Site icon NTV Telugu

Story Board: చంద్రబాబు మాటలకు అర్థమేంటి..? ఏడాదిన్నరకే కూటమి చేతులెత్తేసిందా..?

Story Board

Story Board

Story Board: ఏపీ లో కూటమి పాలనకు సరిగ్గా ఏడాదిన్నర పూర్తయింది. 18 నెలల కాలంలో ప్రభుత్వం సాధించింది ఏదీ లేదని స్వయంగా సీఎం చంద్రబాబే ఒప్పుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కలెక్టర్ల సమావేశం లో ప్రజలు మెచ్చేలా పాలన చెయ్యలేకపోతున్నాం. అంటున్నారు సీఎం చంద్రబాబు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే.మంత్రుల పనితీరు పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల పనితీరు కూడా సరిగ్గా లేదంటున్నారు. సీఎం చంద్రబాబు నిత్యం రకరకాల నివేదికలు తీసుకుంటారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రభుత్వ చేస్తున్న ప్రతి కార్యక్రమనికి సంబంధించి ఏ సమయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అని బేరీజు వేసుకున్నాకే సీఎం చంద్రబాబు స్పందన ఉంటుంది. సరిగ్గా ప్రస్తుతం ఇదే కాంటెస్ట్ లో ప్రజలు మెచ్చేలా పాలన లేదన్నారు సీఎం చంద్రబాబు. ఎదో ఆషామాషీ వ్యక్తి అంటే ఈ కామెంట్స్ కు పెద్ద ప్రయార్టీ అవసరం లేదు. కానీ సీఎం స్థాయి లో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశం బాగా చర్చనీయాంశంగా మారింది.

ఏడాదిన్నర లో ప్రజలు మెచ్చేలా పాలన లేకపోవడానికి అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి….అమరావతిపైనే చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టారనే అభిప్రాయాలు ఉన్నాయి..అమరావతి పై పెట్టిన ఫోకస్ వల్ల కావచ్చు ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందేమో అనే చర్చ కావచ్చు సహజంగా నే మిగిలిన ప్రాంతాల్లో కొంత అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక యాంగిల్….మరోవైపు అమరావతి కి భూముల ను ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు. వేల ఎకరాలు తీస్కుని ప్లాట్లు కేటాయింపు జరగక అనేక రకాల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇదంతా కూడా పాలన పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి…తారాస్థాయికి చేరింది…కూటమి అధికారం లోకి వచ్చిన మూడు నెలల నుంచి ఎమ్మెల్యే లపై అసంతృప్తి స్టార్ట్ అయింది. సీఎం చంద్రబాబు ఇప్పటికి ఒక పది సందర్భాల్లో ఎమ్మెల్యే ల అవినీతి పై అనేక రకాలుగా వార్నింగ్ ఇచ్చారు. సాండ్., ల్యాండ్, లిక్కర్. రియల్ ఎస్టేట్ బెదిరింపులు ఇలా ఒకటి కాదు. అనేక రకాల మాఫియా ల్లో కొంతమంది ఎమ్మెల్యే లు ఇరుక్కుంటున్నారు అనే చర్చ బాగా జరుగుతోంది…ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అనేక రకాలుగా చెప్పారు..అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యే ల్లో ఎలాంటి మార్పు లేదు.

ఎమ్మెల్యే లకు సామాన్య జనానికి ఉన్న లింక్ తెగిపోయింది. అదే విధంగా కార్యకర్తలు కు ఎమ్మెల్యే ల మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో సీఎం చంద్రబాబు కు ఈ విషయం అర్ధం అయ్యి ఎమ్మెల్యే లపై వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించారు. అందుకే ఎమ్మెల్యే లు తమ పనితీరు మార్చుకోవాలని పదే పదే చెబుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యే లపై వస్తున్న వ్యతిరేకత కూటమి పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకే సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవడం లేదు. దీంతో ఎమ్మెల్యేలపై సీఎంకి కంట్రోల్ లేదనే చెడ్డపేరు తప్పటం లేదు. ఎమ్మెల్యేలు కొంతమంది. ఇసుక.మాఫియా లో ఇరుక్కుంటున్నారు… ఇది నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఇబ్బందిగా మారుతోంది.. సొంత పార్టీ నేతలు కూడా ఇసుక కావాలంటే అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇసుక వ్యవహారం లో కొంతమంది ఎమ్మెల్యే లపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది.

