Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..

Google Job

Google Job

Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం సాధించాలనే కల దాదాపు ప్రతి ఐటీ, నాన్-ఐటీ నిపుణుడికీ ఉంటుంది. కానీ, కేవలం మంచి రెజ్యూమె ఉంటే సరిపోదు. అద్భుతమైన స్కిల్స్, డిగ్రీలు ఉన్నప్పటికీ సరైన విధానం తెలియక చాలామంది సెలక్షన్ ప్రాసెస్‌లో వెనుకబడిపోతుంటారు. సరిగ్గా ఈ సమస్యకే గూగుల్ సీనియర్ టెక్నికల్ రిక్రూటర్ బెన్ మీడ్ ఒక అద్భుతమైన గైడ్ ఇచ్చారు. గూగుల్‌లో జాబ్ కొట్టాలంటే రెజ్యూమె తయారీ నుంచి ఇంటర్వ్యూ వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో ఆయన కొన్ని కీలక టిప్స్ షేర్ చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

మొదటిగా అభ్యర్థులు తమ అనుభవం, ప్రాజెక్ట్‌లను వివరంగా వివరిస్తూ 3 నుంచి 4 పేజీల సమగ్రమైన ‘మాస్టర్ రెజ్యూమె’ను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత, మనం దరఖాస్తు చేయాలనుకుంటున్న జాబ్ డిస్క్రిప్షన్‌ను గూగుల్ జెమిని ఏఐ (Gemini AI) టూల్‌లో ఉంచి, దానికి తగ్గట్టుగా రెజ్యూమెను కస్టమైజ్ చేసుకోవడం చాలా స్మార్ట్ పద్ధతి అని ఆయన సూచించారు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే.. తమ ప్రొఫైల్‌తో సంబంధం లేకుండా కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తుంటారు. అలా కాకుండా, ఒకేసారి పది పోస్టులకు దరఖాస్తు చేయడం కంటే.. మీ అనుభవానికి సరిగ్గా సరిపోయే 2 లేదా 3 రోల్స్ పైనే పూర్తి దృష్టి పెట్టాలని రిక్రూటర్ స్పష్టం చేశారు.

ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే, బిహేవియరల్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ‘STAR’ మెథడ్ ఉపయోగించడం చాలా ముఖ్యం. అంటే ఎస్ (S) అంటే సమస్య లేదా పరిస్థితి ఏంటి? టీ (T) అంటే అందులో మీ బాధ్యత ఏమిటి? ఏ (A) అంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు తీసుకున్న చర్యలు? ఆర్ (R) అంటే దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి? ఈ పద్ధతిలో సమాధానాలు చెబితే రిక్రూటర్లపై మంచి ప్రభావం పడుతుందని వివరించారు. ఇంటర్వ్యూలో కేవలం సరైన సమాధానం చెప్పడం మాత్రమే ముఖ్యం కాదు. ఇచ్చిన సమస్యను మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారనేదే అసలు పరీక్ష. ఒకవేళ ప్రశ్న క్లిష్టంగా ఉంటే, ముందుగా దానికి సంబంధించిన మీ సందేహాలను ఇంటర్వ్యూయర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆలోచనా విధానాన్ని ఒక్కొక్కటిగా వివరిస్తూ పోవాలి. దీనివల్ల మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బయటపడతాయని చెబుతున్నారు.

చివరిగా, గూగుల్‌లో పనిచేయడానికి టీమ్‌వర్క్ చాలా కీలకం. తోటి ఉద్యోగులతో కలిసి ఎలా పనిచేస్తారు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ముఖ్యం. యూజర్ల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, సవాళ్లను ఎదుర్కొని టీమ్‌తో కలిసి సమస్యను పరిష్కరించిన నిజ జీవిత ఉదాహరణలను ఇంటర్వ్యూలో పంచుకోవాలి. మీ ఈ ప్రయత్నాల వల్ల సంస్థకు, టీమ్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో వివరించగలిగితే గూగుల్‌లో కొలువు సాధించడం సులభమవుతుందని సీనియర్ టెక్నికల్ రిక్రూటర్ బెన్ మీడ్ స్పష్టం చేశారు.