Site icon NTV Telugu

Story Board: క్రికెట్ రాజ్యాన్ని ఏలుతున్న భారత్ ..!

Story Board On India Rules

Story Board On India Rules

Story Board: టీట్వంటీ వరల్డ్ కప్‌ సొంత గడ్డపైనే జరిగింది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్. జట్టులో హిట్టర్లకు కొదువలేదు. అలవాటైన పిచ్‌లపై బౌలర్లు కూడా మంచి ప్రదర్శనే చేస్తారనే ఆశలున్నాయి. కానీ ఈ టీమ్ కప్ గెలుస్తుందనే నమ్మకమైతే మొదట్లో కనిపించలేదు. దీనికి తోడు టీమిండియా ఆటతీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్‌లోనే అమెరికా చేతిలో పరాభవం తప్పిన మెన్స్ టీం.. కష్టపడుతూనే సూపర్ 8కు చేరింది. అక్కడ్నుంచైనా అసలు ఆటతీరు బయటికొస్తుందనుకుంటే.. సౌతాఫ్రికా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది టీమిండియా. అప్పటికీ జట్టుపై అభిమానులకు పూర్తిస్థాయిలో నమ్మకం రాలేదు. అటువైపు హిట్టర్లతో కూడిన ఇంగ్లండ్ ఉండటంతో.. గెలుస్తారా.. లేదా అనే టెన్షన్ తప్పలేదు. సెమీస్‌ లో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. 250 పైచిలుకు స్కోరు చేసిన తర్వాత కూడా ఇంగ్లండ్ చివరిదాకా టీమిండియాను వణికించింది. చివరకు బుమ్రా రెండు ఓవర్ల స్పెల్ పుణ్యమా అని భారత్ ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్ ఎలా ఆడతారోనని అభిమానులంతా తెగ టెన్షన్ పడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో జట్టు అసలైన ఆటతీరు బయటికొచ్చింది. ఛాంపియన్ గేమ్ ఆడిన టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి కివీస్‌ను చిత్తు చేసింది. వరల్డ్ కప్ అందుకోవటానికి తమకు పూర్తి అర్హత ఉందని టీమ్ నిరూపించింది.

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 కైవసం చేసుకోవడంలో భాగంగా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని వరుసగా రెండోసారి గెలిచిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో భారత్ 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు రికార్డు కూడా భారత్ పేరిటే ఉండేది, 2024 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ 176 పరుగులు చేసింది. ఇప్పుడు ఇండియా తన సొంత రికార్డును మెరుగుపరుచుకుంటూ ఏకంగా 255 పరుగులు సాధించింది. ప్రత్యర్థి కివీస్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు రేసులో ఉన్నట్లు కనిపించలేదు. టిమ్ సీఫెర్ట్ చేసిన 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన 43 పరుగుల ఇన్నింగ్స్ మినహా ఏ కివీస్ బ్యాటర్ కూడా కనీసం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. పవర్ ప్లేలో వికెట్ కూడా కోల్పోకుండా 6 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు చేసింది శాంసన్, అభిషేక్ జోడీ. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు ఇది. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. కానీ అంతకుముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ కూడా తలో వికెట్ తీసుకున్నారు.

ఇప్పటివరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్ కూడా రెండు సార్లు చొప్పున టీ20 వరల్డ్ ఛాంపియన్‌లుగా నిలిచాయి. అయితే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని 3 సార్లు సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇండియా 2007లో నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తాజాగా టైటిల్ నిలుపుకుంది. 2007 తొలి ఎడిషన్​లో భారత్ విజేతగా నిలిచింది. ధోనీ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఆ టోర్నీలో ఫైనల్​లో పాకిస్థాన్​ను ఓడించి ఛాంపియన్​అయింది. మళ్లీ 17ఏళ్లకు 2024లో విశ్వ విజేతగా నిలిచింది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్​లో సౌతాఫ్రికాను ఢీ కొట్టింది. ఫైనల్​లో 7 రన్స్​ తేడాతో సౌతాఫ్రికను ఓడించి విశ్వవిజేత అయింది. ఇక తాజా ఎడిషన్​లో సూర్య నేతృత్వంలోని భారత్ ముచ్చటగా మూడోసారి ఈ కప్‌ని అందుకుంది.

