హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. కొనేవారు లేక బిల్డర్లు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆర్థిక మాంద్యం భయంతో…లోబడ్జెట్ అపార్ట్‌మెంట్లు, రీసేల్ ఫ్లాట్లు అమ్ముడవడం లేదు. ఈ ఎఫెక్ట్ మిగిలిన రంగాలపై పడుతోంది. ప్రభుత్వ ఖాజానా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఒకవైపు రియల్టర్లు రేట్లు తగ్గించడం లేదు…మరోవైపు కొనుగోలుదారులు కొట్టు పెట్టేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో రియల్ పతనానికి బ్రేకులు పడటం లేదు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లు ఎక్కడికక్కడి ఆగిపోయాయి. కొత్తవి నిర్మాణం కావడం లేదు. ఉన్నవి వాటిని కొనేందుకు జనం సాహాసించడం లేదు. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయంతో…అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్లు వెనక్కి తీసుకుంటున్నారు. వడ్డీలకు తెచ్చిన నిర్మించిన రియల్టర్లు లబోదిబో అంటున్నారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఆకాశహర్మ్యాలే కాదు…విల్లా ప్రాజెక్టులు సైతం ఓ రేంజ్‌లో దూసుకెళ్లాయి. ఫ్లాట్ అయినా, విల్లా అయినా ఐటీ కారిడార్‌కు సమీపంలో అధిక డిమాండ్ ఉండటంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు జనం మొగ్గుచూపారు. ఇదంత గతం…ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల నిర్మాణం ఆగిపోయింది. కొత్తవి నిర్మాణం జరగడం లేదు. ఉన్న వాటిని కంప్లీట్ చేయడం చేయడం లేదు. 2022లో పతనమైన రియల్ ఎస్టేట్…ఇప్పటికీ కోలుకోవడం లేదు. మరో రెండు మూడేళ్లు ఇలాగే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక అపార్ట్‌మెంట్ కూడా బుక్ అవడం లేదు. సంక్షోభం వస్తుందన్న అంచనాలు జనాలను అడుగు ముందుకు వేయనివ్వడం లేదు. ఇప్పటికే బుక్ చేసిన వాళ్లు కూడా డ్రాప్ అవుతున్నారు. ఇచ్చిన అడ్వాన్స్‌లు వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో 2 రూపాయలకు వడ్డీలకు తెచ్చి అపార్ట్‌మెంట్లు, విల్లాలు, డుప్లెక్స్‌లను నిర్మించిన రియల్టర్లు లబోదిబో అంటున్నారు.
ఆర్థిక సంక్షోభం వస్తుందన్న భయంతో కొత్తగా ఇల్లు కొనాలంటే వణికిపోతున్నారు. కొనుగోలు చేయాలని సిద్ధమైన వారు కూడా…మాంద్యం భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఒకవైపు మాంద్యం…మరోవైపు యుద్ధంతో జనం అల్లాడిపోతున్నారు. చేతిలో ఉన్న డబ్బును బయటకు తీసేందుకు ససేమిరా అంటున్నారు. హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. రియల్టర్లు ఇబ్బడిముబ్బడి అపార్ట్‌మెంట్లు, విల్లాలు, డుప్లెక్స్‌లు నిర్మించారు. అవసరానికి మించి నిర్మాణాలు చేయడం…రేట్లు తగ్గించకపోవడంతో ఇళ్ల కొనుగోలుకు జనం ఆసక్తి చూపడం లేదు. అమెరికా-ఇరాన్ యుద్దంతో నిర్మాణ ఖర్చు ఊహించని విధంగా పెరిగిపోయింది. స్టీల్, సిమెంట్ రేట్లు భగభగ మండుతున్నాయి. హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం కొనాలంటే కనీసం 2కోట్లు పెట్టాల్సి వస్తోంది. అదే త్రిబుల్ బెడ్ రూం అయితే…3 కోట్లు అవుతోంది. వీటికి అదనం జీఎస్టీలు, రిజిస్ట్రేషన్ చార్జీలను రియాల్టర్లు బాదుతున్నారు.
హైదరాబాద్‌లో ఎంత అద్భుతంగా కట్టినా ఎస్‌ఎఫ్‌టీకి 3వేలు కంటే ఎక్కువ ఖర్చు కాదు. అయితే రియల్టర్లు, బిల్డర్లు మాత్రం పది వేలు చెబుతున్నారు. తగ్గించడానికి ఒక్కరు ముందుకు రావడం లేదు. దీనికి అదనంగా ఫ్లోర్‌కు ఒక రేటు పెడుతున్నారు. అంతేనా…ఈస్ట్ ఫేస్‌కు ఒక రేటు…కార్నర్ ఫ్లాట్‌కు అయితే మరో ధర…అన్ని ఒకే అనుకుంటే రిజిస్ట్రేషన్ చార్జీలు, రెండేళ్ల పాటు మెయింటెనెన్స్ చార్జీలు వేస్తున్నారు. దీంతో సొంతిళ్లు కొనుగోలు చేయాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. సంవత్సరానికి 12 లక్షలు జీతం తీసుకునే వారికి బ్యాంక్‌లు కూడా కోటి రూపాయల కంటే ఎక్కువ రుణం రాదు. మరో కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ? అందుకే హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, డుప్లెక్స్ హౌస్‌లు కొనుగోళ్లు ఆగిపోయాయి. రియల్ ఎస్టేట్ పతనం అయిందని బిల్డర్లు రేట్లు తగ్గించరు…ఆసక్తి ఉన్న వారు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయరు. దీంతో హైదరాబాద్ రియల్ రంగంలో ఎన్నడు లేని విధంగా పాతాళానికి పడిపోయింది. ఏడాదికి 12 లక్షల జీతం తీసుకునే వారి పరిస్థితి ఇలా ఉంటే…అందులో సగం తీసుకునే వారి పరిస్థితి మరి దారుణంగా తయారైంది. నెలకు 50 వేలు సంపాదించే ఉద్యోగులు…సొంతింటి కలను…కలగానే మిగిల్చికుంటున్నారు. అప్పు చేసి ఇళ్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడే బదులు…వచ్చే జీతంతో అద్దె ఇంట్లోనే గడిపెద్దామని భావిస్తున్నారు.
కొత్త అపార్ట్‌మెంట్ల సంగతి ఇలా ఉంటే…పాత అపార్ట్‌మెంట్ల అమ్మకాలు కూడా ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. భారీగా తగ్గించి విక్రయిద్దామని అనుకుంటున్నా…ఎవరు ముందుకు రావడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 2 లక్షల ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. వాళ్లు రేట్లు తగ్గించరు…జనం కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. అసలే మాంద్యం వస్తుందన్న భయంతో ఉన్న డబ్బును జాగ్రత్తగా దాచుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లు, విల్లాల సంగతి ఇలా ఉంటే..భూములు రేట్లు కూడా దారుణంగా పతనం అయ్యాయి. మొన్నటి వరకు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కోకాపేటలో అయితే ఎకరా 150 కోట్లు అమ్ముడైంది. ఇప్పుడు భూములు కూడా ఎవరు కొనడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే…రియల్ ఎస్టేట్ రంగంతో గతంలో ఎన్నడు లేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇది ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదు.
హైదరాబాద్‌లో నెలకొన్న గడ్డు పరిస్థితిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. అనరాక్ నివేదిక ప్రకారం.. 2025 మూడవ త్రైమాసికంలో కొత్త గృహాల సరఫరా గత ఏడాదితో పోలిస్తే 38 శాతం క్షీణించింది. హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు 23 శాతం తగ్గింది. 58,540 యూనిట్ల నుంచి 44,885 యూనిట్లకు పడిపోయింది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. జనవరి 2026లో రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 14 శాతం తగ్గాయి. ముఖ్యంగా 1 కోటికి పైబడిన గృహాల లావాదేవీల్లో భారీ తగ్గుదల కనిపించింది. దేశంలోని టాప్ ఏడు నగరాల్లో హైదరాబాద్ అత్యధిక ఆఫీస్ స్పేస్ ఖాళీ రేటును నమోదు చేసింది. కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరాలో 39 శాతం తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో, ప్రభుత్వం మరింత భరోసా ఇచ్చేలా వ్యవహరించాల్సింది పోయి, గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు స్థిరపడుతున్నాయని కొందరు డెవలపర్లు ఆశాభావంతో ఉన్నా.. విధానపరమైన అనిశ్చితి మాత్రం రియల్ ఎస్టేట్ రంగానికి పెను సవాలుగా మారింది.