లిక్కర్ షాపులు, బెల్ట్‌ షాపులు. మద్యం సిండికేట్ కొంతమంది నేతలు. ఎమ్మెల్యే లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లిక్కర్ షాప్ ల్లో జరిగిన వ్యవహరాలు, లెక్కకు మించి బెల్ట్ షాపులు తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. లిక్కర్ సిండికేట్ తో కొంతమంది ఎమ్మెల్యే లు చేతులు కలిపి.. మాఫియా లో ఇరుక్కున్నారనే అభిప్రాయం ప్రధానంగా వ్యక్తం అవుతోంది. ఇక సర్కారు పరువు తీసిన నకిలీ లిక్కర్ స్కామ్ సంగతి సరేసరి. భూ కబ్జాలు. ప్రధాన సమస్య గా మారాయి…భూ కబ్జాల పై గత ప్రభుత్వం పై అనేక విమర్శలు చేసి….ఇపుడు స్వయంగా. కొంతమంది కూటమి నేతలు.. భూకబ్జాల్లో ఇరుక్కోవడం హాట్ టాపిక్ అయింది…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో భూ కబ్జా లు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించడం…తో పరిస్థితి మరింత సీరియస్ అయింది….భూ కబ్జా లో పొలిటికల్ జోక్యం ఎక్కువైందని పవన్ వ్యాఖ్యానించడం..హాట్ టాపిక్ అయింది. దీంతో స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకుని భూ కబ్జాల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎవర్నీ వదలొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భూ కబ్జా లు ఎక్కువ అవుతున్నాయని డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారంటే. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేస్కోవచ్చు

రాష్ట్రంలో గంజాయిని అదుపు చేయలేకపోవడం కూడా పెద్ద మైనస్ అయింది. చాలా ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు బాగా పెరిగాయి..ఇవన్నీ కూడా ప్రభుత్వం పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు క్రైం రేట్‌ బాగా పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో తగ్గినా కొన్ని జిల్లాల్లో పెరగడం మైనస్ అవుతోంది. నేరం చేస్తే ..మహిళల పై దాడులు చేస్తే అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు చెప్పినా కూడా.. పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదనే అభిప్రాయం ఉంది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక పేకాట క్లబ్‌ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏపీ వ్యాప్తంగా పేకాట పరిశ్రమ వైభవంగా వర్థిల్లుతోంది. చాలా ప్రాంతాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ పేకాట క్లబ్ లు రన్ చేస్తున్నారు. పేకాట క్లబ్ లను కొంతమంది పోలీసు అధికారులే సపోర్ట్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేసారు. ఒక అధికారి పై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే పవన్ చెప్పినా కూడా సదరు అధికారిపై ఎలాంటి యాక్షన్ లేకపోవటం పరిస్థితికి అద్దం పడుతోంది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్ని సందర్భాల్లో..హోమ్ శాఖ పై విమర్శలు చేసారు.కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ కి వత్తాసు పలుకుతున్నారు అన్నారు….తాజాగా భూ కబ్జా లపై మాట్లాడారు.. ఎమ్మెల్యే ల పనితీరు మార్చుకోవాలని గతంలో అన్నారు..ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం పై విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పుుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ పోటీపడి పాలనా వైఫల్యంపై మాట్లాడటం.. వైసీపీకి అందివచ్చిన వరంలా మారింది. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అప్పులు పెరగడం కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయింది. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది ప్రభుత్వం…ఏడాదిన్నర లోనే ఇంత అప్పు చెయ్యడం…అది కూడా. పెద్దగా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా అప్పులు చెయ్యడం పై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం. శ్రీలంక..అవుతుందని ఇదే కూటమి మండిపడింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మోతాదులో అప్పులు చెయ్యడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఏం సమాధానం చెప్పలేక కూటమి సర్కారు తలపట్టుకుంటోంది.