అంతకుముందు వన్డే వరల్డ్‌ కప్‌ను కూడా టీమిండియా రెండుసార్లు గెలిచింది. తొలిసారి 1983లో కపిల్ డెవిల్స్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2011లో రెండోసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన ధోనీ సేన సచిన్‌కు రిటైర్మెంట్ గిఫ్ట్‌ ఇచ్చింది. మధ్యలో 2003 వరల్డ్‌ కప్‌ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన గంగూలీ గ్యాంగ్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో చిత్తై.. మొత్తం దేశాన్ని విషాద సంద్రంలో ముంచేసింది. ఇక పురుషులకు తాము తీసిపోమంటూ మహిళలు కూడా గతేడాది వన్డే వరల్డ్ కప్‌ ను ఒడిసిపట్టారు. దీంతో భారత మహిళల క్రికెట్‌లో సువర్ణాధ్యాయం లిఖితమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు, టీవీ, మొబైల్‌ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్లతరబడి ఎదురుచూసిన భారతావని ఒక్కసారిగా పులకించిపోయింది. ఈ కప్ గెలుపుతో హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతిమంథాన లాంటి సీనియర్ స్టార్లతో పాటు జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్ లాంటి కొత్త తరం స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఈ గెలుపుతో ఇకపై పురుషుల టీమ్‌తో పాటూ తమపైనా ఆశలు పెట్టుకోవచ్చని హర్మన్ సేన అభిమానులకు కొత్త కిక్ ఇచ్చింది.

ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న బిజినెస్‌లో 87 శాతం వాటా కేవలం క్రికెట్ దే. ఈ గణాంకాలు చూస్తే చాలు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్లు వదిలి వెళ్లిన క్రికెట్.. ఇప్పుడు ఇండియాలో మార్కెట్ ను శాసిస్తోంది. పుట్టిల్లు ఇంగ్లండ్ ను మించిపోయి ఇండియాలో బిజినెస్ చేస్తోంది. అమెరికాలో ఫుట్ బాల్, బేస్ బాల్ క్లబ్ కంటే మిన్నగా కోట్లు కురిపిస్తోంది. ఇప్పుడు క్రికెట్ అంటే ఓ ఆట కాదు. ఓ భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్. ఐపీఎల్ వస్తుందంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు కూడా వాయిదా పడాల్సిందే. క్రికెట్ వరల్డ్ కప్ కు అనుగుణంగా ఇండియాలో ఎన్నికలను కూడా రీషెడ్యూల్ చేసిన రోజులున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే క్రికెట్ కు అంత పవర్ ఉంది. ఇక అభిమానుల్లో క్రికెట్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇండియాలో క్రికెట్ అనేది ఆట కాదు.. ఓ మతం అనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా.. అక్కడ టీమిండియా ఆడుతుంటే చాలు.. ఆ మ్యాచ్ టీఆర్పీ దగ్గర్నుంచీ టికెట్ అమ్మకాల వరకూ అంతటా రికార్డులు బద్దలవ్వాల్సిందే.

