Telangana Congress Politics : తెలంగాణ కాంగ్రెస్ గందగోళంలో పడినట్టు కనిపిస్తోంది. ఓవైపు బీజేపీ యాత్రలు, విమర్శలతో జోరు పెంచుతోంది. మరోవైపు టీఆర్ఎస్ కేంద్రాన్ని సూటిగా విమర్శిస్తూ వేడి పెంచుతోంది. కాంగ్రెస్ మాత్రం ఇంకా ఇల్లు చక్కదిద్దుకునే పనిలోనే ఉంది. ఉన్న గట్టి నేతల్ని కూడా నిలబెట్టుకునే స్థితి లేకపోవడం.. క్యాడర్ కు నిరాశ కలిగిస్తోంది.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్ లో మాత్రం చలనం రావడం, నాలుగైదు నెలల క్రితం గ్రౌండ్ లో వచ్చిన ఊపును కూడా చేజార్చుకుంటోంది. అందివస్తున్న అవకాశాల్ని కూడా అందిపుచ్చుకోలేక సతమతమౌతోంది.
తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలున్న బీజేపీ హడావుడి చేస్తోంది. గ్రౌండ్ లో పట్టు కోసం ప్రతి రోజూ ప్రయత్నిస్తోంది. అధికార టీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో.. కాంగ్రెస్ కూడా రేసులో నిలవాలంటే.. ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు మీటింగులు, సిట్టింగులతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికీ అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. కాంగ్రెస్ వ్యవహారశైలికి అద్దం పడుతోంది. ఏ విషయాన్నైనా తెగేదేకా లాగటం, సమస్య పెద్దదయ్యే వరకు వేచి చూసే ధోరణి పార్టీ పుట్టి ముంచుతున్నాయి. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన బీజేపీ.. ఈ రాష్ట్రం తమకు ఎంత ముఖ్యమో స్వయంగా ప్రధాని మోడీతోనే చెప్పించింది. నిజానికి కాంగ్రెస్ కు కూడా నాలుగైదు నెలల క్రితం గ్రౌండ్ లో మంచి ఊపు కనిపించింది. కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో పార్టీ విఫలమౌతోంది. వరుస కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వచ్చిన అవకాశాల్ని చేజార్చుకుంటోంది.
తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎన్నికల వాతావరణం తీసుకొచ్చాయి. కానీ కాంగ్రెస్ లో మాత్రం ప్రిపరేషన్ కనిపించడం లేదు. స్వయంగా అధిష్టానం జోక్యం చేసుకున్న తర్వాత కూడా పార్టీలో అంతర్గత పోరు కొలిక్కిరాలేదు. పీసీసీకి వ్యతిరేకంగా కొందరు సీనియర్లు తీసుకుంటున్న వైఖరి.. కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేస్తోంది. సర్వశక్తులు కూడదీసుకుని ప్రత్యర్థులపై యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వ్యవహరిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ గట్టి క్యాడర్ ఉంది. పార్టీ కూడా బలంగానే ఉంది. కానీ నాయకత్వం, ఐకమత్యం లేకపోవడమే సమస్యగా మారింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది. ఆయన బీజేపీలోకి వెళ్తానని ఓపెన్ గా చెబుతున్నా.. ప్రత్యామ్నాయ నేత ఎవరు అనేది తేల్చుకోలేకపోతోంది. ఇలా ఏ విషయంలో చూసినా నాన్చుడు ధోరణి మార్చుకోవడం లేదు. నాలుగైదు నెలల క్రితం ఎన్నికల కోసం వివిధ కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. ఇప్పడున్న స్థితిలో ఆ ప్లాన్ ఉందా.. లేదా అనేది తెలియడం లేదు.
కొన్నాళ్ల క్రితం వరుస కార్యక్రమాలతో ఫుల్ జోష్ లోకి వచ్చిన క్యాడర్.. ఇప్పుడు నీరస పడుతోంది. ప్రత్యర్థి పార్టీలు ఎవరి కార్యాచరణ వారు తీసుకుంటోంటే.. పార్టీ మాత్రం తనకేం పట్టనట్టుగా ఉందనే భావన వారిలో ఉంది. ఏదోకటి చేయాలని క్యాడర్ ఉత్సహంగా ఉన్నా.. నేతల్లో ఐక్యత లేక.. కాంగ్రెస్ బండి ముందుకు కదలడం లేదు. గాంధీభవన్లో మీటింగులు, ఢిల్లీలో సమావేశాలు ఎన్ని జరిగినా.. మార్పు కనిపించడం లేదు. అసలు ఈ సమావేశాలతో ఏం సాధించారని కార్యకర్తలనే ప్రశ్నించే పరిస్థితి.
