NTV Telugu Site icon

Story Board: చైనాలో అసలేం జరుగుతుంది ? ప్రపంచ దేశాలు ఎందుకు వణికిపోతున్నాయి ?

Story Board On Hmpv Virus

Story Board On Hmpv Virus

Story Board: ఒక్క వైరస్ ప్రపంచాన్ని అల్లక్లలోలం చేసింది. రెండు, మూడేళ్ల పాటు ఎవరిల్లే వారికి బందిఖానా అయిపోయింది. వివిధ పనుల కోసం బయటికెళ్లే జనానికి లాక్ డౌన్ హౌస్ అరెస్ట్ చేసేసింది. అయితే ఏదోలా కరోనా మహమ్మారి పోయిందిలే అనుకుంటున్న తరుణంలో.. ఇప్పుడ కొత్త వైరస్ విరుచుకుపడుతోంది. కొత్త వైరస్ కూడా కరోనా లాగే చైనాలోనే విజృంభిస్తోంది. కోవిడ్ వచ్చిన దగ్గర్నుంచీ చైనా అంటేనే వణికిపోతున్న జనానికి.. కొత్త వైరస్ ముందే గుబులు పుట్టిస్తోంది. కానీ కొత్త వైరస్ కు సంబంధించిన అసలైన సమాచారం ఏది..? అందుబాటులో ఉన్న వివరాలన్నీ నిజమేనా. కాదా అనే మీమాంస అందర్నీ వేధిస్తోంది.

కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్‌ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు చెబుతున్నారు. రకరకాల వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. డ్రాగన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఈ వైరస్‌ సోకినవారిలో కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నాయంటున్నారు. వైరస్‌ వ్యాప్తిని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందన్నది ఆ నివేదిక సారాంశం.

దాదాపు ఐదేళ్ల క్రితం కొవిడ్‌-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా.. సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైరస్‌ కారకాలను గుర్తించేందుకు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చైనాలో డిసెంబరు 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా చైనాలో.. అంటు వ్యాధిగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది.

కరోనాలాగే ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ, జనాలను ఆస్పత్రులకు పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. చైనా నుంచి వ్యాపిస్తున్న వైరస్.. ఇప్పుడు ఆసియా దేశాలకు విస్తరించింది. చైనా, హాంకాంగ్, జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్.. ఇప్పుడు ఇండియాకు రావటానికి పెద్ద సమయం ఉండకపోవచ్చు. సో.. బీ కేర్ ఫుల్. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఈ వైరస్‌కు ఉన్నట్లు చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా లేదు, కానీ ఈ కొత్త వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు.

కొత్త వైరస్ కారణంగా చైనా ఆస్పత్రులు రోగులతో, స్మశానాలు మృతులతో నిండిపోతున్నాయి. అయితే చైనాలో ప్రతి ఏడాది శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ ఏడాది నమోదైన కేసులు గత ఏడాది కన్నా తక్కువేనని అధికారులు చెబుతున్నారు. కొత్త వైరస్‌ గురించి జరుగుతున్న ప్రచారం చూస్తే కొవిడ్‌ లాంటి మరో మహమ్మారి కబళించడానికి సిద్ధంగా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త అంటువ్యాధి ఉనికి గురించి చైనా ఆరోగ్య శాఖ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అత్యవసర పరిస్థితిని ప్రకటించ లేదనేది కొందరి వాదన. చైనా నుంచి అధికారిక సమాచారం వచ్చేదాకా అనవసర అపోహలు పెట్టుకోవద్దని కొందరు నిపుణులు చెబుతున్నా.. కోవిడ్ సమయంలో చైనా ప్రవర్తించిన తీరుతో.. ఎవరూ ఆ దేశాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు అధికారిక సమాచారం చైనా చెబుతుందా అనేది మరో ప్రశ్న.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోల్లోని దృశ్యాలు పౌరుల్లో భయం పుట్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా దవాఖానల్లో ఉన్న జనం.. రోగులు, ముఖ్యంగా పిల్లలు శ్వాసకోస వ్యాధులతో చికిత్స పొందడం కన్పించింది. ఇవి నిజమైనవా కావా అన్నది నిర్ధారించే వారు లేరు. పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది అని చాలామంది వీటిని చూసి వాపోతున్నారు. దీనిపై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేయాలని పౌరులు డిమాండ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో కూడా చైనా పూర్తి గోప్యత పాటించింది.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆసుపత్రులలో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది.అదే తరహాలో ఇప్పుడు కూడా మరోసారి చైనాలోని పలు ఆసుపత్రులలో చాలా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ త‌ర్వాత చైనాలో మ‌రోసారి మ‌ర‌ణ భీభ‌త్సం నెల‌కొంది. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది.మళ్లీ ఇప్పుడు చైనాలోప్రజలు మాస్కులతో దర్శనమిస్తున్నారు.ప్రస్తుతం చైనాలో నాలుగు వైరస్లు గాలి ద్వారా వ్యాపించినట్లు చెబుతున్నారు. కొత్త వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా ప్రపంచాన్ని విధ్వంసం చేసి లెక్కలేనన్ని మంది ప్రాణాలను తీసినప్పుడు, WHO చాలా కాలం తర్వాత దీనిని ప్యాండమిక్ గా ప్రకటించింది. ఈసారి కూడా చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్‌పై WHO మౌనం వహించింది. కరోనా సమయంలో చైనా తన మరణాలను దాచిపెట్టింది. ఈసారి కూడా ఈ వైరస్ దాడిపై చైనా మౌనంగా ఉంది. కానీ చైనాలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్ట్‌ జారీ చేశారు. కాబట్టి ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడబోతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో కొన్ని ఆంక్షలు అమలులోకి తెచ్చే అవకాశముందని చెబుతున్నారు. మాస్క్ లు తప్పనిసరిగా వాడటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటి పనులతో వైరస్ కు దూరంగా ఉండాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. అన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగించినట్లు సమాచారం అందుతుంది. చైనాలో కొత్త వైరస్ రావడంతో.. ఆ దేశం నుంచి వచ్చే వారిని ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు జరిపి అవసరమైతే ఐసొలేషన్ కు తరలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show comments