స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో మన జట్టు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లు ఆడటం, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి మేటి జట్లకు తలొంచడం తరచూ చూసేవాళ్లు అభిమానులు. అప్పుడప్పుడూ అగ్రశ్రేణి జట్ల పేస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ వచ్చే మెరుపు ఇన్నింగ్స్ లు, అడపాదడపా వచ్చే గెలుపులే మహాభాగ్యంగా భావించేవాళ్లు. కానీ కాలం గడిచేకొద్దీ క్రికెట్లో టీమిండియా నైపుణ్యం పెరిగింది. మేటి ఆటగాళ్ల రాకతో క్రికెట్ పై క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా కపిల్ డెవిల్స్ 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగి వరల్డ్ కప్ కొట్టడం.. దేశ యువతపై చెరగని ముద్ర వేసింది. 1983 వరల్డ్ కప్ విజయం ఇండియాలో క్రికెట్ విప్లవానికి కారణం అయింది. మరో ఆటకు చోటు లేకుండా క్రికెట్ ఆక్రమించడానికి ఆ వరల్డ్ కప్ విజయం ఉత్సాహాన్నిచ్చింది. ప్రతీ గల్లీలో ఓ క్రికెట్ టీం పుట్టుకు వచ్చింది. కపిల్ డెవిల్స్ స్ఫూర్తితో చాలా మంది నైపుణ్యం గల ఆటగాళ్లు ఇండియన్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. అప్పట్నుంచీ క్రికెట్ ను చూసే దృక్పథమే మారిపోయింది. అప్పడప్పుడూ గెలిస్తే చాలనే స్టేజ్ నుంచి.. ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే అని బలంగా కోరుకునే అభిమానులు పెరిగిపోయారు. ఆటగాళ్ల కంటే ఎక్కువగా మ్యాచ్ లను అభిమానులే ఎక్కువ ప్రిస్టేజ్ గా తీసుకోవడం పెరిగిపోయింది. మ్యాచ్ లో గెలిస్తే క్రికెటర్లకు హారతులు పట్టడం, ఓడిపోతే క్రికెటర్ల ఇళ్లపై దాడులు చేయడం కూడా మొదలైంది. చాలాసార్లు కీలక మ్యాచ్ ల సమయంలో క్రికెటర్ల ఇళ్ల దగ్గర భద్రత కల్పించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. క్రికెట్ పై అభిమానులు పెంచుకున్న ఈ పిచ్చే.. వేల కోట్ల రూపాయల బిజినెస్ కు బీజం వేసింది. టీమిండియా ఆడే ఒక్క మ్యాచ్ టీవీ టెలికాస్ట్ హక్కులు కోట్ల రూపాయల్లోకి చేరిపోయాయి.

టెస్టులంటే బోరింగ్. ఐదు రోజులు చూస్తే కానీ.. ఎవరు గెలుస్తారో తెలియదు. అప్పటికీ చాలా మ్యాచ్ లు పేలవమైన డ్రాగా ముగుస్తాయి. ఈ రోజులకు ఇప్పుడు కాలం చెల్లింది. టెస్ట్ క్రికెట్లో కూడా పోటీతత్వం పెరిగింది. ఇక టీమిండియా ఆడే టెస్టులైతే చెప్పక్కర్లేదు. మొదట్నుంచీ స్థిరంగా ఉన్న బ్యాటింగ్ కు తోడు.. కొన్నేళ్లుగా మెరుగుపడ్డ బౌలింగ్.. ఇండియన్ టీమ్ ను టెస్టుల్లోనూ బలమైన జట్టుగా మార్చేశాయి. దీంతో ఒకప్పటిలా టీమిండియా విదేశాల్లో గెలవలేదు అనే ముద్ర చెరిగిపోయింది. ఏ దేశంపై అయినా.. ఏ దేశంలో అయినా టీమిండియా గెలవగలదనే నమ్మకం అభిమానుల్లో పెరిగింది. దీనికి తగ్గట్టుగానే టీమిండియా టెస్ట్ సిరీస్ లకు స్పాన్సర్ షిప్, టీవీ హక్కుల కోసం పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇతర దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లకు, టీమిండియా ఆడే టెస్ట్ సిరీస్ లకు జరిగే బిజినెస్ మధ్య చాలా తేడా ఉంటోంది.