ప్రభుత్వ రథసారథులే పాలన గాడి తప్పిందని ఒప్పుకోవటం.. అందరికీ వింతగానే ఉంది. గాడి తప్పితే అదుపులో పెట్టాల్సిన వారే.. ఆ పని చేయకుండా.. కలెక్టర్లకు చెప్పడమేంటనే చర్చ కూడా మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా.. ఎమ్మెల్యేల్ని చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతున్నారనే వాదనకు బలం చేకూర్చినట్టవుతోంది. అంతే కాదు కేవలం రాజకీయంగానే కాదు.. పాలనాపరంగానూ కూటమి వైఫల్యాలు మూటగట్టుకుందని చెప్పటాన్ని.. ఎలా సమర్థించుకుంటారో చూడాల్సి ఉంది.

ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలన్నాక జులుం చెలాయించటం.. ఎంతోకొంత వెనకేసుకోవాలని చూడటం మామూలే. కానీ ఏపీలో ఈ వ్యవహారం శృతిమించింది. కనీవినీ ఎరుగని విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ప్రతిపక్షాలతో కుమ్మక్కై మరీ అడ్డగోలు దోపిడీకి తెగబడటం చూసి.. జనం ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో మట్టి, ఇసుక, లిక్కర్ సిండికేట్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పనర్వ్యవస్థీకరించారు. దశాబ్దాల తరబడి ఉన్న నెట్ వర్క్‌లు తెంచేసి.. కొత్త లింకులతో సరికొత్త నెట్‌వర్క్‌ తయారుచేశారు. ఈ కొత్త నెట్‌వర్క్‌లో అధికార, ప్రతిపక్ష నేతలకు పర్సంటేజీల లెక్కన.. వాటా ఇచ్చేశారు. తమకు రోజువారీ మామూలు వచ్చేలాగా సెట్ చేసుకున్నారు. తద్వారా ఎంత అవినీతి జరిగినా.. లోకల్‌గా రగడ జరగకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జనంలో పేరుకుంటున్న అసంతృప్తి గురించి సీఎం హెచ్చరించినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

ఏపీలో పొలిటికల్ లీడర్ అంటే ఇసుక, మట్టి, మద్యం మాఫియాలో భాగం కావాల్సిందే అన్నంత దుర్మార్గంగా తయారైంది పరిస్థితి. అసలు వీటితో సంబంధం లేని నేత అంటూ ఎవరూ లేరేమో అన్నంతగా దోపిడీ జరుగుతోంది. సగం మంది ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నారు. మరో సగం మంది మట్టిదోపిడీలో బిజీగా ఉన్నారు. ఎవరి ఆదాయ మార్గాలు వారు చూసుకుని సెటిలయ్యారు. ఇక మద్యం వ్యాపారం సంగతి చెప్పక్కర్లేదు. అనుచరుల పేరుతో లిక్కర్ షాపులు తీసుకుని.. రోజుకింత అని కలెక్షన్లు తీసుకుంటున్నారు. ఇదేదో ఏ ఒక్క పార్టీకో పరిమితమైన వ్యవహారం కాదు. మద్యపాన నిషేధం డిమాండ్ పుట్టుకొచ్చిన రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోంది. కొందరు నేతల రోజువారీ లిక్కర్ కలెక్షన్లు చూస్తే.. వీటితో చిన్న స్థాయి ప్రాజెక్టులు పూర్తిచేయొచ్చంటే అతిశయోక్తి కానే కాదు. పైకి బీద అరుపులు అరిచే చాలా మంది నేతలు రహస్యంగా భారీగా డబ్బు వెనకేసుకుంటున్నారు. చాలామంది ఈ సంగతి సన్నిహితులకు కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. చివరకు ఇంటెలిజెన్స్ ఆరా తీసినా అంతుచిక్కనంత రహస్యంగా డెన్లు మెయింటైన్ చేస్తున్నారు. ఈ పోకడలతోనే చంద్రాబాబుకి తల ప్రాణం తోకకి వస్తోంది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోవటానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇల్లీగల్ దందాలే కారణమనే నివేదిక రావడంతో.. ముఖ్యమంత్రి మింగలేక.. కక్కలేక ఉంటున్నారనే వాదన కూడా లేకపోలేదు.

