STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!

Story

Story

తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఏడాదిగా నిర్మాతకు నికరంగా లాభాలు మిగిల్చిన సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వందల కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమాలు.. రిలీజ్ ఎప్పుడో తెలియని దుస్థితిలో ఉన్నాయి. దీంతో నిర్మాతకు రిలీజ్‌కు ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ ఏడాది జరిగితే.. సీజీ వర్క్‌కు రెండుమూడేళ్లు తీసుకుంటూ.. ఏళ్ల తరబడి సాగదీస్తున్నారు. అంత టైమ్‌ తీసుకున్న సినిమాలు కూడా రిలీజయ్యాక.. సీజీ వర్కా బాగాలేదనే టాక్ తొలిరోజే బయటికొస్తోంది. ఇలా వందల కోట్ల బడ్జెట్లు.. ఏళ్ల తరబడి షూటింగులతో సినిమా రిలీజ్‌ కు ముందే నిర్మాతలు మునిగిపోతున్న దుస్థితి టాలీవుడ్‌లో కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో పడింది. గడిచిన ఏడాదిలో అసలు హిట్ మాటే వినలేదంటున్నారు. ఇంకా మాట్లాడితే పుష్ప 2 తర్వాత నిర్మాతలకు నికరంగా డబ్బులు మిగిల్చిన సినిమా లేదని టాలీవుడ్ నిట్టూరుస్తోంది. సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఎప్పుడో మునిగారు. పెద్ద నిర్మాతల స్థితి కూడా పైన పటారం. లోన లొటారంలా ఉంది. చివరకు అమెరికాలో సంపాదించిన డబ్బులతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా మునిగిపోతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో మొదట్నుంచీ విజయాల శాతం తక్కువే. ఎన్నో లెక్కలు వేసుకుని.. ఎంతో జాగ్రత్తగా తీసే సినిమాలే ఆడతాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాంటిది అసలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా.. గాల్లో లెక్కలు వేసుకుని తీసే సినిమాల గురించి చెప్పాల్సిన పనే లేదు. మొదట్లో కథల ఎంపిక కోసం ఏళ్ల తరబడి చర్చలు జరిగేవి. ఒకసారి కథ తయారయ్యాక కూడా 24 విభాగాల వారి సలహాలు తీసుకునేవారు. అలా బాగా నలిగిన, మార్పులు చేర్పులు చేసిన కథనే తెరకెక్కించేవారు. అలాగే కథకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక ఉండేది. కాంబినేషన్ల కోసం ఆరాటం, క్రేజ్ ఉన్న నటులే ఉండాలనే జంఝాటం ఏమీ ఉండేవి కాదు. పెద్ద హీరోలు అడిగినా కూడా.. ఈ కథ మీకు సరిపడదని నిర్మాతలు, దర్శకులు నిర్మొహమాటంగా చెప్పేసేవారు. ఎందుకంటే అప్పుడు కథే హీరో. సినిమాకే సింహాసనం. నటీనటులు, మిగతా వారికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఆ రోజుల్లో ఓ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కితే.. దాన్ని మిగతా భాషల్లోనూ డబ్ చేసేవారు. అప్పుడు డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ డబ్బులొచ్చేవి. కొన్ని సినిమాలు నేరుగా పెట్టుబడి తేలేకపోయినా.. డబ్బింగ్ రైట్స్ తో నిర్మాతలు గట్టెక్కిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. కాంబినేషన్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు.

 

గతంతో పోలిస్తే తెలుగు సినిమాకు హంగులు, ఆర్భాటాలు చాలా ఎక్కువయ్యాయి. మార్కెట్‌ కూడా పెరిగిందని కొన్ని హిట్ సినిమాల కలెక్షన్లు చూపించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఏం మారినా.. విజయాల శాతం మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఏటా వందల సినిమాలు రిలీజ్ కావడమే కానీ.. డబ్బులు తెచ్చే సినిమాలు మాత్రం కనిపించడం లేదు. అడపాదడపా హిట్టయ్యే సినిమాల గురించి చెప్పుకోవడమే కానీ.. రెగ్యులర్‌గా లాభాలు మాత్రం రావడం లేదు. ఇఫ్పటికే సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యల ప్రభావం చూచాయగా కనిపిస్తూనే ఉంది. కాకపోతే నిర్మాతలు మాత్రం కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది కాబట్టి.. పైన పటారం.. లోన లొటారం స్థితిని మెయింటైన్ చేస్తున్నారు. అమెరికాలో 10-20 ఏళ్ల పాటు డబ్బులు సంపాదించుకుని.. ఆ డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్న ఎన్నారై నిర్మాతలు కూడా నిండా మునుగుతున్నారు. వీరు మొదట పరిమిత స్థాయిలో సినిమాలు తీసి.. కాస్త లాభం కనిపించగానే.. నలుగురైదురు హీరోలు, డైరక్టర్లకు అడ్వాన్సులిచ్చి అడ్డంగా బుక్కైపోతున్నారు.

సినిమా అంటేనే నిర్మాత.ఆయన కనుసన్నల్లోనే తొలితరం నుంచి సినీ పరిశ్రమ నడుస్తు ఉంది. హెమ్ ఎమ్ రెడ్డి,రఘుపతి కయ్య, వై.వి.రావు, డూండీ, కె మీనాక్షి నాయుడు లాంటి హేమా హేమీలు మద్రాస్ నగరంలో తెలుగోడి సత్తాను తెలుగు చిత్రంతో చెప్పే ప్రయత్నంలో విజయవంతం అయ్యారు.వారిని అనుసరిస్తూ పలువురు ఫైనాన్షియర్లు,భూస్వాములు కూడా ఈ ఫీల్డ్ లోకి వెళ్లి సినిమాల నిర్మాణం చేపట్టారు.తొలినాళ్లలో అలా వెళ్ళినవారంతా మంచి అభిరుచిగల నిర్మాతలే.కాని రాను రాను పరిస్థితి మారిపోయింది.

