Story Board: బంగ్లాదేశ్ రావణకాష్ఠంలా రగులుతోంది. గతంలో హసీనాను దేశం వదిలిపోయేలా చేసిన విద్యార్థులు.. ఇప్పుడు యూనస్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కారణం ఏదైనా.. ఛాన్స్ దొరకగానే.. భారత్ పై అకారణ ద్వేషం వెళ్లగక్కుతున్నారు. పనిగట్టుకుని మైనార్టీలుగా ఉన్న హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓ యువకుడ్ని సజీవదహనం చేయడం భారత్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడేలా చేసింది.
Read Also: Salman Khan-MS Dhoni : బురదలో ఆడుతున్న ధోని, సల్మాన్.. క్రేజీ ఫోటోలు వైరల్..
బంగ్లాదేశ్ శరవేగంగా పాకిస్తాన్ ను మించిపోతున్న దుస్థితి కనిపిస్తోంది. మొన్నటిదాకా అభివృద్ధి పథంలో పురోగమించిన పొరుగు దేశంలో.. ఉన్నట్టుండి అరాచక శక్తులు నిద్రలేచాయి. ఇన్నాళ్లుగా క్రియాశీలకంగా లేని పాక్ అనుకూల శక్తులు.. ఇప్పుడు రెచ్చిపోతున్నాయి. మొదట భారత్ అనుకూల నేత అయిన షేక్ హసీనాను పనిగట్టుకుని దేశాన్నుంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు ఆమె పార్టీ అవామీలీగ్ ను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించేలా చేశారు. అంతటితో ఆగకుండా బంగ్లాదేశ్‌లో భారత్ మూలాలున్నవారెవరూ ఉండకూడదనే పైశాచికత్వంతో అరాచకం సృష్టిస్తున్నారు. గతంలోనే విద్యార్థి ఉద్యమం ముసుగులో అసాంఘిక శక్తులు స్వైరవిహారం చేశాయి. అప్పట్నుంచీ ఆ అరాచక శక్తులే బంగ్లాదేశ్‌లో నిత్యం అల్లర్లు,ఘర్షణలకు కారణమౌతున్నాయి. చివరకు తాత్కాలిక ప్రభుత్వం కూడా వారి చెప్పుచేతల్లో ఉండటంతో.. 16 నెలలైనా బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు.
Read Also: Atal Bihari Vajpayee Jayanti: ఏపీలో ఘనంగా అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు
కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్ లో మారణకాండ గురించి మాట్లాడితే.. మన దేశంలో కూడా కొన్ని వర్గాలు వారి అంతర్గత వ్యవహారంలో జోక్యం కూడదని సుద్దులు చెప్పాయి. కానీ అప్పుడు, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మైనార్టీలను కసిగా వేటాడుతున్నారు. ఎవరు తప్పు చేసినా.. శిక్ష మాత్రం భారత్ మూలాలున్నవారికే పడుతోంది. అల్లర్లు, దాడులు, ఆస్తుల ధ్వంసం అయిపోయి.. ఏకంగా దారుణ హత్యలకు తెగబడేదాకా పరిస్థితి విషమించింది. ఇప్పుడు జరుగుతున్న అరాచకానికి వారు చెబుతున్న కారణం.. విద్యార్థి నేత హత్య. ఆ హత్య చేసింది తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నవారే అని కూడా వారే చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వంపై పోరాడకుండా.. హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో.. అకారణంగా భారత్ పై ఎందుకు విషం కక్కుతున్నారో ఆరా తీస్తే.. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన కుట్ర కోణం బహిర్గతమవుతోంది.
Read Also: Health Benefits of Carrots: క్యారెట్ తినడం వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే..
