Site icon NTV Telugu

Elon Musk Big Plan: ఎలాన్ మస్క్ పెద్ద స్కెచ్‌..! ఐఫోన్‌కు స్టార్‌లింక్‌ ఫోన్‌ పోటీయేనా..?

Elon Musk Starlink Phone

Elon Musk Starlink Phone

Elon Musk Big Plan: ఎలాన్ మస్క్ అంటేనే వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. ఎలక్ట్రిక్ కార్లతో టెస్లా, అంతరిక్ష రంగంలో స్పేస్‌ఎక్స్, ఉపగ్రహ ఇంటర్నెట్‌తో స్టార్‌లింక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ప్రయోగాలు.. ఇలా అనేక రంగాల్లో తన ముద్ర వేసిన మస్క్ ఇప్పుడు మరో కొత్త పరిశ్రమపై దృష్టి పెట్టినట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఈసారి ఆయన చూపు స్మార్ట్‌ఫోన్ రంగంపై పడిందా..? అనే ప్రశ్నలు ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ చాట్‌బాట్లు, అంతరిక్ష అన్వేషణ తర్వాత మస్క్ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం గురించి ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.

స్టార్‌లింక్ ఫోన్ అద్భుతంగా ఉంటుంది..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక యూజర్ “స్టార్‌లింక్ బ్రాండెడ్ ఫోన్ వస్తే అద్భుతంగా ఉంటుంది” అంటూ కామెంట్ చేశాడు. స్టార్‌లింక్ అనేది ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ నిర్వహిస్తున్న ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవ అన్న విషయం తెలిసిందే. అయితే, ఆ యూజర్ కామెంట్‌కు స్పందించిన మస్క్.. ఇది అసాధ్యం కాదు అంటూ బదులిచ్చారు. ఈ ఒక్క మాటతోనే స్టార్‌లింక్ ఫోన్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. మస్క్ ఇప్పటివరకు స్పష్టంగా ఫోన్ విడుదల చేస్తున్నాం అని చెప్పకపోయినా, ఆ అవకాశం ఉందన్న సూచన మాత్రం ఇచ్చారు.

పనితీరే ప్రధాన లక్ష్యం
స్టార్‌లింక్ బ్రాండెడ్ ఫోన్ ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా ఉంటుందని మస్క్ తెలిపారు. ముఖ్యంగా ఈ ఫోన్ గరిష్ట పనితీరు (Performance per Watt) పై పూర్తిగా దృష్టి పెట్టి రూపొందించబడుతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా మస్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనులను వేగంగా నిర్వహించే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) సామర్థ్యాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంటే, ఈ ఫోన్ సాధారణ వినియోగం కంటే అధునాతన AI అప్లికేషన్లు, న్యూరల్ కంప్యూటింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడే అవకాశం ఉందన్న మాట.

ఇదే మొదటిసారి కాదు…
ఎలాన్ మస్క్ స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో టెస్లా ఫోన్ అంటూ అనేక రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే 2024లో మస్క్ స్వయంగా స్పందిస్తూ, ప్రస్తుతం తాను ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌పై పని చేయడం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, టెక్ ప్రపంచంలో మస్క్ ఫోన్ గురించిన చర్చలు మాత్రం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే, స్టార్‌లింక్ ఫోన్ వాస్తవంగా మార్కెట్‌లోకి వస్తే, అది ఐఫోన్‌కు ప్రత్యక్ష పోటీగా మారుతుందా..? అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. అయితే ఉపగ్రహ ఇంటర్నెట్, AI ఆప్టిమైజేషన్, హై-పర్‌ఫార్మెన్స్ హార్డ్‌వేర్ వంటి అంశాలు నిజంగా అమలైతే, ఇది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త అధ్యాయాన్ని తెరవవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇది ఒక ఆలోచనా దశలో ఉన్నా, ఎలాన్ మస్క్ పేరు ఉండటంతో ‘స్టార్‌లింక్ ఫోన్’ అనే మాటే టెక్ ప్రపంచంలో భారీ చర్చకు కారణమవుతోంది. భవిష్యత్తులో ఇది నిజమవుతుందా..? లేదా మరో ఆసక్తికర ప్రయోగంగా మిగిలిపోతుందా..? అన్నది కాలమే తేల్చాలి.

Exit mobile version