కాంగ్రెస్ కి క్యాడర్ ఉంది. ఓటేయడానికి ఓటు బ్యాంకు కూడా ఉంది. కాస్త కష్టపడితే.. టీఆర్ఎస్ కు అన్నిచోట్లా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ పార్టీ తీరు మాత్రం వేరేగా ఉంది. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం 2023 ఆఖర్లో ఎన్నికలు జరగాలి. ముందస్తు వచ్చినా ఆశ్చర్యం లేదనే వాదనలున్నాయి. అయినా సరే కాంగ్రెస్ లో మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. ఇంతవరకు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఆరాతీసి, ఆశావహుల స్థితిగతులు, అభ్యర్థుల ఎంపిక ప్రాథమిక కసరత్తు కూడా మొదలుపెట్టినట్టు లేదు. ఎన్నికలు ముంచుకొస్తుంటే.. ఇంకా మీనమేషాలు లెక్కిస్తే ఎలాగని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటున్న నేతలు.. పనిచేయడానికి ముందుకు రావడం లేదు. కొందరైతే వారు పనిచేయరు.. ఇతరుల్ని పనిచేయనివ్వరు. పార్టీ ఏ ప్రోగ్రామ్ చేపడదామనుకున్నా.. అడ్డుపుల్లలు వేసేవారు ఎక్కువయ్యారు. నేతల తీరుతో అధిష్టానం పంపిన పరిశీలకులు కూడా విసిగిపోయే స్థితి. పార్టీని ఎలా గెలిపించాలో ఆలోచించాలని హైకమాండ్ సూచిస్తుంటే.. నేతలు మాత్రం అంతర్గత పోరుతో బిజీగా ఉన్నారు. ఎవరూ మరొకరితో కలవడానికి ముందుకు రావడం లేదు. కలిసి పనిచేయడం సంగతి తర్వాత.. కనీసం ఉమ్మడిగా ఆలోచన చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. మూడోసారి నెగ్గాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ నేతల సహాయ నిరాకరణ పెద్ద సమస్యగా మారింది. కొన్ని చోట్ల కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నా.. నేతలు మెట్టు దిగడం లేదు. పార్టీ కోసం కలిసి పనిచేయాలని క్యాడర్ కు హితవు చెప్పాల్సింది పోయి.. వారితోనే క్లాసులు పీకించుకునే పరిస్థితిలో ఉన్నారు.
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే.. క్యాడర్ పరంగా పటిష్ఠంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం దీటుగా మాట్లాడటం లేదు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందనే వాదన ఉంది. కనీసం అక్కడైనా గట్టి కార్యక్రమాలు చేపట్టాలనే డిమాండ్ ఉన్నా పట్టించుకోవడం లేదు. పార్టీ ఇలాగే ఉంటే.. ఉన్న కొంత మంది నేతలు కూడా వేరే దారి చూసుకుంటారని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవటానికి ఓ ప్రణాళిక, దానికి తగ్గ కార్యాచరణ ప్రధానం. కానీ కాంగ్రెస్ మాత్రం మీటింగులతోనే సరిపెడుతోంది. యాక్షన్ లోకి దిగడానికి సంశయిస్తోంది. ప్రత్యర్థులు ముందుకు దూసుకుపోతున్నా.. కాంగ్రెస్ అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. గాంధీభవన్లో ఒక్క రూమ్ లో గంట పాటు ప్రశాంతంగా మాట్లాడుకోలేని నేతలు.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలా కార్యక్రమాలు చేపడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.