క్రికెట్ స్వరూపస్వభావాల్లో కూడా చాలా మార్పులొచ్చేశాయి. వైట్ బాల్ క్రికెట్ నుంచి టీట్వంటీ లీగ్ ల దాకా అన్నింటినీ జనం ఆదరిస్తున్నారు. క్రికెట్ పై అభిమానుల్లో ఉండే ఆసక్తిని బీసీసీఐ క్రమంగా క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టింది. క్రికెట్ గేమ్ రూపాంతరం చెందుతున్న కొద్దీ.. టీమిండియా విజయాల శాతం పెరుగుతున్న కొద్దీ.. ఇండియాలో క్రికెట్ బిజినెస్ కూడా ఇంతింటై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ వచ్చింది. ఆటగాళ్లు వేసుకునే జెర్సీ దగ్గర్నుంచీ స్టేడియంలో అమ్ముడయ్యే టికెట్ల దాకా.. టెలికాస్ట్ రైట్స్ నుంచీ స్టేడియం బౌండరీ లైన్ దగ్గర కనిపించే ప్రకటనల దాకా.. అన్నీ కాసులు కురిపిస్తున్నాయి. ఒక మ్యాచ్ జరిగితే చాలు.. కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఒకప్పుడు సినిమాను బలమైన మాధ్యమంగా చెప్పుకునేవాళ్లు. కానీ క్రికెట్ విస్తృతి పెరిగిన తర్వాత.. క్రికెట్ సినిమాను వెనక్కినెట్టేసి బలమైన బిజినెస్ సాధనంగా మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు కూడా క్రికెట్లో కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోయారు. ఓ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు పది సెకండ్ల యాడ్ చూపించినా చాలు.. తమ బిజినెస్ గణనీయంగా పెరుగుతోందనే విషయాన్ని గుర్తించిన కంపెనీలు.. ఎంత రేటైనా చెల్లించడానికి వెనుకాడటం లేదు. ఇదే వేల కోట్ల రూపాయల బిజినెస్ కు అంకురార్పణ చేసింది.

కాలానికి తగ్గట్టుగా మారడం కూడా క్రికెట్ కు అతి పెద్ద అడ్వాంటేజ్ అయింది. టెస్ట్ క్రికెట్ పై జనానికి బోరు కొట్టగానే వన్డేలు వచ్చేశాయి. వన్డేలు కూడా ఇంతేనా అనుకునే టైమ్ లో టీట్వంటీ క్రికెట్ వచ్చింది. ఇక టీట్వంటీ క్రికెట్ మజాను మరింత పెంచుతూ ఐపీఎల్ రంగప్రవేశం చేసింది. ఇలా ఎప్పటికప్పుడు క్రికెట్లో వచ్చిన కొత్తదనం.. పటిష్ఠమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటుచేసింది. బాలీవుడ్ లో ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా.. దేశంలో వంద కోట్ల మంది చూస్తారని గట్టిగా చెప్పలేం. కానీ క్రికెట్ మ్యాచ్ జరిగితే మాత్రం దాదాపు వంద కోట్ల మంది చూడటం గ్యారెంటీ అనేంతగా క్రికెట్ ఎదిగింది. బిజినెస్ చేయాలంటే కస్టమర్లే ముఖ్యం. ఎక్కడ కస్టమర్లు ఎక్కువ ఉంటే.. అక్కడే కాసులు కురుస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఈ వ్యాపార సూత్రాన్నే వంట బట్టించుకున్నాయి. క్రికెట్ పై అభిమానులకు ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ.. విభిన్నంగా యాడ్ లు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నాయి. తమ ప్రొడక్ట్ గురించి చెప్పే యాడ్ లో క్రికెట్ ను మిళితం చేయడం ద్వారా కోట్లాదిమందిని ఆకర్షిస్తున్నాయి.

