NTV Telugu Site icon

Gyanvapi masjid : జ్ఞానవాపి మసీదు కేసును ఎందుకు తిరగదోడారు.? ప్రార్ధన స్థలాల చట్టం ఏం చెబుతోంది?

Sb

Sb

జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కొత్తది కాదు. చాలా కాలంగా నడుస్తున్నదే. ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవాలి. 1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టం చేశారు. 1991లో అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమం సాగుతున్న సమయంలో అంటే, అద్వానీ రథయాత్ర, యూపీలాంటిచోట్ల మతరపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న రోజుల్లో, 1991 సెప్టెంబర్ 18న నాటి పివి నరసింహారావు ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది.

ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం, 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో, అదే రూపంలో కొనసాగుతాయి. వాటి స్థితిగతులను మార్చకూడదు. ఇది దేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చి మొదలైన ప్రార్థనా స్థలాలన్నిటికీ వర్తిస్తుంది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు అయినా, మధురలోని షాహీ ఈద్గా అయినా ఈ చట్టం పరిథిలోకే వస్తుంది. అప్పట్లో ఈ కొత్త చట్టాన్ని పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.

1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్- 3 ప్రకారం, మతపరమైన లేదా అందులోని తెగలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల స్వభావాన్ని లేదా స్వరూపాన్ని మార్చే హక్కు ఏ వ్యక్తికీ లేదు. అదే చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం, 1947 ఆగస్టు 15న నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్వరూపంలో ఉన్నాయో, అలాగే కొనసాగుతాయి. సెక్షన్ 4(2) ప్రకారం, ప్రార్థనా స్థలాల స్వరూప, స్వభావాల విషయంలో మార్పులకు సంబంధించిన ఏ వ్యాజ్యాలు చెల్లవు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ రద్దవుతాయి. కొత్తగా పిటిషన్ వేసే వీలు లేదు. కోర్టు, ట్రిబ్యునల్, ప్రభుత్వ అధికారులు.. ఎవరి ముందూ ఏ దావాలూ చెల్లవు. సెక్షన్ (5) ప్రకారం, అయోధ్య వివాదం ఈ చట్టం పరిధిలోకి రాదు. ఎందుకంటే, స్వతంత్రానికి ముందే ఈ వివాదం కోర్టులో ఉంది. మరో మినహాయింపు, పురావస్తు శాఖ సర్వే పరిధిలోకి వచ్చే ప్రార్థనా స్థలాల నిర్వహణపై పరిమితులు ఉండవు.

అంటే 1991 ప్రార్థనా స్థలాల చట్టం స్పష్టంగానే ఉంది. కానీ, 1991 సంవత్సరానికి ఎన్నో ఏళ్ల క్రితమే జ్ఞాన్‌వాపి మసీదు వివాదం రాజుకుంది. 1809 లో ఈ వివాదం కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. అయితే, దీనిపై అయోధ్య తరహాలో ఎక్కడా కోర్టు కేసులు లేవు. ఎవరూ పిటిషన్లు వేయలేదు. 1991లో ప్రార్థనా స్థలాల చట్టం రూపొందించిన తరువాతే, ఈ మసీదులో సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసినకొద్ది రోజులకే, జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ ప్రార్థనా స్థలాల చట్టాన్ని గుర్తుచేస్తూ, సర్వే పిటిషన్‌ను రద్దు చేయాలని కోరింది. 1993లో అలహాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఆ తరువాత 2017లో, కొందరు వారణాసి సివిల్ కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో, ఎలాంటి స్టే ఆర్డరు అయినా ఆరు నెలల కంటే ఎక్కువ కాలం చెల్లదని, ఆ తరువాత స్టే ఆర్డరును రివ్యూ చేయాలన్న సుప్రీం తీర్పు ఆధారంగా, జ్ఞాన్‌వాపి స్టే ఆర్డర్ చెల్లుబాటుని ప్రశ్నిస్తూ 2019లో వారణాసి సివిల్ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయాలనే డిమాండ్‌ కూడా మొదలైంది. ఈ పిటిషన్‌పై విచారణ తర్వాత, మసీదు ప్రాంగణంలో పురావస్తు సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది. కానీ, మసీదు కమిటీ 1991 చట్టాన్ని గుర్తు చేస్తూ సర్వే రద్దు చేయాలని హైకోర్టును కోరింది. దాంతో, హైకోర్టు ఈ సర్వేపై స్టే విధించింది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు దానిపై ఎటువంటి చట్టపరమైన నిర్ణయం తీసుకోలేదు.

మరోపక్క ఈ తరహా వివాదాలన్నిటికీ ప్రార్థనా స్థలాల చట్టం అడ్డుగా ఉందనే అభిప్రాయాలు పెరిగాయి. దాన్నే లేకుండా చేస్తే ఎన్ని కేసులైనా పెట్టొచ్చనే వాదనలకు బలం చేకూరింది. దీంతో 2020 అక్టోబర్‌లో, బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ లో …ఇలాంటి చట్టం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఇది పబ్లిక్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ కు సంబంధించిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయన వాదించారు. మరొక వాదన రాష్ట్రాల్లో మతపరమైన స్థలాలపై నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయని కూడా వాదించారు. లక్నోకు చెందిన విశ్వభద్ర పూజారి పురోహిత్ మహాసంఘ్ కూడా ఇలాంటి పిటిషనే దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి, కేంద్రాన్ని జవాబివ్వాలని కోరినా, ఇప్పటివరకు కోర్టుకు సమాధానం చెప్పలేదు.

అయితే, 2021 ఆగస్టు 18న జ్ఞాన్‌వాపి మసీదుపై అయిదుగురు మహిళలు వారణాసి కోర్టులో విడిగా పిటిషన్ దాఖలు చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరీ దేవి, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన హిందూ దేవతల విగ్రహాల దర్శనం, పూజలకు అనుమతించాలని కోరారు. కాశీ విశ్వనాథుని ఆలయానికి ఆనుకుని ఉన్న ప్లాట్ నంబర్ 9130లో, ఈ హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని పిటిషన్‌లో తెలిపారు. మసీదు కమిటీ ఈ విగ్రహాలను ధ్వంసం చేయకుండా నిరోధించాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రాచీన ఆలయం ప్రాంగణంలోని దేవతల పూజలు, దర్శనాలకు భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ మొదట జిల్లా కోర్టు, తరువాత హైకోర్టు మసీదు ప్రాంగణాన్ని తనిఖీ చేసేందుకు ఆమోదించాయి. దీంతో వివాదం రాజుకుంది.

2022 ఏప్రిల్ 8న, స్థానిక న్యాయవాది అజయ్ కుమార్‌ను అడ్వకేట్ కమిషనర్‌గా నియమించింది స్థానిక కోర్టు. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. మసీదు కమిటీ దీనిపై హైకోర్టుకి వెళ్లింది. మసీదు కమిటీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మే 16న జ్ఞాన్‌వాపి మసీదు సర్వే ముగిసింది. ఆ నివేదిక అధికారికంగా బయటికి రాకముందే అందుని అంశాల పేరుతో అనేక వాదనలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు విషయం వారణాసి జిల్లా కోర్టులో ఉంది. దీంతో ఇది ఏ మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి ఏర్పడింది.

1990లో అద్వానీ చేపట్టిన రథయాత్రతో దేశ రాజకీయాలు సమూలంగా మారాయి. అయోధ్య ఉద్యమం నుంచి బీజేపీ ఎదుగుదల ప్రారంభమైంది. అయోధ్య వివాదం ప్రభావం ఇతర ప్రార్థనా స్థలాలపై పడకూడదనే ప్రార్థనా స్థలాల చట్టం తీసుకువచ్చారు. కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ చట్టం మనుగడే ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.

నిజానికి కాశీలో జ్ఞాన్‌వాపి మసీదు అయినా, మధురలోని షాహీ ఈద్గా అయినా ప్రార్థనా స్థలాల చట్టం పరిథిలోకే వస్తుంది. జ్ఞాన్‌వాపి కేసు 1991లో చట్టంగా మారిన తర్వాతే కోర్టుకు చేరింది. కాబట్టి జ్ఞాన్‌వాపి కేసుకు ఈ చట్టం ఒక రక్షణ కవచంలా ఉండాల్సిందే. ఈ చట్టంలో..స్వాతంత్య్రానికి ముందు అనటంతో అయోధ్య దాని నుంచి మినహాయింపు పొందింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం అయోధ్య మినహా మిగిలిన స్థలాలపై ఎలాంటి వ్యాజ్యాలు అనుమతించరాదు. ఒకవేళ జరిగినా అది 1947 ఆగష్టు 15 పరిస్థితిని పునరుద్ధరించడం కోసం తప్ప అంతకన్నా వెనక్కు వెళ్లకూడదు. ఈ చట్టాన్ని పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాంటప్పుడు అయిదు వందల ఏళ్ల కిందట ఔరంగజేబు హయాంలో ఏదో విధ్వంసం జరిగిందన్న వివాదాన్ని వారణాసి కోర్టు ఎలా స్వీకరించిందనేది కీలక ప్రశ్న. పైగా ఇప్పుడు సుప్రీం కోర్టు తిరిగి అక్కడికే పంపటం మరీ విచిత్రం.

నిజానికి అయోధ్య కాలంలో ఇప్పుడు అయోధ్య, తర్వాత కాశీ, మధుర అనే నినాదాలు వినిపించాయి. 1992లో బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఇరవయ్యేడేళ్లకు సుప్రీం కోర్టు ఆ స్థలాన్ని హిందూ సంస్థలకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇది అయోధ్యకే పరిమితమని 1991 ప్రార్థనా స్థలాల చట్టం వల్ల మళ్లీ మళ్లీ ఇలాంటి వివాదాలు ముందుకు తెచ్చే అవకాశం లేదనీ ఆ సమయంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ మరీ మరీ చెప్పారు. కానీ, ఇలాంటివి ఇప్పట్లో ఆగవని జ్ఞానవాపి మసీదు తాజా పరిణామాలు దేశాన్ని హెచ్చరిస్తున్నాయి. పైగా వీటికి అత్యున్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేయకపోగా కొనసాగటానికి దోహదం చేయడంపై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నిజానికి వారణాసి మేజిస్ట్రేట్‌ వీడియో సర్వేకు ఆదేశించటపై మసీదు కమిటీ సుప్రీంకు వెళ్లింది. అక్కడే ఈ వివాదానికి అపెక్స్‌ కోర్టు ముగింపు పలకాల్సి ఉంది. కానీ, జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం కేసును తిరిగి స్థానిక కోర్టులకే పంపించింది. ఈ ధోరణితో కోర్టు ఇస్తున్న సంకేతాలేమిటి? స్థానిక కోర్టు మెజిస్ట్రేట్‌ ఇప్పటికే వీడియో సర్వే చేయించారు. అవి బయటకు వచ్చేశాయి. ఇది చట్ట ప్రకారం సరైన నిర్ణయం కాదు. కానీ, ఇది కూడా సుప్రీం కోర్టుకు తప్పుగా అనిపించలేదు. ఒక ప్రార్థనా స్థలం మత నేపథ్యాన్ని లేదా స్వభావాన్ని నిర్ధారిస్తే తప్పేమిటని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. అంటే ఇప్పుడు వారణాసి జిల్లా కోర్టు ఈ పిటిషన్‌కు 1991 చట్టం వర్తించేది లేనిదీ తేలుస్తుందన్న మాట. కోర్టుల ధోరణి మరికొందరికి అవకాశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