తెలంగాణ తామే ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నా.. ప్రజలు మాత్రం ఆ పార్టీకి పట్టం కట్టడం లేదు. వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ఇప్పుడు మూడో ఎన్నికల్లో అయినా గెలుపు సంగతి అటుంచితే.. గట్టిగా ఎన్ని సీట్లొస్తాయంటే చెప్పలేని పరిస్థితి ఉంది. అవకాశాలు వస్తున్నా అందిపుచ్చుకోకపోవడం, నేతల మధ్య సఖ్యత కరువు కావడం కాంగ్రెస్ కు సమస్యగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ పేరుకే ప్రధాన ప్రతిపక్షం. కానీ ఆ హోదాకి తగ్గట్టుగా ప్రజాపోరాటాలు చేయడం లేదనే విమర్శ ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలున్న బీజేపీ దూకుడు చూపిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తేలిపోతోంది. తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లైంది. ఈ ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ రాజకీయంగా చాలా అవకాశాలొచ్చాయి. కానీ అన్నింటినీ చేజేతులా జారవిడుచుకుంది. కొన్ని అధిష్ఠానం కారణంగా మిస్సైతే.. మరికొన్ని రాష్ట్ర నేతల స్వయంకృతాపరాధాల వల్లే అందకుండా పోయాయి.
టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమౌతోంది. పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నేతలు కూడా ఇప్పుడు గాంధీ భవన్ ముఖం చూడకపోవడం మైనస్ గా మారుతోంది. కొందరు మాజీ మంత్రులు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితమౌతున్నారు. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపిన నేతలు.. ఇప్పుడు అంత చురుగ్గా లేకపోవడం పార్టీ వర్గాలకు అంతుబట్టని రహస్యం. రేవంత్ పీసీసీ చీఫ్ గా వచ్చిన తర్వాత విభేదాల సంగతి పక్కనపెడితే.. అంతకుముందు కూడా పరిస్థితులేమీ బాగాలేవు. పీసీసీ చీఫ్ గా ఎవరున్నా.. ఫిర్యాదులు మాత్రం మామూలే అన్నట్టుంది పరిస్థితి. గాంధీభవన్ లో సమావేశానికి వచ్చినా ఆధిపత్య ప్రదర్శనే తప్ప.. ఐక్యంగా వ్యూహాలు రచించాలనే ఆలోచన చేయడం లేదు. బాధ్యత తీసుకోమంటే ఎవరూ ముందుకు రారు. ఎవరో ఒకరికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత.. వారికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టమంటే మాత్రం క్యూ కడతారు. ఇదీ టీ కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి. పార్టీ వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయినా నేతలకు చీమ కుట్టినట్టైనా ఉండటం లేదు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే కసి లేకపోవడం.. కార్యకర్తలు కూడా నిరాశపడేలా చేస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ సమస్యలున్నాయి. ఎక్కడికక్కడ ప్రజల్ని కూడదీసుకుని పోరాటాలు చేస్తే.. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో ఆదరణ పెరిగే అవకాశం ఉంది. కానీ నేతలు మాత్రం ఆ పని చేయడం లేదు. ఉన్న కాస్త ఆదరణ కూడా పోగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఈసారి అధికారం మాదే. కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది లాంటి పడికట్టు ప్రకటనలే కానీ.. అసలు పార్టీ వ్యూహమేంటి అంటే ఎవరూ ఏమీ చెప్పలేని స్థితి. గాంధీభవన్లోనే ఇంత అయోమయం ఉంటే.. ఇక క్షేత్రస్థాయిలో కార్యకర్తల గురించి చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను నేతలు ఎప్పుడో వదిలేశారు. ఎప్పటికప్పుడు క్యాడర్ ను యాక్టివ్ గా ఉంచేలా వరుస కార్యక్రమాలు ఉండాలని తెలిసినా.. ఆ ఊసే లేదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు రెండు, మూడు సభలు పెట్టి హడావుడి చేయడం.. మళ్లీ నెలల తరబడి సైలంట్ కావడం రివాజుగా మారింది. ఈ పద్ధతి మారనంతవరకూ కాంగ్రెస్ ను ప్రజలు సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు.
