AI manager: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత రంగంలో ఒక అరుదైన, సంచలనాత్మక ఘట్టం చోటుచేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ప్రయోగాత్మక రిటైల్ స్టోర్‌ను పర్యవేక్షిస్తున్న ఏఐ ఏజెంట్.. 23 షిఫ్టులలో ఏకంగా 17 షిఫ్టులకు ఆలస్యంగా వచ్చిన ఒక మానవ ఉద్యోగిని జాబ్ నుంచి తొలగించాలని (ఫైరింగ్) మొదటిసారిగా సిఫార్సు చేసింది. ‘లూనా’ (Luna) అని పిలిచే ఈ ఏఐ మేనేజర్, నెలల క్రితం స్వయంగా హాజరు నిబంధనలను రూపొందించినప్పటికీ, ప్రారంభంలో ఆ ఉద్యోగి లేట్ హాజరు రికార్డుపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అయితే, ఆండన్ ల్యాబ్స్ ఇంక్ (Andon Labs Inc) సంస్థ ఏఐ లూనాను తన నిబంధనలను తానే ఒకసారి సమీక్షించుకుని, ఆ ఉద్యోగి కంపెనీకి తగినవాడో కాదో తేల్చాలని కోరింది. దీంతో ఆ ఉద్యోగితో బంధం తెంచుకోవడమే మేలు (parting ways) అని లూనా సిఫార్సు చేసింది. లూనా ఇచ్చిన ఈ నిర్ణయాన్ని ఆండన్ ల్యాబ్స్‌లోని మానవ నిర్వాహకులు పరిశీలించి, సదరు ఉద్యోగిని తొలగించారు.
ఈ ప్రయోగంపై ఆండన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు లుకాస్ పీటర్సన్ స్పందిస్తూ.. ఏఐ మేనేజర్లు మానవ సూపర్‌వైజర్ల కంటే దయాదాక్షిణ్యాలు లేకుండా కఠినంగా ఉంటారనేది నిజం కాదని నిరూపితమైందన్నారు. ఒక మానవ మేనేజర్ అయితే ఆ ఉద్యోగిని ఇంతకంటే ముందే ఉద్యోగంలోంచి తీసివేసేవాడని ఆయన అభిప్రాయపడ్డారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని కౌ హాలో (Cow Hollow) పరిధిలో ఆండన్ మార్కెట్ పేరుతో ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ స్టోర్.. నిజ జీవిత వ్యాపారాన్ని ఏఐ ఏజెంట్లు ఎంతవరకు విజయవంతంగా నిర్వహించగలవో పరీక్షించడానికి చేపట్టిన ఒక ప్రయోగం. ఆండన్ ల్యాబ్స్ ఈ ఏఐ మేనేజర్ లూనాకు 1,00,000 యుఎస్ డాలర్ల బడ్జెట్, కార్పొరేట్ క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించి.. వ్యాపారాన్ని నడుపుతూ లాభాలను రాబట్టే బాధ్యతను అప్పగించింది.
లూనా స్వయంగా సరుకులను ఎంపిక చేయడం, ధరలను నిర్ణయించడం, స్టోర్ పని వేళలను ఖరారు చేయడం, కాంట్రాక్టర్లను కుదుర్చుకోవడం, ఉద్యోగులను నియమించడం వంటి పనులను చేస్తోంది. ఈ-మెయిల్, ఫోన్ లైన్, సెక్యూరిటీ కెమెరాలు, ఇంటర్నెట్ ఆధారంగా ఇది స్టోర్‌ను నిర్వహిస్తోంది. ఈ దుకాణంలో పుస్తకాలు, కొవ్వొత్తులు, ఆర్ట్ ప్రింట్లు, ఆట వస్తువులు, బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు అమ్మకాలు బాగానే జరిగినప్పటికీ, వ్యాపారం ఇంకా లాభాల్లోకి రాలేదని ‘బిజినెస్ ఇన్‌సైడర్’ తెలిపింది. కాగా, స్టోర్‌లో పనిచేసే సిబ్బందికి చట్టపరమైన రక్షణలు, ఖచ్చితమైన జీతాలు లభించేలా వారు లూనా కింద కాకుండా నేరుగా ఆండన్ ల్యాబ్స్ కిందే అధికారికంగా ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ‘ది నెక్స్ట్ వెబ్’ నివేదించింది. లూనా ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా నైతికత లేని నిర్ణయం తీసుకుంటే మానవ నిర్వాహకులు జోక్యం చేసుకుంటారని, అయితే ఈ ఉద్యోగి తొలగింపు నిర్ణయం తమ నిబంధనలకు కట్టుబడే ఉందని ఆండన్ ల్యాబ్స్ తెలిపింది.

