ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!

  • : గూగుల్ పిక్సల్ ట్యాగ్ ధర రూ.3,799
  • 4-ప్యాక్: నాలుగు పిక్సల్ ట్యాగ్‌ల ప్యాక్ ధర రూ.12,900.
  • బ్యాటరీ: CR2032 కాయిన్ సెల్‌తో ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.
  • రెసిస్టెన్స్: IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్..
Google Pixel Tag

Google Pixel Tag

Google Pixel Tag: గూగుల్ (Google) నుండి మొదటిసారిగా ఫైండర్ ట్యాగ్ పిక్సల్ ట్యాగ్ (Pixel Tag)ను భారత మార్కెట్లో ప్రకటించింది. తాళాలు, వాలెట్లు, బ్యాగులు, లగేజీ వంటి వస్తువులను సులభంగా ట్రాక్ చేసేందుకు దీన్ని రూపొందించారు. గూగుల్ ఫైండ్ హబ్ (Find Hub) నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ ట్యాగ్.. సమీపంలో ఉన్నప్పుడు బ్లూటూత్ ద్వారా, పరిధికి దూరంగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్‌కు పైగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల నెట్‌వర్క్ సాయంతో వస్తువుల లొకేషన్‌ను గుర్తించగలదు.

డిజైన్, వాటర్ రెసిస్టెన్స్:

ఈ గూగుల్ పిక్సల్ ట్యాగ్ పాలీకార్బొనేట్, మెటల్ నిర్మాణంతో కూడిన సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 46.1 x 28 x 5.4 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండగా, బరువు 11.8 గ్రాములుగా ఉంది. దీనికి IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అంటే గరిష్ఠంగా 1 మీ. లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఉండగలదు. ఈ ట్యాగ్‌లో యూజర్ స్వయంగా మార్చుకోగల CR2032 కాయిన్ సెల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీని అమర్చిన తర్వాత ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్ అందిస్తుందని గూగుల్ తెలిపింది.

బటన్, స్పీకర్‌:

ఈ డివైస్ లో అంతర్నిర్మిత స్పీకర్‌తో పాటు ఒక బటన్ కూడా ఉంటుంది. ట్యాగ్ ఎక్కడ ఉందో గుర్తించలేకపోతే “ఫైండ్ హబ్” ద్వారా స్పీకర్‌తో సౌండ్ ప్లే చేయించి సులభంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా ట్యాగ్‌లోని బటన్‌ను నొక్కడం ద్వారా కనెక్ట్ చేసిన ఫోన్‌కు రింగ్ చేయించవచ్చు. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ ఈ ఫీచర్ పనిచేస్తుంది.
దీనిని ఉపయోగించాలంటే ఆండ్రాయిడ్ 9 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లో పనిచేసే ఆండ్రాయిడ్ ఫోన్ అవసరం. బ్యాటరీ ట్యాబ్‌ను తొలగించిన తర్వాత ట్యాగ్‌ను ఫోన్‌కు దగ్గరగా తీసుకువస్తే ఫాస్ట్ పెయిర్ ద్వారా సులభంగా జత చేసుకోవచ్చు.

ఫైండ్ హబ్ యాప్‌లో ట్యాగ్ చేసిన వస్తువుకు కేటగిరీని ఎంచుకోవచ్చు లేదా కస్టమ్ పేరును ఇవ్వవచ్చు. మ్యాప్‌లో వస్తువు లొకేషన్‌ను చూడటంతో పాటు పిక్సల్ ట్యాగ్ ను గరిష్ఠంగా 10 మందితో షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

టెక్నాలజీలు:

ఈ ట్యాగ్ లో అల్ట్రా-వైడ్ బ్యాండ్ (UWB), బ్లూటూత్ ఛానల్ సౌండింగ్ టెక్నాలజీలు ఉన్నాయి. వీటి ద్వారా “ప్రెసిషన్ ఫైండింగ్” ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ట్యాగ్ సమీపంలో ఉన్నప్పుడు దాని దూరాన్ని మీటర్ స్థాయిలో చూపించడంతో పాటు ఏ దిశలో వెతకాలో కూడా గైడ్ చేస్తుంది. అలాగే “లెఫ్ట్ బిహైండ్ అలర్ట్స్” ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే, ట్యాగ్ చేసిన వస్తువును ఎక్కడైనా వదిలి వెళ్లినప్పుడు ఫోన్‌లో నోటిఫికేషన్ అందుతుంది.

ఆండ్రాయిడ్ డివైజ్‌ల నెట్‌వర్క్:

పిక్సల్ ట్యాగ్ బ్లూటూత్ పరిధికి దూరంగా ఉన్నప్పుడు గూగుల్ ఫైండ్ హబ్ నెట్‌వర్క్ కీలకంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక బిలియన్‌కు పైగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల నెట్‌వర్క్ సాయంతో ట్యాగ్ లొకేషన్‌ను గుర్తించవచ్చు. గూగుల్ ప్రకారం, ఈ నెట్‌వర్క్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. డివైజ్ లొకేషన్ డేటాను స్టోర్ చేయకుండా గోప్యతను కాపాడే విధంగా వ్యవస్థను రూపొందించారు. ఇంకా తెలియని ట్రాకింగ్ ట్యాగ్ తమతో పాటు ప్రయాణిస్తున్నట్లు గుర్తించినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు యూజర్లను అలర్ట్ చేయగలవు. ట్యాగ్‌ను రింగ్ చేయడం, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు అందిస్తాయి.

అంతేకాకుండా ఇది ఇతర పిక్సల్ డివైజ్‌లతో కూడా పనిచేస్తుంది. పిక్సల్ వాచ్ లో “ఫైండ్ హబ్” యాప్ లేదా బ్రౌజర్ ద్వారా ట్యాగ్‌ను గుర్తించి రింగ్ చేయవచ్చు. పిక్సల్ బడ్స్ ఉపయోగిస్తున్నప్పుడు జెమినీని అడిగి పిక్సల్ ట్యాగ్ను రింగ్ చేయించవచ్చు. దీని సన్నని డిజైన్ కారణంగా వాలెట్లలో సులభంగా ఉంచుకోవచ్చు. అలాగే కీలు వంటి వస్తువులకు కూడా జత చేసుకోవచ్చు.

ధర:

భారత మార్కెట్లో గూగుల్ పిక్సల్ ట్యాగ్ ధర రూ.3,799గా నిర్ణయించారు. అలాగే నాలుగు పిక్సల్ ట్యాగ్ ల ప్యాక్ ధర రూ.12,900గా ఉంది. ఇది నవంబర్ 2026 నెల నుంచి అందుబాటులోకి రానుంది.