సాధారణంగా రాజకీయ నేతలకు అనుచరులు, సన్నిహితులు, ఆప్తులు ఉంటారు. కానీ ఏపీలో దోపిడీ పర్వం కారణంగా నేతలకు కొత్త రిలేషన్ పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆ రిలేషనే ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువైపోయింది. అదే దోపిడీ పార్ట్ నర్ రిలేషన్. ప్రతి ఏరియాలో అధికారపక్షం, ప్రతిపక్షానికి చెందిన నేతలతో కలిసి టీములు ఏర్పాటవుతున్నాయి. ఎక్కడా సమస్య రాకుండా ఎవరి కోపరేషన్ వారు చేస్తున్నారు. పైకి రాజకీయ విమర్శలు షరా మామూలే. కానీ తెర వెనుక మాత్రం పూర్తి అండర్ స్టాండింగ్ తో దోచేసిన సొమ్మును తేడా రాకుండా వాటాలేసుకుంటున్నారు. అందుకే ఆ పార్టీకి పట్టున్న ప్రాంతం, ఈ పార్టీకి పట్టున్న ప్రాంతం అనే తేడా లేకుండా దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లుతోంది. దోపిడీ ఎంత వ్యవస్థీకృతమైందంటే.. ఏకంగా గ్రామస్థాయిలో మాఫియాలు ఏర్పాటయ్యాయి. ఎవరి ఏరియాను వారు దోచేస్తున్నారు. ఇక్కడ మరొకరి దృష్టి పడకుండా సొంతంగా సరిహద్దులు గీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్ లాగే.. మాఫియా టీములు కూడా తమ ఏరియాలకు లిమిట్లు సెట్ చేస్తున్నాయి. ఇలా పూర్తిస్థాయి అవగాహనతో.. దోపిడీకి పాల్పడుతున్నారు. ఎవరేమనుకున్నా లెక్కచేయడం లేదు. ఇలా గ్రామస్థాయిలో మాఫియా వేళ్లూనుకోవటానికి ప్రధాన కారణం అధికార పార్టీ ఎమ్మెల్యేలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి కారణంగా సహజంగా టీడీపీ హయాంలో శాంతిభద్రతలు బాగుంటాయనే అభిప్రాయం కూడా మట్టికొట్టుకుపోతోంది. దీంతో కొత్తగా చేసేది చేయకపోగా.. కనీసం గతం మాదిరిగా కూడా పాలన చేయలేకపోతున్నారని ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇది గమనించే చంద్రబాబు బరస్ట్ కావాల్సి వచ్చింది.

ఏపీలో సాగుతున్న దోపిడీ పర్వం.. అలా చేయాలనుకునే నేతలందరికీ కేస్ స్టడీగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడానికి.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతూ.. పరస్పర విమర్శలతో పొద్దపుచ్చటం నేతలకు అలవాటు. కానీ దోపీడీలో, మాఫియా ఏర్పాటులో.. ఎక్కడా తేడా రాకుండా అలవిమాలిన ఐకమత్యం కనబరుస్తున్నారు. నేతల టాలెంట్ చేసి.. ఏపీ జనం విస్తుబోతున్న పరిస్థితి. ఎక్కడైనా దోపిడీ మరీ బట్టబయలయ్యే పరిస్థితి వస్తే.. కొందరు సామాన్యులకూ వాటాలిస్తామని నేతలు ఆఫర్లిస్తున్నారంటే ఏమనుకోవాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా దినదినప్రవర్థమానంగా జరుగుతున్న దోపిడీ.. ఏ తీరానికి చేరుతుందో ఏపీ నేతలకే తెలియాలి. ఇలాంటి కొత్త సంస్కృతికి అంకురార్పణ చేసిన ఘనత.. కచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకే దక్కుతుందనే సెటైర్లతో.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలుస్తోంది. ఏపీలో ఏడాదిన్నర పదవీకాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి.. సొంతింట్లోనే సమస్యలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూటమిలో సమస్యలు రాకూడదని అటు చంద్రబాబు, ఇటు పవన్ మొత్తుకుంటున్నా.. రెండు పార్టీల నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారు. కొన్ని వ్యవహారాలు మంత్రుల స్థాయిలోనూ వివాదాస్పదం కావడంతో.. మరికొన్నింటిపై ఏకంగా క్యాబినెట్లో చర్చ జరగటం.. కూటమికి ఇబ్బందికరంగా మారింది. అప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో కూటమి సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేశారు. అయినా సరే ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన నేతలు సిగపట్లకు దిగుతున్నారు. నామినేటెడ్ పోస్టులు, నియోజకవర్గాల్లో తమ మాటే చెల్లాలనే పంతాలు.. ఇంకా ఇతరత్రా వ్యవహారాలు.. ఇలా కాదేదీ కొట్లాటకు అనర్హం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. చివరకు రాజకీయాలతో సంబంధం లేని ఘటనలకు కూడా సీరియస్ గా రియాక్ట్ కావడం.. కొన్నింటిపై పైకి మాట్లాడకపోయినా.. లోలోపల ఇతర సంఘాల ద్వారా రాజకీయం చేయటం వంటి విషయాలు కూటమి సర్కారుకు తలబొప్పి కట్టిస్తున్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలున్నాయి. కానీ సామాజికంగా, ఓటు బ్యాంకు పరంగా బలంగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య ఎక్కువ వివాదాలొస్తున్నాయి.