గతంలో భారత్ మూలాలున్న వారినే టార్గెట్ చేశారు. ఈసారి అరాచకం శృతిమించింది. అరాచక శక్తుల విద్వేషం పరిధులు దాటింది. కనీస దౌత్యమర్యాదల్నీ గాలికొదిలేసింది. ఏకంగా ఢాకా, చిట్టకాంగ్‌లో ఉన్న భారత్ రాయబార కార్యాలయం, హైకమిషన్ ఆఫీసులపై దాడులు.. భారత్ దౌత్య సిబ్బంది నివాసాలపై దాడులు చేసే స్థాయికి వెళ్లింది. ఈ అసాంఘిక శక్తుల నైచ్యానికి.. రెండు ప్రాంతాల్లో భారత్ కాన్సులేట్లు కూడా మూసేసి.. వీసాల జారీ నిలిపేసింది. ఇంకా చిత్రం ఏమిటంటే.. ఓవైపు నొసటితో వెక్కిరిస్తూ.. మరోవైపు నోటితో నవ్వే ప్రయత్నం చేస్తోంది బంగ్లాదేశ్. భారత్ తో మైత్రే కావాలని చిలక పలుకులు పలుకుతోంది. భారత్ దౌత్యవేత్తలపై దాడిని కళ్లప్పగించి చూస్తూ.. ఢిల్లీలో సాధారణ నిరసననే.. శృతి మించిన పోకడగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. ఏకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం, అక్కడి మీడియా కలిసి.. భారత్‌పై విద్వేషాన్ని మరింతగా పెంచి పోషిస్తున్నాయి. నోటికొచ్చిన కూతలు, చేతికొచ్చిన రాతలతో బంగ్లాదేశీయుల మెదళ్లలో విషం నింపుతున్నాయి. బంగ్లాదేశ్ పుట్టుకకు కారణమైన భారత్‌ను పరమశత్రువుగా నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నాయి. అదేమంటే.. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం అంటూ ఆరున్నొక్క రాగం తీస్తున్నాయి.
కనీసం బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు రక్షణ కల్పించమంటే.. వారు సురక్షితంగానే ఉన్నారని బుకాయిస్తున్నారు. సజీవదహనమైన వ్యక్తి హత్యపై విచారణ చేయమన్నా మీనమేషాలు లెక్కిస్తున్నారు. జరిగిన తీవ్ర సంఘటనల్ని చిన్నవిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. అసలు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దుర్ఘటనలు చూస్తుంటే.. ఆ దేశం శరవేగంగా పతనమౌతోందని తేలిపోతోంది.
ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న కల్లోలాన్ని ఆషామాషీగా తీసుకోవటానికి లేదు. ఎందుకంటే ఏడున్నర దశాబ్దాలుగా అస్థిరతకు, అనిశ్చితికి పెట్టింది పేరైన పాకిస్తాన్‌లో కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో అక్కడి మైనార్టీలపై దాడులు జరగలేదు. పాలకులు మారినా, చివరకు దేశాధినేతల్ని బహిరంగంగా ఉరి తీసినా.. పాక్ సైన్యం నియంతృత్వం వచ్చినా.. ఇప్పటికీ పాకిస్తాన్ ఏదోలా తంటాలు పడి ఓ దేశంగా మనుగడ సాగిస్తోంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం అందుకు భిన్నంగా ఐదు దశాబ్దాల సుస్థిరతను చేజేతులా కాల్చి బూడిద చేస్తోంది. కేవలం 16 నెలల వ్యవధిలో కల్లోలిక దేశంగా ముద్ర పడింది. చివరకు ఐక్యరాజ్యసమితి కూడా బంగ్లాలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేయాల్సిన దుస్థితి. మొన్నటిదాకా తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే.. పరిస్థితి కుదుటపడుతుందనే చిన్న ఆశైనా ఉండేది. కానీ ఇప్పుడు విద్యార్థి నేతల హత్య తర్వాత రగిలిన ఆగ్రహజ్వాలల్ని చూస్తే.. ఎన్నికలు నిర్వహించటానికి కూడా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలేమోననే కొత్త అనుమానాలు వస్తున్నాయి.
