Site icon NTV Telugu

Story Board : తెలుగు రాష్ట్రాలు మత్తులో జోగుతున్నాయా..? యువతరం మేలుకోకపోతే చిత్తేనా..?

Drugs

Drugs

ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలంటే యుద్ధం చేయాలి. లేకపోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోయాలి. కానీ ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు. జస్ట్ సదరు దేశంలోకి డ్రగ్స్ డంప్ చేస్తే చాలు. అంతే కాగల కార్యాన్ని డ్రగ్సే పూర్తిచేస్తాయి. ఇప్పుడు ఏ దేశానికైనా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి రెగ్యులర్ సమస్యల కంటే డ్రగ్స్ భూతమే పెనుముప్పుగా దాపురించింది. డ్రగ్స్ మొదటిగా పబ్బుల్లో మొదలయ్యాయి. పబ్బులకు వెళ్తేనే కదా ప్రాబ్లమ్ అనుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను బానిసల్ని చేసుకున్నాయి. కొన్ని సంస్థల్లో పట్టపగలే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ బ్రేకులు కూడా తీసుకునే స్థాయికి దిగజారిపోయారని కూడా చెబుతున్నారు. మన పిల్లలు సాఫ్ట్ వేర్ కాదు కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీల్లోకి వచ్చేశాయి. అంటే ఇంటింటికీ డ్రగ్స్ ముప్పు పొంచి ఉన్నట్టే. ప్రమాదం మనం ఎక్కడకో వెళ్తే రావడం కాదు. ప్రమాదమే మన ఇంటికి వచ్చి తలుపు తడుతోంది. ఊరికే తలుపు తట్టి వెళ్లిపోవడం కాదు. తలుపు తీసి తీరాలని బలవంతం చేస్తోంది. పబ్బుల్లోంచి నట్టింట్లోకి నడిచొచ్చిన డ్రగ్స్.. భావితరాల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి.

వీకెండ్స్ లో డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. పబ్బులు, ఫామ్‌హౌజ్‌లు, రిసార్టుల్లో శని, ఆదివారాల్లో రాత్రంతా జరిగే పార్టీలు, కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. పెడ్లర్లు తెలిసినవారి ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్‌ సరఫరా చేస్తుంటారు. వీటిని వినియోగించేవారిలో వీఐపీలు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు, వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక గంజాయి, హాష్‌ఆయిల్‌ వంటివాటిని చిన్నస్థాయి ఉద్యోగులు, విద్యార్థులు వంటివారు వాడుతున్నట్టు వివరిస్తున్నాయి. కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు గింజలు, ఓపియం, హెరాయిన్, కొకైన్ వినియోగం పెరుగుతోంది.తెలంగాణలో దాదాపు 64వేల మంది సొంతంగా డ్రగ్స్‌ను ఇంజెక్షన్‌ల రూపంలో తీసుకుంటున్నారు. మత్తుకు అలవాటుపడిన వారిలో కేవలం 25శాతం మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు. వీరందర్నీ గుర్తించడం, డీఅడిక్షన్ సెంటర్లకు తరలించడం చాలా టఫ్ టాస్క్. అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలంటే.. ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తిచేయాల్సిందే.

ఇటీవలి కాలంలో గంజాయి విస్తృతి బాగా పెరిగింది. గంజాయి తోటల పెంపకం.. సక్సెస్ ఫుల్ బిజినెస్ మోడల్ గా ప్రచారమౌతోంది. పట్టుకుంటే ప్రాబ్లమ్ కానీ.. అది ఎప్పుడో తప్ప జరగదులే అనే ధీమా సామాన్యుల్లో కూడా పెరుగుతోంది. కొంతమంది అయితే పట్టుబడినా.. తమకు అది గంజాయి అని తెలియదని చెప్పి తప్పించుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పండిస్తున్న గంజాయిని కట్టడి చేయడం పోలీసులకు కూడా సవాల్ గా మారింది. ప్రత్యేకంగా గంజాయి పెంపకం కూడా ఇతర పంటలతో కలిపి పెంచుతుండటంతో.. అసలు గుర్తించడమే పెద్ద సమస్యగా మారింది. ఇలా ఏజెన్సీల్లోనూ పెద్ద స్థాయిలో పండుతున్న గంజాయి.. మారుమూల ప్రాంతాలకు కూడా చాలా తేలికగా రవాణా అవుతోంది. ఇతర డ్రగ్స్ ను సప్లై చేయడం కష్టం కానీ.. గంజాయి ఎంత కావాలంటే అంత హోల్ సేల్ రేటుకే ఇస్తామని కూడా పెడ్లర్లు డీల్స్ చేసుకునే దుస్థితి దాపురించింది.

ఎప్పటికపుడు హైదరాబాద్ లో డ్రగ్‌ పెడ్లర్స్‌ పట్టుబడుతూనే ఉన్నారు. అనేకమందికి సప్లై జరుగుతోందని విషయం బట్టబయలవుతోంది. కానీ, డ్రగ్స్‌ మాఫియాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. డ్రగ్స్ దందాకి పబ్బులు, క్లబ్బులే కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ డ్రగ్స్ దందా విస్తరిస్తోంది. డ్రగ్‌ వినియోగం మొదట స్వచ్ఛదంగా ప్రారంభిస్తారు. సరికొత్త అనుభూతి కోసం.. ఆ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో చూడటానికి ప్రయత్నిస్తారు. ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. చివరికి ఇది వ్యసనంగా మారుతుంది. మానసిక ఒత్తిడి, బాధాకరమైన అనుభవం వల్ల చాలా మంది డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. ఇలాంటి ఆలోచనలు టీనేజర్స్ లో ఎక్కువగా ఉండటం.. సమాజాన్ని కలవరపెడుతోంది.

ఎగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలను టార్గెట్‌ చేసుకొని మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలపై నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత్తు పదార్థాలు, మనిషిపై ఎంతటి ప్రభావాం చూపిస్తాయో నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2020లో మద్యం, మాదకద్రవ్యాల కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవించిందని ఆ నివేదికలో పేర్కొంది. 2019తో పోల్చితే వ్యసనాల బారినపడి బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య 2020లో 17 శాతం ఎక్కువగా నమోదైంది. దీన్ని బట్టి చూస్తే మదకద్రవ్యాలు ఎంతటి దారుణాలకు ప్రేరేపిస్తున్నాయో..ఎన్ని కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2019లో దేశవ్యాప్తంగా జరిగిన 1.3 లక్షల ఆత్మహత్యల్లో 5.6 శాతం మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిసలైనవారే ఎక్కువ శాతంమంది ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోవెల్లడించింది. 2020లో నమోదు అయిన ఆత్మహత్యల్లో 6శాతం ఇటువంటి కేసులే ఉన్నాయని తెలిపింది.

డ్రగ్స్ పై మానసిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతూ, కుంగిపోయి ఆత్మహత్య చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటివారిని మద్యం, మాదకద్రవ్యాలు మరింత కుంగదీస్తున్నాయి.
తమ పిల్లలు బుద్ధిమంతులనీ వారికి ఎలాంటి దురలవాట్లూ లేవనీ తల్లిదండ్రులు నమ్ముతారు. పిల్లల్ని నమ్మడం మంచిదే కానీ పరిస్థితులని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. టీనేజర్లు తల్లిదండ్రుల కళ్లు కప్పి సిగరెట్‌ కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం. ఇప్పుడు మరొకడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు. చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు. ఉద్యోగవ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణం. అవసరానికి మించి స్వేచ్ఛా డబ్బూ అందుబాటులో ఉండడం వారిని తప్పుదారి పట్టేలా చేస్తోందనీ అంటున్నారు. పిల్లలు డ్రగ్స్‌ తీసుకోవటానికి అలవాటు పడ్డాక, డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలెడితే అప్పుడు కానీ తల్లిదండ్రులకు తెలియడం లేదు.

ఇక, రకరకాల డ్రగ్స్‌ మార్కెట్లో తేలిగ్గా దొరకడం సమాజం కల్పిస్తున్న వెసులుబాటు. దాంతో వీటికి అలవాటుపడినవారు తేలిగ్గా తమ స్నేహితులనూ దించుతున్నారు. సాధారణంగానే పిల్లల మీద స్నేహితుల ప్రభావం ఎక్కువ. డ్రగ్స్‌ తీసుకుంటే గొప్ప ఆలోచనలు వస్తాయనీ, ఏకాగ్రతతో బాగా చదువుకోవచ్చనీ చెప్పి ఆశపెడతారు. అమాయకులైన పిల్లలు అవన్నీ అబద్ధాలని తెలియక నమ్మేస్తారు. చాలావరకూ డ్రగ్స్‌ వ్యసనంలో మొదటి శత్రువులు స్నేహితులే. పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టే వ్యాపారులు కూడా పిల్లలు మసలే పరిసరాల్లోనే డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్నారు. పది పాకెట్లు అమ్మితే ఒకటి ఉచితంగా ఇస్తామని వీరు పేద పిల్లలకు ఆశపెడతారు. దాంతో మొదట డబ్బు సంపాదనకోసం మొదలుపెట్టినవారు కూడా తర్వాత వాడడం అలవాటుచేసుకుని తనకు సరకు కావాలంటే ఎక్కువ మందికి అమ్మాలి కాబట్టి కొత్తవాళ్లకి అలవాటు చేస్తుంటారు.

స్కూళ్లూ కాలేజీల చుట్టుపక్కల ఉండే చిన్న హోటళ్లూ, కాలనీల్లోని కిరాణా దుకాణాలూ, పబ్‌లూ, ఆఖరికి మాల్స్‌తో సహా ఎక్కడ కావాలంటే అక్కడ డ్రగ్స్‌ దొరుకుతున్నాయి. యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ నివేదిక ప్రకారం 50 ఆన్‌లైన్‌ క్రిప్టోమార్కెట్‌ వేదికల మీద మన దేశం నుంచి వెయ్యికి పైగా డ్రగ్‌ లిస్టింగ్స్‌ ఉన్నాయి. అంటే ఆన్‌లైన్‌లో కొంటే కొరియర్‌లో కోరిన అడ్రసుకి చేరవేస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపులు పెట్టుకుని మరీ ఫ్రెండ్స్‌ ఒకరికొకరు మాదకద్రవ్యాలను సరఫరా చేసుకుంటున్నారు.

దేశంలో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిలో 80 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే. వారిలో కూడ ధనిక వర్గాల వారు హెరాయిన్‌, కొకైన్‌, ఒపియాడ్స్‌, ఇంజెక్షన్ల వంటిని తీసుకుంటే.. పేద, మధ్యతరగతి యువత గంజాయి వంటివి తీసుకుంటున్నారు. ధనిక వర్గానికి డ్రగ్స్ మొదట పబ్‌లు, క్లబ్‌లు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే…ఇప్పుడు ఆ కల్చర్ యువత చదువుతున్న విద్యా కేంద్రాలకు విస్తరించింది. విలాసాలకు అలవాటున పడిన చదువుకున్న యువకుల ద్వారా… మధ్యతరగతికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. మత్తుకు బానిసలైన యువత.. నిర్వీర్యమైపోతోంది. ఇది దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

బడాబాబులు, సంపన్నులు, యూత్‌ కే కాదు.. సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసింది కూడా పబ్‌లే. ఇదేదో ఒకరిద్దరు హీరోల గురించో, లేదా వెయ్యి మంది పిల్లలకో సంబంధించిన విషయం కాదు. దశాబ్దాలుగా డ్రగ్‌ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది. వైన్ షాపులు కూడా గుడికి, బడికి అర కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనలున్న చోట.. ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్… మన సిటీలో ఇంట్నేషనల్ స్కూళ్లో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా.. ఓ సామాజిక రుగ్మతలా చూడాలి. డ్రగ్స్ ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం. ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే… మరో పదేళ్ల తర్వాత.. యువత పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కోట్ల మంది భవితను మింగేస్తుంది. ఒళ్లు తెలియని మత్తులో జోగుతున్న యువత… ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది. ముఖ్యంగా యువకులు రోడ్ల మీదకు వస్తే యమకింకరులుగా మారిపోతున్నారు. అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తొలుత ఎంజాయ్‌మెంట్‌గా కనిపించినా… మెల్లమెల్లగా మధ్యతరగతి అమ్మాయిలు సంపన్నుల చేతుల్లో ఆటవస్తువుల్లా మారుతున్నారు. ఖరీదైన జీవితంపై మోజుపడి… తమ జీవితాల్నే నాశనం చేసుకుంటున్నారు. పబ్‌లకు వచ్చిన అమ్మాయిలకు రాఫ్నాల్‌ వంటి డేట్‌రేప్‌ డ్రగ్స్‌ను ఇచ్చి.. వారిని లోబర్చుకుంటున్నారు. ఆ తర్వాత దానిని ఆసరా చేసుకుని… వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పబ్‌ల్లో డ్రగ్స్‌ వాడకం కామన్‌ అన్నది బహిరంగ రహస్యం.

ఇప్పటికైనా కళ్లు తెరిచి డ్రగ్స్‌ రవాణాను అడ్డుకునేలా పకడ్బందీ వ్యవస్థనే ఏర్పాటు చేయాలి. ఎన్ని అరెస్టులు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా అదుపులోకి రావటం లేదు.. అంటే చట్టాలు కఠినంగా లేవని అర్థం. కఠిన చట్టాలతో ఎక్కడికక్కడ అడ్డుకుంటే తప్ప క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్‌ మాఫియాకు చెక్‌ పడదు. అది జరగనంత కాలం నగరాల్లో భద్రతకు ముప్పుందనే అర్థం.

Exit mobile version