Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: ఓటరు జాబితా ప్రక్షాళన పేరుతో చేపట్టిన సర్ ప్రక్రియ మొదట్నుంచీ వివాదాస్పదమైంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దగ్గర్నుంచీ.. ఇప్పుడు ముసాయిదా జాబితాలో లేని ఓటర్లకు నోటీసుల వరకూ ఏదీ సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బీఎల్వోల తీరుపై అడుగడుగునా విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు బీఎల్యేలు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉండటం.. కొత్త ఆందోళనకు తావిస్తోంది.
ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు వజ్రాయుధంతో సమానమని అందరికీ తెలుసు. ఆ భావనతోనే రాజ్యాంగం ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు పెద్దపీట వేసింది. కానీ రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి గొడుగు పట్టాల్సిన ఈసీ.. సర్ పేరుతో చేసిన తంతు చూసి.. ఓటర్లంతా విస్తుపోతున్నారు. మిగతా దేశం సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల్లో మన కళ్ల ముందే జరిగిన సర్.. తప్పులతడకగా సాగిందని మెజార్టీ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. అడుగడుగునా బీఎల్వోల తీరుపై బీఎల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. కొన్నిచోట్ల ఓటర్లు నిలదీసినా.. అధికారుల తీరు మాత్రం మారలేదు. అందుకే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో జరిగిన లోపాల ప్రక్రియే.. ఇప్పుడు సర్ నోటీసుల్లోనూ కొనసాగుతోంది. ఎక్కడా పద్ధతి మారిన దాఖలాల్లేవు. సర్‌లో అనర్హుల ఓట్లు తీసేయడం ఎంత ముఖ్యమో.. అర్హులైన వారి ఓట్లు కాపాడటం కూడా అంతే ప్రధానం. కానీ ఈసీ తీరు చూస్తుంటే.. ఏరివేతే లక్ష్యంగా ముందుకెళ్తున్న సంగతి ముసాయిదా జాబితాల ప్రకటనలోనే తేటతెల్లమైంది. ఆ తర్వాత కూడా ఓటర్లు మళ్లీ ఓటు నమోదు చేసుకోవచ్చంటూ.. అధికారులు కవర్ చేసినా.. ఇప్పుడు సర్ నోటీసులు వస్తున్న తీరు చూస్తే.. డ్యామేజ్ కంట్రోల్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. మొత్తం మీద అందరికీ అందాల్సిన ఓటుహక్కుని ఇప్పుడు గగనసుమంగా మార్చిన వైనం.. ఓటర్లందరికీ అంతులేని ఆవేదన మిగిలిస్తోంది.
Also Read
సర్వేలో నిర్లక్ష్యం, వివరాల నమోదులో డొల్లతనం కారణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. సర్ ప్రక్రియ గందర గోళానికి తెరదీసింది. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగినట్టుగా ఉంది కొందరు బీఎల్వోల పనితీరు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే మూడు సార్లు జరిగినా పొరపాట్లు దొర్లాయి. గతంలో ఓట్లేసినవారి వివరాలు గల్లంతవగా.. ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలకూ నోటీసులు జారీ అయ్యాయి. విదేశాల్లో ఉన్నవారిని కూడా అందుబాటులో లేరని పేర్కొనగా వారందరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వారంతా రావాల్సిందేననటం కొత్త సమస్యకు దారితీస్తోంది. ఈ విషయంలో ఈసీ వెసులుబాట్లు ఇచ్చామంటున్నా.. షరా మామూలుగా క్షేత్రస్థాయిలో బీఎల్వోల దయ.. ఓటర్ల ప్రాప్తం అన్నట్టుగా ఉంది పరిస్థితి. పలువురు బీఎల్వోలు కాలు కదపకుండా కార్యాలయాల్లోనే ఇష్టారీతిగా సర్వే ముగించారన్న ఆరోపణలు ఉన్నాయి. షిఫ్ట్ అయిన వారు, అందుబాటులో లేనివారు అంటూ ప్రత్యేక కాలమ్‌లో పేర్కొంటూ విధుల్లో నిర్లక్ష్యం చేశారనే వాదనలూ ఉన్నాయి. చివరకు ఓటర్లు అభ్యంతరాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన గ్రామసభలు, వార్డు సభలు జరగ్గా, చాలాచోట్ల గందరగోళం తలెత్తింది. ఇక్కడ కూడా బీఎల్వోలు సమాధానం చెప్పటానికి తడబడటంతో.. ఓటర్లకు విరక్తి వచ్చింది. ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో లేనివారు, శాశ్వతంగా షిఫ్ట్ అయినవారంటూ లక్షల్లో సంఖ్య చూపించారు. ఇప్పుడవన్నీ సక్రమమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సర్‌లో నోటీసులు, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పునకు కావాల్సిన ఫారాలు 6, 7, 8 అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రతి బీఎల్వో వద్ద ఈ పత్రాలను ఉంచాలని ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేసినా.. ఎక్కడా ఇది అమలు కావడం లేదు. నోటీసులతో పాటు ఇతర ఫారాల ప్రింటింగ్ బాధ్యతలను జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయం అధికారులు అప్పగించారు. నియోజకవర్గాలవారీగా వీటిని ముద్రించుకోవాలని, ఈ బాధ్యతలను ఎన్నికల నమోదు అధికారులకు అప్పగించారు. ఈఆర్వోలు కేవలం నోటీసుల ముద్రణకే పరిమితమయ్యారు. ఓటర్లకు కావాల్సిన పత్రాలను ఏదో విధంగా సర్దుబాటు చేయాలని ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లుకు ఈఆర్వోలు ఆదేశాలు ఇస్తున్నారు. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో వీరు కూడా పట్టించుకోవడం లేదు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన గ్రామ, వార్డు సభల్లో ఫారాలు లేవని, మీసేవా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇటీవల ఓ జిల్లా పరిధిలో ఫారాలు-6, 7, 8 ప్రత్యేకంగా ముద్రించడం లేదని, ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాల్లో తీసుకోవాలని ఓటర్లకు చెప్పాలని స్థానిక తహసీల్దార్లకు అనధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆ జిల్లా పరిధిలో ఎక్కడా పత్రాలను అందించడం లేదు. ఫారం-6, 7తో పాటు డిక్లరేషన్ పత్రాలు కూడా అవసరం ఉంటాయని, అవి కూడా అందుబాటులో లేవని పలువురు బీఎల్వోలు వాపోతున్న దుస్థితి. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటి అవసరం ఎక్కువగా ఉంది.
అక్టోబరు 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 73.39 లక్షల మంది చిరునామాలో లేకపోవడం, వలస వెళ్లడం, మృతి చెందడం, డూప్లికేట్ ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఎక్కడైనా ఈ ఓటర్లను పొరపాటున తొలగిస్తే మళ్లీ ఫారం-6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. చాలాచోట్ల ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయకుండానే ఆ ఓటర్లను ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చారు. కనీసం మళ్లీ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6తో డిక్లరేషన్ పత్రాలు అందుబాటులో లేకపోతే ఎలా? అని జనం ప్రశ్నిస్తున్నారు. పలువురు ఓటర్లకు గతంలో నివాసం ఉన్నచోటనే ఎన్యూమరేషన్ పత్రాలు అందించడంతో అక్కడే పత్రాలను నింపి ఇచ్చారు. వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామాకు మార్చుకోవాలంటే ఫారం-8 అవసరం. అలాగే పేర్లలో అక్షర దోషాలను సరిచేసుకోవాలన్నా ఇదే పత్రం అవసరం. ప్రస్తుతం ఈ పత్రాలు కూడా ఎక్కడా అందుబాటులో లేవు. ముసాయిదా జాబితాలో అనుమానం ఉన్న ఓటర్లను తొలగించాలన్నా, ఫిర్యాదులు చేయాలన్న ఫారం-7 ఉండాలి.
సర్‌లో భాగంగా జారీ చేస్తున్న నోటీసులు నగరంలో కొత్త ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాన్ని అన్ని వివరాలతో భర్తీ చేసినా నోటీసులు రావడంతో చాలామంది అయోమయానికి గురవుతున్నారు. నో మ్యాపింగ్, అనామలిస్ కారణంగా జీహెచ్ఎంసీలో ఈ కేటగిరీల్లోని వారు దాదాపు 12.55 లక్షల మంది ఓటర్లున్నారు. వీరందరికీ ఇప్పటికే నోటీసులు అందాలి. కానీ.. దాదాపు లక్ష మందికి మాత్రమే అందాయి. అందరికీ అందేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద సర్ లో జరిగిన గందరగోళానికి మించి.. సర్ నోటీసుల వ్యవహారం కొత్త రికార్డులు సృష్టించ అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!