మొత్తం మీద ప్రస్తుత ప్రపంచంలో కళ్ల ముందే కూలిపోతున్న సార్వభౌమత్వానికి అతి పెద్ద నిదర్శనంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది. దక్షిణాసియాలో భారత్ తర్వాత కుదురుగా ఉన్న దేశంగా ఉన్న పేరును స్వయంకృతాలతో చెడగొట్టుకుంటోంది. మొత్తంగా బంగ్లా భావిపౌరుల భవితకు మరణ శాసనం రాస్తోంది. బంగ్లాదేశ్ దుస్థితి ఇలాగే కొనసాగితే.. ఆ దేశం ఎప్పటికి కుదుటపడుతుందనేది ఎవరూ చెప్పలేరు. బంగ్లా దుస్థితిపై అందరి కంటే ఎక్కువగా బాధపడుతున్న దేశం భారతే. బంగ్లాదేశ్ ఏర్పాటు దగ్గర్నుంచీ.. సుస్థిర దేశంగా మనుగడ సాగించేవరకూ అడుగడుగునా చేయూత అందించి.. ఓ తల్లిలా ప్రేమించి.. తండ్రిలా నడిపించిన భారత్.. ఇప్పుడు బంగ్లాదేశ్ దుస్థితిని చూసి.. తీవ్రంగా మథనపడుతోంది. అప్పటికీ ఆ దేశాన్ని ఓ దారికి తెద్దామనుకున్నా.. అకారణ ద్వేషం ఎదురుతంతున్న విషమస్థితి.
భారత్ పై కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్.. మన సాయం లేకపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని మరిచిపోతోంది. ఇప్పటికీ భారత్ నుంచి వచ్చే వస్తువులే.. బంగ్లాదేశ్‌ను నిలబెడుతున్నాయనేది నిష్ఠుర సత్యం. ఇప్పటికే పాక్ మాదిరిగా బంగ్లాపైనా సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనే డిమాండ్ వస్తోంది. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అక్కర్లేదని, కేవలం గోధుమల సరఫరా నిలిపేస్తే చాలనే అభిప్రాయాలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘర్షణలపై కొన్నాళ్లుగా భారత్ ప్రభుత్వం కన్నేసి ఉంచింది. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్య సంబంధాలు దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు అనేక కీలక రంగాల్లో పరస్పరం ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ రోజువారీ జీవితం, పరిశ్రమలు, ఆహార భద్రతకు అవసరమైన అనేక వస్తువుల కోసం భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన ఒత్తిడి, అలాగే బంగ్లాదేశ్‌లోని అంతర్గత రాజకీయ అస్థిరత ఈ వాణిజ్య ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. సరఫరా గొలుసుల్లో అంతరాయం ఏర్పడితే.. అక్కడి ప్రజల రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం పడే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్ ఆహార భద్రతకు అత్యంత కీలకం గోధుమలు. భారత్ నుంచి పెద్ద ఎత్తున గోధుమలు దిగుమతి అవుతుంటాయి. నిషేధానికి ముందు కాలంలో మాత్రమే భారత గోధుమల దిగుమతుల విలువ సుమారు 734 మిలియన్ డాలర్లకు పైగా ఉండగా.. ఇది లక్షల టన్నుల పరిమాణంలో జరిగింది. నిషేధం తరువాత కొంతమేర మినహాయింపులతో మాత్రమే సరఫరా కొనసాగింది. బియ్యం విషయంలో కూడా భారత్ బంగ్లాదేశ్‌కు ప్రధాన సరఫరాదారే. బాస్మతి కాకుండా సాధారణ బియ్యం రకాలను బంగ్లాదేశ్ తన దేశీయ అవసరాలు, ప్రభుత్వ నిల్వల కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. చక్కెర మరో ముఖ్యమైన ఉత్పత్తి. ఆహార తయారీ పరిశ్రమతో పాటు గృహ వినియోగానికి కూడా ఇది అవసరం. ఒకే సంవత్సరంలో భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు వందల మిలియన్ డాలర్ల విలువైన చక్కెర ఎగుమతి జరిగింది. ఇవే కాకుండా రోజువారీ వంటలో ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి వంటి కూరగాయలు కూడా ప్రధానంగా భారత్ నుంచే వస్తాయి. వీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే, బంగ్లాదేశ్‌లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ద్రవ్యోల్బణం కట్టుదాటి.. ఆర్థిక సంక్షోభం తప్పదు. అదే విధంగా సుగంధ ద్రవ్యాలు, ఇతర ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కూడా భారత ఎగుమతుల్లో ముఖ్యమైన భాగం. ఇవి బంగ్లాదేశ్ వినియోగదారుల అవసరాలతో పాటు ఆహార పరిశ్రమను నిలబెడతాయి.