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఎదిగిందంటే.. దానికి కేవలం క్రికెట్ అభిమానులు, ప్రపంచవ్యాప్తగా పేరు ప్రఖ్యాతులున్న స్టార్ ఆటగాళ్లు మాత్రమే కారణం కాదు. అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఓ రీజన్ అని చెప్పాలి. టీమిండియా కంటే ఎక్కువ విజయాలు సాధిస్తున్న జట్లు, దశాబ్దాల తరబడి క్రికెట్ ను ఏలిన దేశాలను కూడా ఆశ్చర్యపరిచేలా క్రికెట్ మార్కెట్ ను నిర్మించింది బీసీసీఐ. ఒకప్పుడు టీమిండియా గెలిస్తే.. ఓడితే.. జరిగే బిజినెస్ లో తేడా ఉండేది. కానీ ఇప్పుడు టీమ్ గెలుపోటములతో సంబంధం లేకుండా ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. టీమిండియా గెలిస్తేనే బిజినెస్ జరుగుతుంది అనుకునే రోజులు పోయి.. టీమిండియా ఆడితే చాలు అనుకునే స్టేజ్ వచ్చేసింది. టీమిండియా బిజినెస్ బ్యాకింగ్ చూసి.. ఐసీసీ కూడా టీమిండియా షెడ్యూల్ కు అనుగుణంగా టోర్నీలు ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా లీగ్ లో నిష్క్రమించిందంటే.. ఆ టోర్నీ బిజినెస్ ఒక్కసారిగా పడిపోతోంది. టీమిండియా నాకౌట్ స్టేజ్ కు చేరితేనే.. ఐసీసీ టోర్నీలకు అనుకున్నంత బిజినెస్ జరుగుతోంది. ఒకప్పుడు క్రికెట్ ఆడటమే రాదు అని బ్రిటిషర్లు గేలిచేసిన ఇండియా.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ బిజినెస్ గా కేంద్రంగా ఎదిగింది.

ఐపీఎల్ కు ముందు కూడా ఇండియాలో క్రికెట్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంది. కానీ ఐపీఎల్ వచ్చాక మార్కెట్ లెక్కలన్నీ మారిపోయాయి. చూస్తుండగానే ఐపీఎల్ బిజినెస్ ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ లీగ్ ల బడ్జెట్ ను దాటేసి.. కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ కు వచ్చిన వ్యూయర్ షిప్ 200 మిలియన్లు దాటేసి.. రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ జరిగే సమయంలో వచ్చే పది సెకన్ల యాడ్ ఖరీదు 10 నుంచి 12 లక్షలు. ఒక్క టీవీ ప్రకటనల ద్వారానే ఐపీఎల్ 2 వేల కోట్లు సంపాదిస్తోంది. 300 నుంచి 350 కోట్లు కేవలం హాట్ స్టార్లో వచ్చే ప్రకటనల ద్వారానే వస్తోంది. మొబైల్ స్ట్రీమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్, సబ్ స్క్రైబర్ డిమాండ్.. ఇలా రకరకాల మార్గాల్లో వచ్చే సంపాదన దీనికి అదనం. ఐపీఎల్ ద్వారా ఇంత సంపాదిస్తున్న స్టార్ స్పోర్ట్స్ టీవీ హక్కుల కోసం బీసీసీఐకి చెల్లించే మొత్తం అక్షరాలా 3 వేల 200 కోట్ల రూపాయలు. ఇక ఐపీఎల్ స్పాన్సర్ల నుంచి బీసీసీఐకి 1200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. ఐపీఎల్ ఆధారంగా వచ్చిన డిజిటల్ గేమ్స్ కు కూడా మార్కెట్లో ఎక్కడలేని డిమాండ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ లపై అధికారికంగా బెట్టింగులు నిర్వహించే డ్రీమ్ లెవన్ కు కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఇలా ఇండియాలో ఐపీఎల్ చేస్తున్న బిజినెస్ చూసి.. ఇతర దేశాలు కూడా లీగులు ప్రారంభించినా.. ఏదీ ఐపీఎల్ రేంజ్ ను చేరుకోలేదు. ప్రొఫెషనల్ క్రీడలకు పెట్టింది పేరైన ఆస్ట్రేలియాలో కూడా ఐపీఎల్ తరహా లీగ్ ఉన్నా.. అక్కడ జరిగే బిజినెస్.. ఐపీఎల్ తో పోలిస్తే చెప్పుకోదగ్గది కాదు. ఐపీఎల్ బిజినెస్ టెక్నిక్స్ చూసి.. అమెరికన్ బేస్ బాల్, యూరోపియన్ ఫుట్ బాల్ క్లబ్ ల యాజమాన్యాలు కూడా బిత్తరపోతున్నాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రఖ్యాత టోర్నీలకూ పెరగనంత స్థాయిలో.. ప్రతి సీజన్ కూ ఐపీఎల్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతోంది.

