార్జ్ చేయకుండా ఎక్కువ కాలం పాటు ఉపయోగించని సిమ్‌లను జియో డీయాక్టివేట్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. తాజాగా ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేతకు సంబంధించి హెచ్చరిక సందేశాలు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది.