బంగ్లాదేశ్ ఆర్థికవ్యవస్థకు కీలకం వస్త్ర పరిశ్రమ. ఆ పరిశ్రమకు పత్తి వెన్నెముక లాంటిది. భారత్ నుంచి వెళ్లే మొత్తం పత్తి ఎగుమతుల్లో సుమారు మూడవ వంతు బంగ్లాదేశ్‌కే చేరుతుంది. ఇదే కాకుండా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్‌లు, ఉక్కు, విద్యుత్ పరికరాలు వంటి పారిశ్రామిక వస్తువులు కూడా భారత్ నుంచే పెద్ద ఎత్తున దిగుమతి అవుతాయి. మందులు, వైద్య పరికరాలు విషయంలోనూ భారత్ బంగ్లాదేశ్‌కు ప్రధాన సరఫరాదారుగా ఉంది. ఇలా అన్నిరకాలుగా భారత్ సరఫరాలపై ఆధారపడ్డ బంగ్లాదేశ్.. పెంచిన చేతినే కాటేయటానికి ఉబలాటపడుతుండటం.. నమ్మకద్రోహానికి పరాకాష్ఠ.
భౌగోళికంగా బంగ్లాదేశ్‌కు భారత్‌తో 4,300 కి.మీ.లకు పైగా సరిహద్దు ఉంది. దాదాపు 94 శాతం భూసరిహద్దు భారత్‌తోనే పంచుకుంటుంది. ఈ సామీప్యత వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉండటం, సరఫరా వేగంగా చేరడం బంగ్లాదేశ్‌కు పెద్ద లాభం. అందుకే చౌకగా, త్వరగా లభించే భారతీయ వస్తువులపై అక్కడి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 16 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. బంగ్లాదేశ్ భారత్‌కు ఎగుమతులు చేస్తున్నప్పటికీ, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉంది. గత ఎనిమిదేళ్లలో భారత్ బంగ్లాదేశ్‌కు సుమారు 8 బిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయాన్ని అందించింది. రహదారులు, రైల్వేలు, పోర్టులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఈ సహకారం వల్ల షేక్ హసీనా పాలన కాలంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. మొత్తం GDP, తలసరి ఆదాయం రెండూ భారీగా పెరిగాయి. అందుకే భారత్‌తో వాణిజ్య సంబంధాల్లో వచ్చే ఏ చిన్న అంతరాయం కూడా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సంగతి తెలిసీ బంగ్లాదేశ్.. భారత్‌ను కవ్వించే దుస్సాహసం చేస్తోంది.
అసలు బంగ్లాదేశ్ అవసరాలేంటో తెలిసిన సర్కారు అక్కడ ఉందా అనేది ఇంకా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇంతవరకూ కుదురుకోని యూనస్ ప్రభుత్వం.. అక్కడి ప్రజల అవసరాలు, అవి తీర్చే మార్గాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. ఏ పూటకు ఆ పూట గడిస్తే చాలు.. ఇవాళ ఎక్కడా అల్లర్లు జరగకపోతే అదే పదివేలు అనుకుంటూ పొద్దుపుచ్చటం అక్కడి సర్కారుకు అలవాటైపోయింది. ఈ మొత్తం కల్లోలంలో బంగ్లా సైన్యం పాత్ర గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల బంగ్లా సైన్యం పాక్ ఆర్మీ కనుసన్నల్లో పనిచేస్తోందని, దేశాన్ని గుప్పిటపట్టే విషయంలో.. పాక్ ఆర్మీ జనరళ్ల దగ్గర చిట్కాలు నేర్చుకుంటోందనే వార్తలు కలవరపెడుతున్నాయి. అవే నిజమైతే బంగ్లాదేశ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. అప్పుడు భారత్ కు పాక్ కంటే బంగ్లాదేశ్ పెద్ద ముప్పై కూర్చుంటుందనే ఆందోళన కూడా లేకపోలేదు.