ఎన్నో కారణాలతో తెలుగు సినిమా సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది.సక్సెస్‌ ఎప్పుడూ 10శాతమే అయినా.. నష్టాలు భారీ స్థాయిలో వుంటున్నాయి. దీనికి కారణం ఒకటని చెప్పలేం. మొత్తం మీద అన్ని సమస్యలూ కలిసి ఫైనల్‌గా నిర్మాతను మాత్రం నిండా ముంచేస్తున్నాయి. ఈ పరిస్థతి మారితేనే చిత్రపరిశ్రమకు మంచి రోజులొస్తాయ. వంద కోట్లు పెడిత కాదు.. మంచి కథ, కథనంతోనే సినిమా ఆడుతుందనే విషయాన్ని గుర్తించాలి. కథలో లాజిక్ లేకపోయినా.. స్క్రీన్ ప్లేతో అయినా మ్యాజిక్ చేయాలి. ఏదీ చేయకుండా వదిలితే మాత్రం భరించడానికి ఆడియన్స్ సిద్ధంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా మారాలి. తెలివి తెచ్చుకోవాలి. తెలుగు వాళ్లకు సినిమా అనేది ఓ కల్చర్. అత్యంత చవకైన వినోద సాధనం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పుడు చాలా మంది ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం సినిమాకి వెళ్లేవాళ్లు. ఏ సినిమా అయినా పర్లేదనే ధోరణి కూడా ఉండేది. కానీ టికెట్ ధరలు పెరిగాక.. సినిమా లగ్జరీ అయిపోయింది. టైమ్ పాస్ కోసం సినిమా అనే కల్చర్ పోయింది. దీంతో ఓ వర్గం ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలు వచ్చాక మధ్యతరగతి కూడా పూర్తిగా థియేటర్ కు దూరమైపోయింది. అంతంత రేట్లు పెట్టి టికెట్లు కొని సినిమా చూసే బదులు.. కొద్దిరోజులైతే ఓటీటీలో ఫ్యామిలీ మొత్తం చూడొచ్చనే భావన పెరిగింది. దీనికి తోడు సినిమా కంటెంట్ విషయంలో కూడా మేకర్స్ దృష్టి పెట్టడం లేదనే ఫిర్యాదులున్నాయి. గతంతో పోలిస్తే ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారిందని తెలిసినా.. విభిన్నమైన ఆలోచనలకు ఆదరణ దక్కుతున్నా.. టాలీవుడ్ మాత్రం మూస పద్ధతిలో వెళ్తోందనే విమర్శలున్నాయి. టికెట్ రేటుకు తగ్గ క్వాలిటీ కోరుకుంటున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సంగతి గుర్తించి పద్ధతి మార్చుకోకపోతే.. కష్టాలు తప్పవనే అభిప్రాయాలున్నాయి

ఒకప్పుడు స్క్రిప్ట్ పూర్తయ్యాక, నటీనటుల డేట్స్‌ అన్నీ కుదిరితేనే దర్శక-నిర్మాతలు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేవారు. రానురానూ మార్పులు వచ్చాయి. షూటింగ్‌ మొదలయ్యే ముందు కూడా సన్నివేశాలు రాసుకుంటూ కూర్చోవడం వల్ల సినిమా వ్యయం పెరిగిపోవడమే కాకుండా, నాణ్యతా దెబ్బతింటోందని సీనియర్‌ నటులు, రచయితలు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. స్క్రిప్ట్‌ పూర్తయిన తర్వాత మరింత మెరుగు కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ, అప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు రాయడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. ఇక సృజనాత్మకత పేరుతో దర్శకులు వేయించే సెట్లు, అనవసర హంగులు, విదేశీ ప్రయాణాలు.. ఇవన్నీ నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడు చేస్తున్నాయి. ఇవన్నీ నిర్మాతలపై మోయలేని భారం మోపి.. అంతిమంగా టాలీవుడ్‌కి తీరని నష్టం చేస్తున్నాయి.

ఇక్కడ సినీ పరిశ్రమకు ఎవరో పని గట్టుకుని నష్టాలు తేవడం లేదు. స్వయంగా చిత్ర పరిశ్రమే చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోంది. ఇప్పటికే సగం మునిగింది. కనీసం ఇప్పటికైనా మేలుకోకపోతే.. నిండా మునిగే ప్రమాదం లేకపోలేదు. అనారోగ్యకర పోకడల్ని మొదట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదు. కానీ పెడ ధోరణుల్ని ట్రెండ్ గా, కొత్త తరహా మార్కెటింగ్ సూత్రాలుగా చెప్పుకుని అదే ఒరవడిలో కొట్టుకుపోతున్నారు. ఎవరైనా సీనియర్లు సలహాలివ్వబోయినా.. వినిపించుకోవడం లేదు. అదేమంటే కాలం మారిందని చెబుతూ.. తెలుగు సినిమాని చేజేతులా చంపేయటానికి కంకణం కట్టుకున్నారు. కనీసం తెలుగు సినిమాల్ని ఓటీటీలు కూడా ఎందుకు కొనడం లేదని ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పటికైనా టాలీవుడ్ ఆత్మావలోకనం చేసుకోకపోతే.. రాబోయే రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఒకటుండేది అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. అందుక ఇకనైనా ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకునే ప్రయాస మానేసి.. అందరూ కలిసి సమష్టి బాధ్యత తీసుకుంటే కానీ.. తెలుగు సినిమా పరిశ్రమ గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు.