నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో…జంతర్‌మంతర్ అట్టుడుకింది. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా…ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్రధాని మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌ను విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. నీట్ పేపర్ లీక్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. విద్యార్థులపై లాఠీచార్జ్‌కి నిరసనగా…విపక్షాలు ఉద్యమించాయి. ప్రధాని మోడీ నివాసం ముందు ఆందోళనకు దిగాయి. విపక్ష ఎంపీలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పిల్లలను రెచ్చగొట్టొద్దని సూచించారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్‌కి నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ నివాసం వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్యనేతలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలోని యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో యువతకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని, వారికి ఉన్న ఏకైక మార్గమైన పోటీ పరీక్షల వ్యవస్థను సైతం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో గాయపడి రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ పరామర్శించారు. విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ లో తమకు భవిష్యత్తే లేదన్న విద్యార్థుల ఆవేదన పూర్తిగా న్యాయమైనదేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
మోదీ ఇంటి ముందు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరనసగా కాంగ్రెస్ నేతలు చేతులకు తాళ్లు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. కేంద్ర ప్రభుత్వం తమ వాదనను పార్లమెంటులో ఆలకించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు.
ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా ఖండించారు. రైతులపై వాటర్ కెనాన్లు, యువతపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. శక్తిమంతమైన ప్రభుత్వం అంటే ఇదేనా? అంటూ కేంద్రంపై విమర్శలకు దిగారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పక్కన ఉండగానే ఆమె ఈ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం మీద కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ సభ్యులైన తమకే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్షాల నిరసనలు, వాదనలు ప్రజలకు తెలియకుండా సంసద్ టీవీ ప్రసారాలను నిలిపివేశారన్నారు.
నీట్ పేపర్ లీక్ ఘోర పాపమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఇలాంటివి మళ్లీ జరగకూడదని వ్యాఖ్యానించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలన్న ఆయన..ఇలాంటి లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందన్నారు. పిల్లలను రెచ్చగొట్టొద్దన్న మోడీ…తప్పుడు మార్గంలోకి వెళ్లడం సులభమని..తిరిగి సరైన మార్గంలోకి రావడం చాలా కష్టమన్నారు. వారిని సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని మోడీ అన్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ తమ డిమాండ్లను వెంటవెంటనే మార్చేస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. పార్లమెంట్‌లో చర్చకు అనుమతి తీసుకున్న తర్వాతే..రాహుల్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ప్రతిపక్ష నేత వెంటవెంటనే మాట మార్చడం సరికాదన్నారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో…పోలీసులు అరెస్టు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నిరసనకారుల జాబితాను విడుదల చేయాలని విపక్షాలు పోలీసులను కోరాయి. ఆందోళనకారుల్లో చాలా మందిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అదుపులోకి తీసుకున్నారని ఆరోపించాయి. అందువల్ల బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు వీలుగా ఎఫ్ఐఆర్ జాబితాను, అరెస్టు చేసిన నిరసనకారుల వివరాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
Story Board over cjp protest neet paper leak
Story Board , NTV Telugu