మొత్తం మీద బంగ్లాదేశ్ దుస్థితి కంటే.. దాని కారణంగా మనపై పడే ప్రభావమే ఎక్కువగా కలవరపెడుతున్న విషయం అని చెప్పటానికి పెద్దగా సందేహించాల్సిన పనిలేదు. స్థిరమైన ప్రభుత్వం అంటే అంతకు మించింది లేదు. కనీసం తాత్కాలిక ప్రభుత్వ నియంత్రణ ఉన్నా.. పోనీలే అనుకోవచ్చు. అదీ కాదని సైన్యం నియంత్రణలో ఉన్నా.. ఎవరో ఒకరితో చర్చలు జరపొచ్చనే భావన ఉండొచ్చు. కానీ అసలు బంగ్లాదేశ్ ఎవరి చేతుల్లో ఉందో తెలియని దైన్యం ఆ దేశానిది. దారీతెన్నూ లేకుండా ఉన్న బంగ్లాదేశ్ ఎప్పటికి ఓ కొలిక్కి వస్తుందో పక్కనపెడితే.. అక్కడ కట్టు దాటిన విద్వేషం భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందోననే బెంగ భారత్ కు తప్పటం లేదు.
గతంలో షేక్ హసీనా ఏకపక్ష వైఖరే.. బంగ్లాదేశ్‌లో అల్లర్లకు కారణమైందన్నారు. ఇప్పుడు విద్యార్థి నేత హత్యను సాకుగా చూపి.. యూనస్‌ను బెదిరిస్తున్నారు. కానీ అంతర్లీనంగా భారత్ పై అంతులేని విద్వేషమే కనిపిస్తోంది. ఇదే అదనుగా పాక్ అనుకూల శక్తులు చెలరేగుతున్నాయి. తెర వెనుకుండి అమెరికా, చైనా కూడా వికృత రాజకీయ క్రీడకు తెరలేపాయనే వాదన వినిపిస్తోంది.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. పొయ్యిలో పుల్ల కావాలన్నాడట మరొకరు, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కల్లోలం చల్లారాలని భారత్ కోరుకుంటుంటే.. అదలాగే ఎగసి పడాలని మరికొన్ని దేశాలు కోరుకుంటున్నాయి. దాయాది పాకిస్తాన్ ఎలాగూ బంగ్లా చితిలో చలి కాచుకుందామనే అనుకుంటుంది. చైనాదీ అదే బాపతు. ఈ రెండు దేశాలకూ బంగ్లా చిచ్చుతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయంటే ఏదో అనుకోవచ్చు. కానీ సైలంట్ కిల్లర్‌లాగా అమెరికా కూడా బంగ్లా అగ్నికి ఆజ్యం పోస్తోందనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మూడు దేశాలూ భారత్ ముందరి కాళ్లకు బంధాలు వేయటానికి.. బంగ్లాదేశ్‌లో విద్వేషాగ్నిని ఎగదోస్తున్నాయి. తద్వారా భారత్ అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.
ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ వెనుకబడటమే కాకుండా పాకిస్తాన్ కబంధహస్తాలలో పూర్తిగా చిక్కుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ దురాగతాల నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసింది భారత్ అయినప్పటికీ, పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ భద్రత గురించి మాట్లాడుతుండడంతో దీని ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ నాయకుడు ఇప్పుడు భారత్‌ను బెదిరించాడు. భారత్ బంగ్లాదేశ్‌పై దాడి చేస్తే, పాకిస్తాన్ తన శక్తినంతా ఉపయోగించి ఢాకాకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తద్వారా భారత్ బంగ్లాపై దాడి చేయొచ్చనే విషాన్ని బంగ్లాదేశీయుల మెదళ్లలో ఎక్కించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు భారత్ బంగ్లాదేశ్ విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నా.. పాకిస్తాన్ విద్వేషాగ్ని ఎగదోసే ప్రయత్నం చేయడం ఎందుకో.. ఆ అవసరం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బంగ్లా ఆవిర్భావం నుంచీ అక్కడ పనిచేస్తున్న పాక్ అనుకూల శక్తులు.. ఇప్పుడు స్వైరవిహారం చేస్తున్నాయి. ఓ పద్ధతి ప్రకారం భారత్ తో బంగ్లా మైత్రీ బంధాన్ని తెంచటానికి సుదీర్ఘ ప్రయత్నం చేసిన అరాచక శక్తులకు.. విద్యార్థి ఉద్యమం అందివచ్చింది. దీంతో అదే అదనుగా బంగ్లాదేశ్‌ను తమ కబంధ హస్తాల్లో బంధించటానికి కాచుకున్న పాక్ ప్రేరేపిత శక్తులు.. ఏకంగా ఆ దేశాన్ని పాక్ కనుసన్నల్లో పనిచేసేలా చేయాలని కంకణం కట్టుకున్నాయి. అంతేకాదు బంగ్లా భూభాగాన్ని భారత్ పై పోరుకు లాంచింగ్ గ్రౌండ్‌గా వాడుకోవాలనే దురాలోచన చేస్తున్నాయి. అందుకు కొందరు అతివాద బంగ్లాదేశ్ యువత తోడవడంతో.. వారి పని మరింత తేలికవుతోంది. ఈ పరిణామాలు గమనించే కొన్నాళ్ల క్రితం బంగ్లా సరిహద్దుల్లో భారత్ సైన్యం బలగాల మోహరింపుతో పాటు అప్రమత్తత స్థాయినీ పెంచింది. కానీ ప్రస్తుత పాకిస్తాన్ తీరు చూస్తుంటే.. బంగ్లాదేశ్ ను భారత్ కు విద్రోహ దేశంగా తయారుచేసే పని ఉధృతం చేసిన పరిస్థితి కళ్లకు కడుతోంది.
బంగ్లాలో సాధారణ పరిస్థితి నెలకొనడం మనకూ చాలా అవసరం. ఇప్పటికే చుట్టుపక్కల దేశాల్లో సంక్షోభాలు భారత్ కు తలనొప్పిగా మారాయి. కొత్తగా బంగ్లాదేశ్ లో మొదలైన సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగటం.. ఈ తలనొప్పి మరింత పెంచేదే. ఈ సంక్షోభంలో చైనా పాత్ర ఉందనే అనుమానాలు వస్తున్న తరుణంలో.. భారత్ ఆ దిశగా కూడా కూపీ లాగే ప్రయత్నం చేస్తోంది. నాలుగు చైనా దేశ కంపెనీలు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కి సమీపంలో స్మార్ట్ సిటీ, మెట్రో రైల్ ప్రాజెక్ట్ లు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసాయి. ప్రతిఫలంగా స్మార్ట్ సిటీలో ప్లాట్స్ అమ్మేసిన తర్వాత వచ్చే లాభాన్ని చైనా కంపెనీలు ఆర్జించునున్నాయి. దీనివలన పర్యావరణ కాలుష్యం జరగవచ్చు. కానీ చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీతో పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తామని చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం చిట్టగాంగ్ నగర అభివృద్ధి అని చెబుతున్నప్పటికీ, వ్యూహాత్మకమైన చిట్టగాంగ్ లోని పోర్ట్ ని స్వాధీనం చేసుకోడానికి మొదటి అడుగుగా అర్ధం చేసుకోవచ్చు.