అసలు కూటమి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పిఠాపురంలో వర్మ సంగతేంటనే ప్రశ్న దూసుకొచ్చింది. తొలి విడత ఎమ్మెల్సీ పదవుల్లో వర్మకు చోటులేకపోవడంతో.. ఆయన వర్గం గొడవ చేసింది. ఆ తర్వాత రెండో విడతలోనూ ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో.. వర్మ చంద్రబాబును కలిసి తన సంగతేంటో తేల్చాలని కోరారు. దీంతో కొన్నాళ్లు సైలంట్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారనే చర్చ జరిగింది. ఆ తర్వాత వర్మ కొన్నాళ్లు సైలంట్ గానే ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో నాగబాబు పిఠాపురంలో పర్యటించడం, ఈ టూర్ లో వర్మకు ప్రాధాన్యం దక్కకపోవడంతో.. ఆయన వర్గం అసంతృప్తికి లోనైంది. ఇదే అదనుగా వర్మ ముద్రగడతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. దీంతో అసలు పిఠాపురంలో ఏం జరుగుతోందన చర్చ మొదలైంది. దీనికి ట్విస్ట్ ఇస్తూ.. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ.. పిఠాపురంలో వర్మ సైలంట్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారని, కూటమి సర్కారు ఉన్నంత కాలం ఇంతేనని మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై వర్మ డైరక్టుగా మాట్లాడకపోయినా.. పిఠాపురంలో తన బలమేంటో చంద్రబాబుకు తెలుసని, ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తానని హింటిచ్చారు.

ఆ తర్వాత నామినేటెడ్ పదవులపై టీడీపీ, జనసేన నేతలు పంతాలకు పోయారు. చివరకు చంద్రబాబు, పవన్ కూర్చుని మాట్లాడుకుని.. ఓ ఫార్ములా ప్రకారం పదవులు భర్తీ చేశారు. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని ఇద్దరు అగ్రనేతలు ఆదేశించడంతో.. ఆ గొడవ సద్దుమణిగింది. కొన్నాళ్లకు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తాను హోం శాఖ మంత్రిని అయ్యుంటే నిందితుల తాట తీసేవాడ్నని ఆయన మాట్లాడారు. దీంతో హోం శాఖ మంత్రి అనిత ఇరుకునపడ్డారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉందని, పవన్ వ్యాఖ్యలపై రచ్చ చేయాల్సిన పని లేదని, ఆయనకు సమాచారం పంపుతామని చెప్పి కవర్ చేసుకున్నారు. అయితే అడపాదడపా పవన్ హోం శాఖపై తన ఆసక్తిని బయటపెడుతూ వచ్చారు. ఎప్పటికప్పుడు అనిత కూడా పవన్ వ్యాఖ్యల్ని కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ శాఖ మంత్రి నాదెండ్లకు మనోహర్‌కు కోపం తెప్పించాయి. ఆయన నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణను నేరుగా నిలదీయడంతో పాటు.. ఇలాగే చేస్తే.. మీ శాఖ గురించి నేను కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేశారు. ఈ సంగతి నారాయణే స్వయంగా నెల్లూరు జిల్లా నేతలతో పంచుకున్నారు. ఈ వ్యవహారంలో నారాయణ మనోహర్‌కు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

