Guinness World Record: స్మార్ట్‌ఫోన్‌ను కింద పడేస్తే స్క్రీన్ పగిలిపోతుందేమోనని భయపడుతుంటాం. అలాంటిది ఓ మొబైల్ ఫోన్‌ను ఏకంగా 30,607 మీటర్ల ఎత్తు నుంచి భూమిపైకి పడేశారు. అయినప్పటికీ ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ అసాధారణ ప్రయోగంతో “రైనో షీల్డ్, సేంట్ ఇన్టూ స్పేస్” సంస్థలు మొబైల్ ఫోన్ కేస్ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాయి.
30,607 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్ డ్రాప్:
RHINOSHIELD PTE. LTD., యూకేకు చెందిన Sent Into Space కలిసి ఈ రికార్డు ప్రయత్నాన్ని చేపట్టాయి. 2026 జూన్ 24న స్వీడన్‌లోని కిరునాలో ఫోన్‌ను విజయవంతంగా రికవర్ చేశారు. అది 30,607 మీటర్లు అంటే 1,00,418 అడుగుల 8 అంగుళాల ఎత్తు నుంచి కిందకు పడేసినప్పటికీ ఫోన్ పూర్తిగా సురక్షితంగా ఉంది. ఈ ఎత్తు సాధారణ కమర్షియల్ విమానాలు ప్రయాణించే సుమారు 9,000 మీటర్ల ఎత్తుకు మూడు రెట్లకుపైగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8,848 మీటర్లు కాగా.. దానికంటే కూడా మూడు రెట్లకుపైగా ఎత్తు నుంచి ఫోన్‌ను పడేశారు.
ఈ సాహసోపేతమైన ప్రయోగం వెనుక రైనో షీల్డ్ వ్యవస్థాపకుడు ఎరిక్ వాంగ్ ఆలోచన ఉంది. గతేడాది సంస్థ AirX ప్రొడక్ట్ లైన్‌ను విడుదల చేసిన తర్వాత.. ఆ కేస్ సామర్థ్యాన్ని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పరీక్షించాలని ఆయన అనుకున్నారు. ఈ కంపెనీ వ్యర్థాలను తగ్గించడం కీలక లక్ష్యాల్లో ఒకటి. 2017 నుంచి సంస్థ మోనో-మెటీరియల్ డిజైన్ విధానాన్ని అనుసరిస్తోంది. అంటే కేసులను ఒకే మెటీరియల్‌తో తయారు చేయడం ద్వారా వాటిని 100% రీసైకిల్ చేసేలా రూపొందిస్తోంది. AirX కేస్‌ను డిజైన్, ఆర్‌అండ్‌డీ బృందాలు ఏడాదికి పైగా శ్రమించి అభివృద్ధి చేశాయి. ఒకే మెటీరియల్‌ను ఉపయోగించినప్పటికీ అధిక స్థాయి రక్షణను అందించడమే దీని ప్రత్యేకత.
1.2 మీటర్ల నుంచి అంతరిక్షం వరకు..
సాధారణ ల్యాబ్ డ్రాప్ టెస్టుల్లో ఫోన్‌ను సుమారు 1.2 మీటర్ల ఎత్తు నుంచి పడేస్తారు. కంపెనీ తీవ్ర పరిస్థితుల్లో పరీక్షించేందుకు తమ ఆఫీస్‌లోని ఆరో అంతస్తు నుంచి అంటే సుమారు 23 మీటర్ల ఎత్తు నుంచి కూడా ఫోన్లను పడేస్తుంది. కానీ ఈసారి ఏకంగా స్ట్రాటోస్ఫియర్ (Stratosphere) నుంచి ఫోన్‌ను కిందకు పంపించారు. స్ట్రాటోస్ఫియర్ సుమారు 26,000 నుంచి 36,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే సంస్థ సాధారణంగా నిర్వహించే 23 మీటర్ల డ్రాప్ టెస్ట్ కంటే ఇది 1,000 రెట్లకుపైగా ఎత్తు.
పారాచూట్ కూడా లేదు..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం.. ఈ ప్రయోగంలో పారాచూట్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు. అంతేకాదు, ఫోన్ కేసే ముందుగా భూమిని తాకాలి. దీంతో ప్రయోగం మరింత క్లిష్టంగా మారింది. స్ట్రాటోస్ఫియర్‌లోని పరిస్థితులను అనుకరించేందుకు ఆర్‌అండ్‌డీ బృందం సబ్-జీరో ఫ్రీజింగ్ టెస్టులు, వాతావరణ పీడన పరీక్షలు నిర్వహించింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫోన్, కేసును సిద్ధం చేశారు.
కారు ఎయిర్‌బ్యాగ్ స్ఫూర్తి..
AirX కేస్‌ను కార్లలో ఉపయోగించే ఎయిర్‌బ్యాగ్స్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. స్పోర్ట్స్ షూస్‌లో షాక్‌ను గ్రహించేందుకు ఉపయోగించే ఎయిర్ కుషన్ టెక్నాలజీని కూడా దీని డిజైన్‌లో ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌ను ప్రత్యేక బెలూన్ ద్వారా అంత ఎత్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలేశారు. ఆ తర్వాత అది వేగంగా కిందకు పడింది. ఫోన్‌ను స్వీడన్ లోని ఎస్-రేంజ్ స్పేస్ సెంటర్ ప్రాంతంలో పడేశారు. ఎవరికీ ప్రమాదం జరగకుండా జనావాసాలు లేని అటవీ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేశారు. అయితే అదే కారణంగా ఫోన్‌ను తిరిగి కనుగొనడం పెద్ద సవాలుగా మారింది. ట్రాకింగ్ ద్వారా ఫోన్ ఉన్న ప్రాంతాన్ని సుమారు 2 కిలోమీటర్ల పరిధికి కుదించినప్పటికీ.. దాన్ని గుర్తించేందుకు బృందానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది.
ఫోన్‌ను గుర్తించిన తర్వాత బృందం ఊపిరి పీల్చుకుంది. భారీ ఎత్తు నుంచి పడటం, గాలుల వేగంలో మార్పులు, పడే వేగం, భూమిపై ల్యాండింగ్ సర్ఫేస్ వంటి అంశాలు తమ నియంత్రణలో లేవని కంపెనీ తెలిపింది. అయినప్పటికీ ఫోన్ ఎలాంటి నష్టం లేకుండా లభించడం తమకు ఎంతో ఉపశమనం కలిగించిందని సంస్థ పేర్కొంది. ఈ రికార్డు ద్వారా పర్యావరణహిత ఉత్పత్తులు బలహీనంగా ఉంటాయనే అపోహను తొలగించాలనేది తమ ఉద్దేశమని రైనో షీల్డ్ తెలిపింది. మొబైల్ కేసుల్లో వేర్వేరు మెటీరియల్స్‌ను కలిపి ఉపయోగించడం వల్ల వాటిని రీసైకిల్ చేయడం కష్టమవుతుందని సంస్థ పేర్కొంది.
సాధారణంగా చెప్పే “Military-Grade” రక్షణను దాటి “Space-Grade” ప్రొటెక్షన్ను చూపించాలనే లక్ష్యంతో AirX కేస్‌ను స్ట్రాటోస్ఫియర్ నుంచి డ్రాప్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా స్థిరమైన, సర్క్యులర్ డిజైన్‌తో రూపొందించిన ఉత్పత్తులు భూమిపై మాత్రమే కాకుండా అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ పనిచేయగలవని నిరూపించామని పేర్కొంది.

