Meta One Plans: మెటా (Meta) యూజర్లకు కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవను తీసుకొచ్చింది. మెటా వన్ (Meta One) పేరుతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్, మెటా AI సేవలను కలిపి ఈ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. వ్యక్తిగత యూజర్లు, క్రియేటర్లు, బిజినెస్‌ల కోసం వేర్వేరు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఉచితంగా అందించే ప్రాథమిక సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని, పెయిడ్ ప్లాన్ల ద్వారా అదనపు ఫీచర్లు, ఎక్కువ AI వినియోగాన్ని పొందవచ్చని మెటా తెలిపింది.
వ్యక్తిగత యూజర్ల కోసం ఇంస్టాగ్రామ్ ప్లస్, ఫేస్ బుక్ ప్లస్, వాట్సాప్ ప్లస్ ప్లాన్లను మెటా తీసుకొచ్చింది. ఇంస్టాగ్రామ్ ప్లస్ లో DMలు, స్టోరీస్ కోసం కస్టమ్ ఫాంట్లు, కొన్ని వ్యక్తుల స్టోరీ వ్యూస్‌కు నోటిఫికేషన్లు, DM ప్రివ్యూలు వంటి ఫీచర్లు లభిస్తాయి.
అలాగే ఫేస్ బుక్ ప్లస్ లో మెసెంజర్ కస్టమైజేషన్, రీల్స్ కు సంబంధించిన మరిన్ని ఇన్‌సైట్స్, రీల్స్, ఫీడ్ పోస్టులకు అదనపు “సూపర్ రియాక్షన్స్” వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ ప్లస్ లో ప్రత్యేక థీమ్స్, ఐకాన్స్, ఎఫెక్ట్ స్టిక్కర్లు, ఎక్కువ చాట్స్‌ను పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాట్, మీడియా బ్యాకప్‌ల కోసం స్టోరేజ్, నిర్దిష్ట సమయాల్లో చాట్స్‌ను మ్యూట్ లేదా హైడ్ చేసే “ఫోకస్ షెడ్యూల్స్” ఫీచర్లను కూడా పరీక్షించనున్నట్లు మెటా తెలిపింది.
ప్రీమియం ప్లాన్లు
మెటా వన్ లో కోర్, ప్రీమియం అనే బండిల్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ కు సంబంధించిన ఫీచర్లతో పాటు మెటా AI వినియోగానికి ఎక్కువ యాక్సెస్ లభిస్తుంది. AIతో ఇమేజ్‌లను రూపొందించడం, ఎడిట్ చేయడం, Muse మోడల్స్ ఆధారంగా వీడియోలు సృష్టించడం, ఇంస్టాగ్రామ్లో రిస్టైల్ వంటి AI టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.
మెటా AI సాధారణ వినియోగానికి మాత్రం ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. ప్రారంభ పరీక్షల్లో బండిల్ ప్లాన్లకు సబ్‌స్క్రైబ్ అయిన వారిలో సగానికి పైగా AI, ఎక్స్ప్రెషన్ ఫీచర్లను రెండింటినీ ఉపయోగించినట్లు మెటా వెల్లడించింది.
వారి కోసం ప్రత్యేక ప్లాన్లు
క్రియేటర్లు, బిజినెస్‌ల కోసం కూడా మెటా వన్ లో ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఉన్నాయి. కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇప్పటికే ఉపయోగిస్తున్న మెటా యాప్స్‌లోనే ప్రొఫెషనల్ టూల్స్‌ను పొందవచ్చు. enhanced ప్రొఫైల్ ద్వారా వెబ్‌సైట్, లొకేషన్, అకౌంట్ గురించి ఇతరులు చెప్పిన విషయాలను ప్రదర్శించవచ్చు. రీల్స్లో ప్రత్యేక “Follow” బటన్, కంటెంట్‌తో ఎంగేజ్ అయిన వారికి ఆటోమేటిక్ “Follow Invitations”వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయి.
AI ఏజెంట్
బిజినెస్‌ల కోసం “మెటా బిజినెస్ ఏజెంట్”కు మరింత యాక్సెస్‌ను మెటా అందిస్తోంది. దీని ద్వారా వాట్సాప్ లో కస్టమర్లకు 24 గంటలూ స్పందించేందుకు బిజినెస్‌లకు అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్స్, కంటెంట్ క్రియేషన్, ఆప్టిమైజేషన్ వంటి విభాగాల్లో మరిన్ని AI Agent ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ తెలిపింది.
క్రియేటర్, బిజినెస్ ప్లాన్లలో Essential, Advanced, Expert, Max అనే నాలుగు స్థాయిలు ఉన్నాయి. అధునాతన ప్లాన్లలో స్టోరీ షెడ్యూలింగ్, ఆర్గానిక్ పోస్ట్స్, రీల్స్లో లింక్స్, ఎక్సపోర్టాల్ అనలిటిక్స్, ఆడియన్స్ ఇన్ సైట్స్, టీం మెంబెర్ యాక్సిస్, అదనపు లింక్డ్ డెవిస్స్, వాట్సాప్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ క్రెడిట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
Edits Plus కూడా..
మెటా వన్ లో త్వరలో “Edits Plus”ను కూడా తీసుకురానుంది. దీని ద్వారా ప్రాజెక్టులను వివిధ డివైజ్‌లలో సింక్ చేసుకోవడానికి అదనపు క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. రాబోయే Edits Assistant Instagram Insightsను విశ్లేషించి, కొత్త కంటెంట్ ఐడియాలపై సూచనలు ఇవ్వగలదు.
భారత్‌లో Meta One ధరలు
మెటా వన్ ను భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు, సేవలకు విస్తరించనున్నట్లు Meta తెలిపింది. ఇందులో Edits, AI Glasses వంటి ఉత్పత్తులు కూడా చేరనున్నాయి. Meta One ప్లాన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ఫీచర్లు, ధరలు, లభ్యత ప్రాంతం, యాప్, అకౌంట్‌ను బట్టి మారవచ్చు. భారత్‌లో ప్రకటించిన ధరలు ఇలా ఉన్నాయి.
సింగిల్ ప్రొడక్ట్ ప్లాన్లు:
Instagram Plus – నెలకు రూ.99.
WhatsApp Plus – నెలకు రూ.79.
Facebook Plus – నెలకు రూ.99.
Individual + AI బండిల్ ప్లాన్లు:
Core – నెలకు రూ.549.
Premium – నెలకు రూ.1,950.
Creator + Business ప్లాన్లు:
Essential – రూ.639 నుంచి.
Advanced – రూ.2,099 నుంచి.
Expert – రూ.6,399 నుంచి.
Max – రూ.20,990 నుంచి.