శ్రీలంకలోని హంబన్ తోట పోర్ట్ ని అభివృద్ధి పేరుతో ఇలానే చైనా ప్రతిపాదించి ఆఖరుకి 99 సంవత్సరాల లీజ్ కి స్వాధీనపర్చుకుంది. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్‌లో చైనా పడగ నీడ మరింత భయపెడుతోంది. ప్రతిదేశంలో అభివృద్ధికి సహకారం పేరిట ఎంటరయ్యే చైనా.. మొదట్లో ఇబ్బడిముబ్బడిగా అప్పులిస్తుంది. తర్వాత సదరు దేశం దివాళా తీసేలా చేస్తుంది. ఈ విషయంలో కళ్ల ముందే ప్రత్యక్ష ఉదాహరణలున్నా.. బంగ్లా దేశ్ కూడా చిన్నగా డ్రాగన్ బంధంలో చిక్కుకోవడం కూడా మనకు ఊహించని ముప్పును కొనితెస్తుందనటంలో సందేహం లేదు. . చైనాతో హసీనా సర్కారు ఒప్పందాలు చేసుకున్నా.. ఆమెను డ్రాగన్ పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయాలున్నాయి. హసీనా భారత్ కు మద్దతుదారు కాబట్టి.. ప్రతిపక్షానికి మద్దతివ్వడమే మంచిపని అని చైనా భావించి ఉండొచ్చు. ఆ ఉద్దేశంతోనే రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎగదోసి. హసీనా సీటు కిందకు నీళ్లు తెచ్చి.. దేశం నుంచి తరిమేశారనే చర్చ జరుగుతోంది. హసీనా బంగ్లాదేశ్ ను వీడితేనే.. ఆ దేశం సాయంతో భారత్‌కు ఇబ్బందులు సృష్టించడం తేలికవుతుందని చైనా వ్యూహకర్తలు ప్రణాళిక రచించారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదన నిజమైతే.. భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా.. చైనా డ్రాగన్ డాన్స్ కు బంగ్లాదేశ్ సరికొత్త వేదికవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సరే పాక్, చైనా భారత్ వ్యతిరేక ధోరణితో బంగ్లాదేశ్‌లో అరాచకాన్ని ఎగదోస్తున్నాయనుకుందాం. కానీ వీటికి మించి అమెరికా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. బంగ్లా విపక్ష నేత ఖలీదా జియా, తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌తోనే కాదు విద్యార్థి ఉద్యమ నేతలతోనూ.. కొన్నాళ్ల క్రితం అమెరికా కీలక సమావేశం ఏర్పాటు చేసిందంటే నమ్మాల్సిందే. ఆ మీటింగ్ కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా లండన్‌లో ప్లాన్ చేసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారానికి కచ్చితమైన ఆధారం లేకపోయినా.. పూర్తిగా తోసిపుచ్చే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ కల్లోలం విషయంలో అమెరికా స్పందనలే అందుకు నిదర్శనం. విద్యార్థి ఉద్యమ నేతల హత్యను ఖండించిన అమెరికా, పాశ్చాత్య దేశాలు.. హిందూ యువకుడి సజీవదహనంపై మాత్రం అంత తీవ్రంగా స్పందించలేదు. దీంతో ఆ దేశాల ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ఇలా భారత్‌ను నేరుగా ఢీకొట్టడం కంటే పరోక్షంగా తలనొప్పుులు సృష్టించి వెనక్కిలాగే ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. ఇప్పటికే శ్రీలంక సంక్షోభం కూడా ఆ విషయాన్ని కొంత నిరూపించింది. ఇప్పుడుం బంగ్లాదేశ్ దాన్ని పూర్తిగా బలపరుస్తోంది. ఇప్పుడు ఎలాగోలా శ్రీలంక కుదుటపడటంతో.. భారత్ ఊపిరి పీల్చుకుందామనుకుంది. కానీ ఆ కాస్త గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు బంగ్లా రూపంలో ఆరని విద్వేషాగ్ని సిద్ధంగా ఉంది.
