Site icon NTV Telugu

ChatGPT Caste Bias: ఏఐ అగ్రకులాలదేనట.. ChatGPTకి కులాన్ని అంటగట్టిన ప్రముఖ ప్రొఫెసర్..

Delhi

Delhi

ChatGPT Caste Bias: భారతదేశంలో కుల రాజకీయాలపై చర్చ మరో కొత్త దశకు చేరింది. విద్య, పరిపాలన, ప్రజాస్వామ్య సంస్థలనే కాదు.. తాజాగా సాంకేతికతను ఈ వివాదంలోకి లాగారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ChatGPTకి కులపరమైన పక్షపాతం ఉందని ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ విజేందర్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. ChatGPT శిక్షణ డేటా ప్రధానంగా అగ్ర కులాల ప్రభావంలో ఉందని వ్యాఖ్యానించారు. UPSC అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించే వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. “ChatGPT ఇప్పటికే కంటెంట్‌పై శిక్షణ పొందింది. ఆ కంటెంట్ అగ్ర కులాల చేత రూపొందించబడినదే. కాబట్టి, అలాంటి పునాదిపై నిర్మితమైన యంత్రం న్యాయం చేయగలదా?” అని ప్రశ్నించారు. ఇంకా ముందుకు వెళ్లిన చౌహాన్, “మన పోరాటం ఇక కేవలం వైస్‌ ఛాన్సలర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి లేదా బ్యూరోక్రాట్లతో మాత్రమే కాదు.. ఇప్పుడు అది అల్గోరిథంలతో కూడా పోరాటం చేయాలి. అల్గోరిథంలు మన మంచి, చెడును గుర్తించే సామర్థ్యాన్ని తీసేస్తాయి” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Illegal Affair: సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన సుబ్బారావు..

ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. చాలా మంది ఆయన వాదనలను విమర్శించారు. మరికొందరు, విద్యావేత్తలు ఐక్యతను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఒక UPSC అభ్యర్థి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “AI లాంటి తటస్థ సాంకేతికతకు కూడా కుల కోణం జోడించడం ఆశ్చర్యకరం. 2026లో కూడా ఇలాంటి కథనాలు వినాల్సి రావడం బాధాకరం. మెంటర్లు సమాజాన్ని కలపాలి, విడదీయకూడదు” అని పేర్కొన్నారు. మొత్తానికి, ChatGPTపై చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సాంకేతిక చర్చకే కాకుండా, భారత సమాజంలో కొనసాగుతున్న కుల సంబంధిత ఉద్రిక్తతలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి. AI వంటి గ్లోబల్ టెక్నాలజీలను సామాజిక, రాజకీయ వాదనల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను ఉత్పన్నమవుతోంది.

Exit mobile version