క్రికెట్లో టీట్వంటీ అనే ఆలోచనే వినూత్నం. కేవలం మూడు గంటల్లో మ్యాచ్ ముగిసేలా.. ప్రేక్షకులకు వినోదం అందించాలనే ఆలోచన నుంచే టీట్వంటీ పుట్టింది. ఒక్కో ఇన్నింగ్స్ కు 20 ఓవర్లు, రెండు ఇన్నింగ్స్ లమ ధ్య కేవలం పావుగంట బ్రేక్. ఆఫీసులు, కాలేజీలకు ఇబ్బంది లేకుండా సాయంత్రం సమయంలో మ్యాచ్ లు. మ్యాచ్ ల్లో సందడి చేసే ఛీర్ గాళ్స్. ఇలా ఐపీఎల్ అంటే క్రికెటైన్మెంట్ అనే రేంజ్ కు వెళ్లిపోయింది మజా. క్రికెట్ ను ఎంటర్ టైన్ మెంట్ ను మిక్స్ చేసిన అద్భుతమైన మార్కెటింగ్ ఐడియాగా ఐపీఎల్ కు పేరొచ్చింది. ఐపీఎల్ ను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన ఐసీసీ కూడా.. ఇప్పుడు ఐపీఎల్ కు అనుగుణంగా షెడ్యూల్ మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఐపీఎల్ సక్సెస్ కు చాలా కారణాలున్నాయి. ఓ సాధారణ టీట్వంటీ లీగ్ ను.. అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చడానికి చాలా వర్కవుట్ చేశారు. మొదట దేశంలో ప్రధాన నగరాలకు అనుగుణంగా ఫ్రాంఛైజీలకు పేర్లు పెట్టారు. ఒక్కో ఫ్రాంఛైజీకి ఒక్కో ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ ను ఓన్ గ్రౌండ్ గా ఇచ్చారు. అలా ఇండియాల నగరాల మధ్యే ఓ విధమైన పోటీ వచ్చేలా చేశారు. ఫ్రాంఛైజీలకు అనుగుణంగా ఫ్యాన్స్ కూడా ఆయా జట్లను ప్రోత్సహిస్తున్నారు. ఐపీఎల్ లో యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంతో.. ఇతర దేశాల నుంచి స్టార్ ఆటగాళ్లను రంగంలోకి దించడంతో.. మజా మరింత పెరిగింది. ఎప్పుడో వరల్డ్ కప్ జరిగినప్పుడు మాత్రమే అన్నిదేశాల ఆటగాళ్లను చూసే అభిమానులు.. ఇప్పుడు ఐపీఎల్లో వేర్వేరు దేశాల ఆటగాళ్లను ఒకే టీమ్ గా చూడటాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ఐపీఎల్ ను మరింత ఆకర్షణీయంగా మార్చేలా.. ఎంతమంది ఫారిన్ ప్లేయర్లు ఉండాలి.. ఎంతమంది దేశవాళీ ప్లేయర్లు ఉండాలి అనే లెక్కలు మారుతూ వచ్చాయి. ప్రతి సీజన్లో జరిగే ఆటగాళ్ల వేలం అభిమానుల్లో మరింత ఉత్కంఠం పెంచుతోంది. ఈ సీజన్లో ఓ టీమ్ కు ఆడిన ఆటగాడు.. వచ్చే సీజన్లోనూ కంటిన్యూ అవుతాడనే గ్యారెంటీ లేదు. అసలు ఏ టీమ్ లో అయినా ఉంటాడని కూడా నమ్మకంగా చెప్పలేం. ఆటగాళ్ల ఫామ్ ను బట్టి జాతకాలు మారిపోతాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్ద పేరున్న క్రికెటర్లు కూడా ఐపీఎల్లో విఫలమయ్యారు. అనామకులైన ప్లేయర్లు కూడా ఐపీఎల్ తో స్టార్లైపోయారు. ప్రతి సీజన్లోనూ ఐపీఎల్ నుంచి కొత్త స్టార్లు పుట్టుకొస్తూనే ఉన్నారు.

ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త స్టార్లు ఐపీఎల్ కు మరింత ఆకర్షణ తీసుకొస్తున్నారు. ఐపీఎల్ లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ తారాస్థాయిలో ఉంటుంది. ఏ టీమ్ ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి ఉంటోంది. దీంతో ఐపీఎల్ బిజినెస్ కూడా ఊహకు అందని రేంజ్ లో జరుగుతోంది. కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఇండియా కంపెనీలే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా ఐపీఎల్ పై ఎక్కడలేని ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కసారి ఐపీఎల్ స్పాన్సర్ షిప్ వస్తే చాలు.. తమ బిజినెస్ రాతే మారిపోతుందని బలంగా నమ్ముతున్నాయి. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కు ఓ రేటు, నాకౌట్ మ్యాచ్ లకు మరో రేటు.. క్వాలిఫయర్లకు ఓ రేటు.. ఫైనల్ మ్యాచ్ కు మరో రేటు.. ఇలా మ్యాచ్ మ్యాచ్ కు ప్రకటనల రేటు మారిపోతోంది. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా వినిపించే మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణ. బ్యాట్స్ మెన్ ఫోర్, సిక్స్ కొట్టినప్పుడు ఛీర్ గాళ్స్ డాన్సులు.. బౌలర్ వికెట్ తీసినప్పుడు వచ్చే ప్రత్యేకమైన మ్యూజిక్.. ఇవన్నీ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణ క్రికెట్ ప్రేక్షకులతో పాటు మ్యూజిక్ లవర్స్, ఎంటర్ టైన్ మెంట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఐపీఎల్ కు క్యూ కడుతున్నారు. ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అదో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ గా పేరు తెచ్చుకుంది. ఒక్కసారి గ్రౌండ్ లో ఎంటరైన ప్రేక్షకుడు.. మ్యాచ్ ముగిసేదాకా క్షణక్షణం ఉత్కంఠ ఫీలయ్యేలా.. ఎక్కడా బోర్ కొట్టకుండా చూడటంలో ఐపీఎల్ విజయవంతమైంది. ఓ సినిమా చూసినంత సేపట్లో మ్యాచ్ అయిపోతుండటం, సినిమా కంటే మించిన వినోదం లభిస్తుండటంతో.. ప్రేక్షకులు కూడా ఐపీఎల్ అంటే ఎక్కడలేని ఆసక్తి చూపుతున్నారు.

కేవలం క్రికెట్ మాత్రమే చూపిస్తే బిజినెస్ జరగదు. క్రికెట్ తో పాటు ఆటా, పాటా, లేజర్ విన్యాసాలు.. ఇలా అన్నింటినీ సమపాళ్లలో రంగరిస్తోంది ఐపీఎల్. కేవలం ఐపీఎల్ మ్యాచ్ లకే కాదు.. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి కూడా ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా వచ్చే ప్రకటనలకు రేటు వేరే లెవల్లో ఉంటుంది. అభిమానుల క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న ఐపీఎల్.. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ గా మారిపోయింది. ఏతావాతా ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందనడంలో సందేహం లేదు. ఇప్పుడు పురుషులు, మహిళల క్రికెట్ రెండు విభాగాల్లోనూ బలమైన టీమ్ ఉన్న భారత్.. పలువులు యువ ప్రతిభావంతులకు సానబెడుతూ.. క్రికెట్‌లో తన భవిష్యత్తుకు ఢోకా లేదని చాటుతోంది. మొన్నటి టీట్వంటీ వరల్డ్ కప్‌ లో ఆడిన మెజార్టీ టీముల్లో భారత్‌ సంతతి ఆటగాళ్లుండటం.. మన దగ్గర క్రికెట్ ప్రతిభకు తిరుగులేని నిదర్శనం. దీనికి తోడు ఐపీఎల్ భారత్ క్రికెట్ ముఖచిత్రంతో పాటు మొత్తంగా ప్రపంచ్ క్రికెట్ తీరునే మార్చేసిందనటం అతిశయోక్తి కానే కాదు.

Exit mobile version