దేశ చరిత్రను పరిశీలిస్తే, ఆలయాలు, మసీదులు, బౌద్ధ, జైన ఆరామాలు అనేకం ద్వంసమైన సందర్భాలు కనిపిస్తాయి.
పాలకుల ఇష్టాయిష్టాలకు, ఆసక్తులకు, ఆధిపత్య ధోరణికి అనుగుణంగా ఇలాంటి వినాశనాలు జరిగాయి. రాజ్య విస్తరణ కోసం కొందరు, మత కోణంలోనూ కొందరు ఈ విధ్వంసాలకు పాల్పడ్డారు. అవన్నీ నిజమే అయినా, వందల ఏళ్లు గడిచిపోయాక వాటిని తవ్వుతూ కూచోవడంతో ప్రయోజనమేంటి? ఇప్పుడు దేశంలో అనేక ఆలయాల, మసీదుల పునాదుల్లో ఇతర ఆనవాళ్లు అనేకం కనిపిస్తాయి. ఆఖరికి స్థానిక దేవుళ్ల విగ్రహాలైనా దొరికే ఛాన్సుంది. అలాంటపుడు తవ్వుకుంటూ పోవటానికి అంతేముంది?

ఇలా జరగరాదనే కదా, 1991 చట్టం చేసింది? సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ విషయంలో కచ్చితమైన వైఖరి తీసుకోకపోవటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు జిల్లా జడ్జి మరిన్ని చర్యలను అనుమతిస్తే వాటి పర్యవసానాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక వ్యాజ్యం చట్ట బద్ధం కానపుడు, దాన్ని స్వీకరించి అనవసరంగా సమయం వృథా చేసుకోవడం దేనికని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. కాని ఇప్పుడు జరిగింది అందుకు పూర్తి భిన్నం. అంటే ఇప్పుడు ప్రతి పురాతన మసీదు లోనూ సర్వేలు, నిర్ధారణలు చేస్తారా?

మరోపక్క మధురలో ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంపై పిటిషన్‌ను జిల్లా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అక్కడ కృష్ణ మందిరానికి, షాహి ఈద్గాకు మధ్య వివాదం వుంది. మసీదును తొలగించాలంటూ భగవాన్‌ శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ మిత్ర కృష్ణదేవ్‌ ఆలయం ఆస్థాన్‌ శ్రీకృష్ణ జన్మభూమి తరపున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని 2020లో ఒక స్థానిక కోర్టు తిరస్కరించగా ఇప్పుడు జిల్లా కోర్టు స్వీకరించింది. అంటే కాశీ, మధుర కేసులతో పాటు ఇప్పుడు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో పాత భోపాల్‌ చౌక్‌ లోని జామా మసీదు కూడా శివాలయంపై నిర్మించబడింది అంటూ, అక్కడ సమగ్రమైన పురావస్తు సర్వే జరపాలని ప్రభుత్వానికి మెమోరాండంలు వెళ్లాయి. ఇది దేశమంతా అన్ని రాష్ట్రాల్లో జరిగితే దాని ఫలితాలు ఎలా ఉంటాయి?

దేశంలో7వ శతాబ్దం నుండి హిందూ రాజులు, ఆ తర్వాత ముస్లిం రాజులు శత్రురాజులు కట్టించిన, పోషించిన దేవాలయాలను దోచుకోవడమో, పునర్నిర్మించడమో, ధ్వంసం చేయడమో చేశారు. ఇది మనదేశానికే పరిమితమైంది కాదు. యూరప్ చరిత్రలో మతపరమైన ఘర్షణలతో, చర్చిలను ధ్వంసం చేసిన ఘటనలు అనేకం కనిపిస్తాయి. అందుకే చరిత్రను చరిత్రగా చూడాలి తప్ప, వాస్తవంలో లెక్క సరిచేయాలని చూడకూడదు…

సింపుల్‌ గా చెప్తే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సమస్యల పక్కన మందిరం మసీదు సమస్యలు ముఖ్యమైనవా?
ఈ దేవుళ్లు, దేవతలు, గుళ్లూ గోపురాలకు ముందు కూడా భారత సమాజం ఉంది. ఆ పునాదులపైనే నేటి ఆలయాలు మసీదులు కట్టారు. ఇలా పునాదులు తవ్వుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. మతాన్ని రాజకీయాల్ని కలిపి, వ్యూహాలు రచిస్తే అది అంతిమంతా దేశానికే నష్టం. ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయాలనే వాదనలు మరింత ప్రమాదకరం. ఇది దేశాన్ని మరింత అభద్రతలో పడిచేస్తుంది. అందుకే ఈ వివాదాలకు ఎక్కడో ఒక చోట ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిందే.