Story Board: సోషల్ మీడియా శృతిమించిపోతోంది. వ్యక్తులు, సంస్థలు.. ఆఖరికి వ్యవస్థల్ని కూడా దాటేసి..ప్రభుత్వాలకూ తలపోటుగా తయారైంది. ఏకంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగి.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్న వారికి వార్నింగులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసింది. తెలంగాణలో సోషల్ మీడియా హద్దుదాటిన వారిపై రౌడీషీట్లు తెరవాలనే ఆదేశాలు వచ్చేశాయి. అటు ఏపీలో కూడా సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టం తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు జాతీయ స్థాయిలోనే ఓ సమగ్ర చట్టం అవసరమనే అభిప్రాయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశలోనే ఆలోచిస్తోందంటున్నారు. ఇప్పటికే ఓ విడత డిజిటల్ మీడియా నియంత్రణ కోసం చట్టం తెచ్చే ప్రయత్నం చేసిన కేంద్రం.. కోర్టు కేసుల తరుణంలో.. చట్టాన్ని మరింత సమగ్రంగా తెచ్చే ప్రయత్నంలో ఉందంటున్నారు.
సోషల్ మీడియా నియంత్రణ విషయంలో రాజకీయ పార్టీలు కూడా రెండు నాల్కల ధోరణితో ఉంటున్నాయనే వాదన లేకపోలేదు. ఎందుకంటే మోడీ ప్రధాని కావటానికి, చంద్రబాబు,రేవంత్ ముఖ్యమంత్రులు కావటానికి సోషల్ మీడియాను వినియోగించుకున్నారని, అధికారంలోకి వచ్చాక అదే సోషల్ మీడియాలో విమర్శల్ని సహించలేకపోతున్నారనేది ప్రత్యర్థుల విమర్శ. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాను వెనకేసుకొస్తున్నవారు కూడా.. రేపు అధికారంలోకి వస్తే.. చేసే పని అదే అనేది అధికార పార్టీల కౌంటర్. రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణల్ని కాసేపు పక్కనపెడితే.. ఇక్కడ సోషల్ మీడియా మొత్తం యూజ్‌లెస్ అని ఎవరూ అనడం లేదు. కొన్నిసార్లు కీలక సమస్యల్ని హైలైట్ చేయడంలో.. సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్న మాట నిజమే. అందుకని 2,3 మంచి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని 95 శాతానికి పైగా విద్వేషాన్ని వెదజల్లుతామంటే సహించాలా అనేది సమాజం అడుగుతున్న ప్రశ్న.
భావ వ్యక్తీకరణకు ప్రధానంగా వార్తా పత్రికలకు, టీవీ ఛానెళ్లకు మాత్రమే పరిమితమైన సమాజంలో సోషల్ మీడియా ప్రయాణం 1990ల చివరలో ప్రారంభమైంది. 2004లో ఫేస్‌బుక్, 2006లో ట్విటర్ సామాజిక మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. భారతదేశంలో జియో డేటా విప్లవంతో సోషల్ మీడియా గ్రామీణ ప్రాంతాలకూ చాలా వేగంగా చేరుకుంది. ప్రస్తుతానికి సుమారు 62.4 కోట్లమందిదాకా భారతీయులు దీన్ని వాడుతున్నారు. విద్యార్థుల అభ్యాసానికి మంచి వేదికగా అది మారినా- దాని కారణంగా సైబర్ వేధింపులు, మానసిక ఒత్తిడి వంటివీ ఎదురవుతున్నాయి. వ్యాపారాలకు మార్కెటింగ్‌తోపాటు విస్తృతమైన అవకాశాలను సోషల్ మీడియా తెచ్చిపెట్టింది. కానీ నిబంధనల కట్టుబాట్లు లేకపోవడంతో తప్పుడు ప్రకటనలు, మోసాలు వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి క్రమశిక్షణతోపాటు గట్టి నియంత్రణ చర్యలు అవసరమన్న అభిప్రాయాలున్నాయి.
ఈ మధ్య రాజకీయపార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా వింగ్‌ను వినియోగించుకుంటోంది. తమ పార్టీ విధి విధానాలను ప్రచారం చేసుకోవడం వరకైతే పర్వాలేదు కానీ ఎదుటి పార్టీ వారిని నిందించడానికి, వారిపై బురద చల్లడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి. ఆధారాల్లేని అభియోగాలు మోపుతూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టుల్లో వాస్తవమేదో అవాస్తవమేదో తెలియకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడాన్ని యూజర్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అబద్ధపు వార్తలు, సొంత పైత్యాలు దట్టించి మరీ పోస్టులు వదులుతున్నారు. సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడం వల్ల.. సమాజంలో అశాంతి రేగుతోంది. దీంతో ప్రైవసీ అన్నది లేకుండా పోతోంది. వ్యక్తిగత విలువలు అసలే లేవు. ఓన్లీ లైక్ లు, హిట్ లు, సబ్ స్క్రిప్షన్లు.. ఇదే కొలమానం. అభిప్రాయాలు ఓపెన్ గా చెప్పుకునే ఓపెన్ ఫోరమ్స్ పేరుతో ఎవరినైనా.. ఏమైనా.. ఎలా అయినా అనొచ్చు అనే ధోరణి పెరిగిపోయింది.
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ప్రయోగం, ప్రయోజనం, ఫలితం ఆధారపడి ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా దుర్వినియోగమే ఎక్కువగా ఉందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక మన దేశం విషయం అయితే చెప్పనక్కరలేదు. విద్వేషపూరిత వ్యాఖ్యలు, పచ్చిబూతులకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. అందుకే ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరిగినా, అశాంతి చోటు చేసుకున్నా, శాంతి భద్రతల పరిస్థితి తలెత్తినా,ప్రభుత్వ అధికారులు, వెంటనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా మారింది. రౌడీ షీటర్లు, సంఘ వ్యతిరేక శక్తుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారో, సోషల్ మీడియా విషయంలో కూడా అలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అగత్యం ఏర్పడుతోంది. అనేక సందర్భాలలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిడం వలన పరిస్థితి వేగంగా అదుపులోకి వచ్చిన సందర్భాలు కూడా లేక పోలేదు. అందుకే, ప్రధాన మీడియాకు అయినా సోషల్ మీడియాకు అయినా స్వీయ నియంత్రణ చాలా అవసరం.
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తాను కూడా సోషల్ మీడియా బాధితుడినేనని, తన కుటుంబ సభ్యుల్ని కూడా వదలకుండా భయంకరంగా వేధిస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా వాపోయారంటే.. దేశంలో సోషల్ మీడియా విశృంఖలత ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతోంది. సీఎం స్థాయి వ్యక్తుల దగ్గర్నుంచి.. ప్రతిపక్ష నేతలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, కాలేజీ అమ్మాయిలు, .. చివరకు చిన్నారులు కూడా సోషల్ మీడియా బాధితులే. అందరికీ వేగంగా సమాచారం చేరవేయాల్సిన సోషల్ మీడియా అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎవర్నైనా భ్రష్టుపట్టించాలన్నా, అసభ్యకరంగా మాట్లాడాలన్నా.. చివరకు సర్కారును మార్చాలన్నా సోషల్ మీడియా దారి తప్పిన ఆయుధంగా ఉపయోగపడుతోంది.
సోషల్ మీడియాలో రాజకీయ నేతల్నే కాదు రాజకీయాలతో సంబంధం లేని వారి కుటుంబ సభ్యుల్నీ వదలటం లేదు. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాబు కుటుంబం మీద.. బాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కుటుంబం మీదా అసభ్యకర పోస్టులకు లెక్కలేదు. ఆఖరికి నేతల కుటుంబాల్లో మూడోతరాన్ని కూడా వదల్లేదు సోషల్ మీడియా ముసుగేసుకున్న ఉన్మాదులు. ఇక తెలంగాణలోనూ కేసీఆర్, రేవంత్ కుటుంబాలు సోషల్ మీడియా బాధితులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరకు దేశ ప్రధాని మోడీని కూడా సోషల్ మీడియా పైత్యం వదల్లేదు. మోడీని నేరుగా టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక్కడ సదుద్దేశంతో చేసే ఆరోపణల్ని ఎవరూ తప్పుబట్టరు. విధానపరమైన విమర్శలు కూడా కరెక్టే. కానీ ఓ నేత మనకిష్టం లేదు కాబట్టి.. పనిగట్టుకుని ఆ నేత వ్యక్తిత్వ హననం చేయటం.. మరింతగా దిగజారి సదరు నేత కుటుంబ సభ్యుల్ని కూడా వేధించటం సామాజిక మాధ్యమాల అరాచకానికి పరాకాష్ట.
సభ్యతకు అసభ్యతకు మధ్య ఉండి తీరాల్సిన విభజన రేఖను గౌరవించడం అనేది.. సామాజిక ఆరోగ్య రక్షణకు అత్యవసరమైన ఔషధం. ఇందులో మరో మాటకు తావులేదు. విమర్శ పేరుతో వ్యక్తిగత దూషణకు, గిట్టని వారిని తిట్టడానికి తెగబడితే, భావ ప్రకటన స్వేచ్ఛ నిజంగానే దేశద్రోహానికి దారి తీసే విధంగా దుర్వినియోగమవుతుంటే.. అటువంటి వాటిపై కత్తెరపడాల్సిందే. అలాగే, నగ్న, అశ్లీల చిత్రాలతో, దృశ్యాలతో, సందేశాలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం వంటి పోకడలను అరికట్టాల్సిందే. ఒక వార్త నిజమో? కాదో? తెలుసుకోకుండా.. వాస్తవాలు, మూలాలను పరిశీలించకుండా కేవలం కల్పితమైన రాతలతో కథనాన్ని షేర్ చేస్తే.. అది ఫేక్ న్యూస్ కిందే లెక్క. ఫేక్ న్యూస్ నియంత్రణలో విఫలమౌతున్న సామాజిక మాధ్యమాలు.. కేంద్రం తెచ్చిన కొత్త ఐటీ చట్టాన్ని సవాల్ చేస్తూ కోర్టుల తలుపు తడుతున్నాయి. నియంత్రణ పేరుతో నిర్బంధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కానీ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మాత్రం గ్రహించడం లేదు.