సరే టీడీపీ, జనసేన నేతలకు నేరుగా సంబంధం ఉన్న వ్యవహారాల్లో రచ్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారంలో కూడా ప్రభుత్వానికి ఊపిరాడని స్థితి రావడం మాత్రం నిజంగా చోద్యమే. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది. ఇక్కడ ఇద్దరు యువ‌కుల మ‌ధ్య వివాదం హ‌త్య వ‌ర‌కూ వెళ్లింది. అదికాస్తా రెండు ప్రధాన సామాజికవ‌ర్గాల స‌మ‌స్యగా మారింది. దీంతో సీరియ‌స్‌గా తీసుకుని దిద్దుబాటు చ‌ర్యలు ప్రారంభించంది ప్రభుత్వం. బాధితుల‌కు న‌ష్టప‌రిహారం ప్రక‌టించ‌టంతో పాటు చెక్కుల‌ను కూడా వారి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశారు. స‌త్వర న్యాయం అంద‌టంతో పాటు నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామ‌ని ప్రక‌టించారు. ఇక్కడ ఏమాత్రం అటూఇటైనా.. రచ్చకు రెడీ అంటూ టీడీపీ, జనసేన వర్గాలు మోహరించాయి. అయితే పరిస్థితి అక్కడిదాకా రాకుండా కూటమి సర్కారు జాగ్రత్తపడటంతో.. కూటమిలో మరో వివాదం తప్పింది.

ఇలా ఎప్పటికప్పుడు కూటమిలో కిందిస్థాయి నేతలు అధినేతల తలబొప్పి కట్టిస్తూనే ఉన్నారు. దీంతో అసలు విషయం కంటే.. ఈ పంచయతీలతోనే సమయం ఖర్చైపోతోందని అటు చంద్రబాబు, ఇటు పవన్ అంతర్గత సమావేశాల్లో వాపోయారు కూడా. అయినా సరే కింది స్థాయి నేతలు మాత్రం ఎప్పుడు గొడవపడదామా అనే మూడ్ లోనే కనిపిస్తున్నారు. మొత్తం మీద కేవలం పాలనా పరంగానే కాదు.. రాజకీయంగా, పార్టీ పరంగా కూడా కూటమికి తలబొప్పి కడుతోంది. ఎన్నికల సమయంలో గొడవలున్నా.. విజయం సాధించి తీరాలనే పట్టుదలతో లేని ఐకమత్యం ప్రదర్శించిన కూటమి కిందిస్థాయి నేతలు.. ఇప్పుడు భారీ మెజార్టీతో అధికారం దక్కడంతో.. బాగా రిలాక్స్ అవుతున్నారు. ప్రతిపక్షం గట్టిగా లేకపోవడంతో.. తామే మిత్రపక్షానికి ప్రతిపక్షంగా మారి రచ్చ చేస్తున్నారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. టీడీపీ, జనసేన నేతల పరస్పర ఘర్షణతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ చోద్యం చూడటానికే పరిమితమౌతోంది. మిత్రుల కొట్లాట బాగుందంటూ ఎంజాయ్ చేస్తోంది ఆ పార్టీ. అలా కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారని సంబరపడుతోంది.

నిజం చెప్పాలంటే ఏడాదిన్నర క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పేరుకి కూటమి ఉన్నా.. చంద్రబాబు ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారంలోనూ సేమ్ సీన్ రిపీటౌతోంది. చంద్రబాబుకు పవన్ సహకరిస్తున్నా.. జనసేన క్యాడర్ మాత్రం టీడీపీతో ఢీ అంటే ఢీ అంటోంది. అదేమంటే సమాన హక్కులు కావాలని, పాలనలో సమాన అధికారం దక్కాల్సిందేనని మొండి పట్టు పడుతోంది. అటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేయడమే ఎక్కువ.. ఇప్పుడు అధికారం కూడా త్యాగం చేయడం కుదిరేపని కాదని మొహం మీదే చెబుతున్నాయి. దీంతో అటు చంద్రబాబు, ఇటు పవన్ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. పరస్పర తన్నులాటతో ప్రత్యర్థులకు లోకువ అవుతామని హెచ్చరిస్తున్నా.. ఎవరూ మారటానికి సిద్ధంగా లేరు. అందుకే ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు, పవన్ కలెక్టర్ల సదస్సులో ఓపెన్ అయ్యారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నేతలకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసినట్టేనా..? ఇక యాక్షన్ లోకి దిగుతారా..? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఏతావాతా త్వరలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకుంటున్న కూటమి సర్కారు ఇంకా కుదురుకోలేదని తేలిపోయింది. పైగా అప్రతిష్ఠ కూడా మూటగట్టుకుంటోందని పాలనా సారథులే చెప్పుకోవటం మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

 

Exit mobile version