Story Board: పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలపై దుష్ప్రభావం చూపిస్తోంది. దేశంలో పరిస్థితులు ఏం బాగాలేవ్. ఇకపై వ్యాపారం అంత సులువు కాదు. మార్కెట్‌లో కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రస్తుతం కలవరపెడుతోంది. గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న అశాంతి.. భారత్ సహా ఆసియాలోని మెజారిటీ దేశాల ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా రవాణాపరమైన ఇబ్బందుల్ని సృష్టిస్తోంది. చీరల నుంచి కార్ల దాకా…సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు రకరకాల వ్యాపారాలు విలవిలమంటున్నాయి. యుద్ధం వల్ల ఆయా సంస్థల వ్యాపారావకాశాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ముడి సరుకులు, తయారీ, రవాణా అన్నింటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. యుద్దం దెబ్బతో వచ్చిన ఆర్థిక సంక్షోభం…దేశ ముఖచిత్రాన్నే మార్చేసింది.
యుద్ధం సెగ భారత్‌కు ఏ స్థాయిలో తగులుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంధన ధరలతో వ్యయాలు అమాంతం పెరిగిపోయాయి. ముడి సరుకుల కొరత వేధిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమావుతూనే ఉంది. అమెరికా-ఇరాన్ యుద్దం… ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మనదేశంలోని రంగాలను నష్టాల్లో ముంచేస్తోంది. వ్యాపారాలన్నీ కుదేలవుతున్నాయి. అది ఇది అనే తేడా లేదు. చీరల నుంచి కార్ల దాకా…అన్ని షోరూంలు జనం లేక బోసిపోతున్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం…ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 40 నుంచి 50 శాతం అమ్మకాలు మాత్రమే వస్త్ర దుకాణాల్లో ఉన్నాయి. ఆన్‌లైన్ దెబ్బకు అది లేకుండా పోయింది. ఆధునిక జీవనశైలి, ఆన్‌లైన్ షాపింగ్, మారుతున్న ఫ్యాషన్ పోకడలు, పాశ్చాత్య దుస్తుల ప్రభావం వల్ల సాంప్రదాయ చీరల వ్యాపారంలో మార్పులు వచ్చాయి. దీనికి తోడు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ లేదా ఇన్‌స్టాగ్రామ్ బోటిక్‌ల ద్వారా నేరుగా వినియోగదారులకు చీరలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల స్థానిక చిల్లర వ్యాపారుల వద్దకు కస్టమర్లు రావడం తగ్గింది. రెడీమేడ్ దుస్తులకు డిమాండ్ పెరిగింది. నేటి తరం మహిళలు, ఉద్యోగినులు ధరించడానికి సులభంగా ఉండే గౌన్లు, కుర్తీలు, లంగా-ఓణీలు, ఇతర పాశ్చాత్య దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.
మనదేశంలో చీరలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడువునా మహిళలు చీరలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. అయితే పొదుపు మంత్రం పాటించాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని మోడీ హెచ్చరికలను…జనం తుచ తప్పకుండా పాటిస్తున్నారు. జనం డబ్బును బయటకు తీయడం లేదు. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయంతో…విలువైన వస్తువులు, చీరలు, బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వస్త్ర దుకాణాలు పరిస్థితి దయనీయంగా మారింది. చీరల పరిశ్రమ పతనం దిశగా సాగుతోంది. దేశంలో దీని మార్కెట్ విలువ కోట్ల రూపాయల్లో ఉంది. ఈ వ్యాపారంలో వస్తున్న సవాళ్లు, వాటికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా…అసలే యుద్ధం సాగుతున్న సమయంలో మోడీ సంక్షోభం వస్తుందన్న హెచ్చరికలతో…జనం జాగ్రత్తగా డబ్బును ఖర్చు చేస్తున్నారు.
బిజినెస్ లేక పలువురు వ్యాపారులు ప్రస్తుతం దివాళా అంచునా ఉన్నారు. చాలామంది మధ్య తరగతి వ్యాపారులు పాలిస్టర్ వ్యాపారం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. వస్త్రాన్ని నమ్ముకున్న వ్యాపారులు గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నారు. వస్త్రం ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉండడం, కొంతమంది బడా వ్యాపారుల చేతుల్లో వస్త్రవ్యాపారం బందీకావడం, గుత్తాధిపత్యం కోసం పథకం ప్రకారం చిన్న వ్యాపారులను దెబ్బతీయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారం మందగిస్తూ పలువురు వ్యాపారులు దివాళా తీస్తున్నారు. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, విద్యుత్ బిల్లులు చిన్న తయారీదారులను కుంగదీస్తున్నాయి. ఈ సంక్షోభం వస్త్ర తయారీ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికులు, పారిశ్రామికవేత్తలపై నేరుగా ప్రభావం చూపుతుంది. వస్త్రాలు, చేనేత వస్త్రాల ప్రపంచ మార్కెట్ వాటాలో క్షీణత దేశ విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతుంది. వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. వాటితో భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడలేకపోతున్నాయి.
దేశంలో బంగారం ధరలు అమాంతం పెరగడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పసిడి మార్కెట్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో కళకళలాడాల్సిన బంగారం దుకాణాలు ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న్నాయి. ప్రధాన మంత్రి పిలుపు తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాని ప్రభావంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో కూడా షాపులకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రతి వేడుకలోనూ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా భారతీయులు ఇష్టపడుతుంటారు. దీంతో పాటు మన దేశ సంప్రదాయంలో కూడా బంగారానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావించి కొలుస్తారు. అలాంటిది వివాహాది శుభకార్యాల సమయంలోనూ బంగారం కొనడం లేదు. దేశంలో కూడా బంగారం కొనుగోలు చేయడం భారీగా తగ్గింది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం…దేశంలో బంగారు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే బంగారం విక్రయాలు ఏకంగా 70 శాతం వరకు పతనం అయ్యాయి. దేశంలో సాధారణంగా ఏడాదికి 800 నుంచి 850 టన్నుల బంగారం వినియోగిస్తారు. ప్రస్తుతం బంగారం డిమాండ్ 7.5 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి25 టన్నులకు డిమాండ్ ఉండేది. గోల్డ్ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కేంద్రానికి భారంగా మారింది. దీంతో బంగారం కొనుగోళ్లను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాల వల్ల బంగారం పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. బంగారం ధరలు భారీగా పెరగడం, కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కలిపి మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