తెలంగాణ ఇచ్చింది తామే అని చెబుతారు కానీ.. టీఆర్ఎస్ ను గట్టిగా కౌంటర్ చేయలేకపోతున్నారు. కేసీఆర్ రహస్యాలన్నీ తమ దగ్గరున్నాయని చెప్పే నేతలు.. అవేంటో మాత్రం చెప్పరు. ప్రజలకు ఇప్పటికే ఉన్న కన్ప్యూజన్ మరింత పెరిగేలా నేతల మాటలు ఉంటున్నాయి. కనీసం ఉద్యమ సమయంలో తమ పాత్రేంటో ప్రజలకు వివరించడంలో కూడా నేతలు విఫలమౌతున్నారు. ఓవైపు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనేంతగా కేసీఆర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నా.. కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతోంది. ఇలా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ తేలిపోతుంటంతో.. అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ కు పోటీయే కాదని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నా.. ఆ ఓటుబ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. గ్రామస్థాయిలో కార్యకర్తలకు దిక్కెవరో తెలియడం లేదు. పీసీసీ సంగతి పక్కనపెడితే.. జిల్లాల్లో కూడా అధ్యక్షుల మాట చెల్లడం లేదు. ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షుల మధ్య కూడా సఖ్యత లేదు.
పీసీసీ చీఫ్ తనదైన వ్యూహంతో ముందుకెళ్తుంటే.. సీనియర్లు కౌంటర్ వ్యూహానికి పదును పెడుతున్నారు. ఎవరికి వారే సొంత వ్యూహాలు రచించుకుంటూ.. పార్టీ కాడి కిందపడేస్తున్నారు. ఈ పద్ధతి మారాలని అధిష్ఠానం ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండటం లేదు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, గెలుపోటముల బాధ్యత తనదే అని రేవంత్ అంటారు. కాంగ్రెస్ లో ఒక్కరి పెత్తనం నడవదని చెబుతారు సీనియర్లు. ఈ పాయింట్ దగ్గరే గాంధీభవన్లో జరిగే ప్రతి మీటింగూ ఫలితం లేకుండా ముగుస్తోంది. మీటింగ్ లో జరుగుతున్న నిర్ణయాలకు.. బయట జరుగుతున్న పనులకు పొంతన ఉండటం లేదు.
యుద్ధం గెలవాలంటే పోరాటం కంటే ముందు వ్యూహమే ప్రధనం. కానీ గత రెండు ఎన్నికల్లోనూ ఈ వ్యూహమే వికటించి కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఇప్పుడైతే అసలు వ్యూహమేంటో కూడా అర్థం కావడం లేదంటున్నారు కార్యకర్తలు. ఉపఎన్నికల సమయంలో కూడా ప్రతిచోటా ఒకే ఎనర్జీతో పోరాటం చేయలేదు. కొన్నిచోట్ల సీరియస్ గా తీసుకుంటే.. మరికొన్నిచోట్ల ముందే కాడి కింద పడేశారు. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కనపెడితే.. పోరాటంలో సీరియస్ నెస్ లేకపోతే మాత్రం దెబ్బతింటామని క్యాడర్ నుంచి హెచ్చరికలు వస్తున్నా.. నేతలు పట్టించుకోవడం లేదు. పార్టీ బాగుంటేనే తమకు గౌరవం ఉంటుందనే సంగతి వదిలేసి.. ఇగోల కోసం పార్టీని బలిపెట్టడానికి సిద్ధమౌతున్నారు.
తెలంగాణలో చాలా నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇంఛార్జులు లేరు. కొన్నిచోట్ల అనధికారిక ఇంఛార్జులున్నా.. వాళ్లు యాక్టివ్ గా ఉండటం లేదు. కొంతమంది నేతలైతే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. గాంధీభవన్ నుంచి పిలుపొచ్చినా అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. వీళ్లలో ఎంతమంది పార్టీలో కొనసాగుతారో.. ఎంతమంది పక్కచూపులు చూస్తారో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడి నేతలు వెళ్లిపోవడం ఖాయమని కార్యకర్తలే చెబుతున్న పరిస్థితి ఉంది. అయినా సరే అలాంటి నేతల్నే పట్టుకుని వేలాడుతున్నారనే విమర్శలున్నాయి. ఎవరి మీదా ఎవరికీ నమ్మకం లేదు. ఎవరూ ఎవరి మాటా వినేవాళ్లు లేరు. ఎవరికి వారే యమునా తీరే.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.