NTV Telugu Site icon

Harassed By Instant Loan Apps, Defaulter Ends Life : లోన్ ఇచ్చి ప్రాణం తీస్తారా ? లోన్ యాప్ దారుణాలకు అంతం లేదా ?

Loan App

Loan App

Harassed By Instant Loan Apps, Defaulter Ends Life :

సాధారణ, మధ్య తరగతివాళ్లే టార్గెట్. అవసరాలకు అప్పు ఇస్తారు. కట్టకపోతే వడ్డీకింద ప్రాణాలు తోడేస్తారు. క్లిక్ చేస్తే లోన్ అంటూ మభ్యపెట్టి.. ఆపై చుక్కలు చూపిస్తారు. ఇదీ ప్రస్తుతం ఆన్ లైన్ లో సాగుతున్న లోన్ల దందా. ఆన్ లైన్ యాప్ లలో అప్పులు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

తెలుగు రాష్టాల్లో జనాల ప్రాణాలు తీసే కొత్తరకం వ్యాపారం కలకలం రేపుతోంది. పబ్జీలు, ఆన్ లైన్ రమ్మీలకంటే అత్యంత ప్రమాదకరమైంది ఈ మనీ యాప్‌ల వ్యాపారం. విద్యార్థులు, నిరుద్యోగులే వీరి టార్గెట్. ఆధార్, పాన్‌ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేస్తారు. వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకూ అప్పు ఇస్తారు.అయితే లోన్‌ ఇవ్వాలంటే పదిమంది ష్యూరిటీ అడుగుతారు. ష్యూరిటీ అంటే వాళ్ల నుంచి సంతకాలు ఏవీ అవసరం లేదు. వాళ్ల కాంటాక్టర్ నంబర్లు ఇస్తే చాలు. సెకన్లలోనే అకౌంట్లో డబ్బులు పడిపోతాయి.లోన్‌లో పది శాతం ప్రాసెసింగ్‌ చార్జీల కింద కోత విధించి మిగిలిన మొత్తాన్ని గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. రుణం తీర్చేందుకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఇస్తారు. సులువుగా డబ్బు వస్తుంది కదా? అని విద్యార్థులు, నిరుద్యోగులు యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుంటున్నారు. తీరా డబ్బులు వెనక్కి చెల్లించడం ఆలస్యమైతే అసలు కథ మొదలవుతుంది.

ఎవరివైతే ష్యూరిటీగా .. ఫోన్ నంబర్లు తీసుకున్నారో వారందరికీ వాట్సాప్ లో మెసేజ్‌లు పంపుతారు ఫలనా వారికి ష్యూరిటీ ఉన్నారు ఆ డబ్బులు వెంటనే కట్టకపోతే మా మనుషులు మీ ఇంటికి వస్తారు.. మీమీద కేసు పెడుతున్నామని, కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షపడుతుందో అన్ని వివరాలతో వాట్సాప్ కు మెసేజ్ పంపుతారు. అంతేగాదు లోన్ ఎవరు తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబర్ , అడ్రస్‌తో సహా అన్ని వివరాలు పంపుతారు. నిజానికి ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి లోన్ తీసుకున్న వ్యక్తికి అసలు సంబంధం కూడా ఉండకపోవచ్చు. అయినా మెసేజ్ వస్తుంది..ఇదో మానసిక వ్యధ. ఆ కోపంలో మెసేజ్ అందుకున్న వ్యక్తి లోన్ తీసుకున్న వ్యక్తి నంబర్ కు కాల్ చేసి తిడతారు. నా నంబర్ ని మీరు ఎందుకు షూరిటీ పెట్టారు అని..ఇలా పదిమంది ఆ లోన్ తీసుకున్న వ్యక్తికి పదేపదే కాల్ చేసి విసిగిస్తే లోన్ తీసుకున్న వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

గూగుల్ ప్లేస్టోర్‌లో వందలాది మనీ యాప్‌లు దర్శనమిస్తున్నాయ్‌. మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్,ధని,మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రుపీ ఇలా చెప్పుకుంటూ పోతే మనీ యాప్‌లు చాంతాడంత ఉన్నాయ్‌. ఇతరులను డబ్బులు అడగడం ఇష్టం లేని వారు ఇలా మనీ యాప్‌లలో లోన్లు తీసుకుంటున్నారు. కేవలం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌ డిటెయిల్స్ ఇస్తే చాలు వెంటనే డబ్బులు అకౌంట్‌లో వేస్తారు. ఇది చాలా గుట్టుగా మైక్రోఫైనాన్స్ మాదిరిగా సాగుతోంది దందా. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యాప్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.

అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈ వేధింపులు భరించ లేకే..విశాఖ జిల్లా గాజువాకలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వాస్తవానికి ఇది చట్ట విరుద్ధమైన వ్యాపారం. కాని వేల కోట్లలో ఈ దందా గుట్టుగా సాగుతోంది. ఇందులో మరి యాప్ నిర్వాహకులకు లాభం ఏంటి అంటే..ఆ యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఆదాయం వస్తుంది అలాగే ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ముందుగానే తీసుకున్న లోన్ లో డబ్బులు కట్ చేస్తారు.

చూడటానికి చిన్నచిన్న అమౌంట్ లs అనుకున్నప్పటికీ.. పెద్దపెద్దవ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో లక్షలమంది విద్యార్థులు, నిరుద్యోగులు చేతి ఖర్చుల కోసం ఇలా ఈ యాప్‌ల నుంచి అప్పులు తీసుకున్నారు.లాక్ డౌన్‌ సమయంలో అవసరాల కోసం ఇబ్బంది పడిన అనేక మంది ఇలాంటి యాప్‌ల బారిన పడ్డారు. ఇదంతా మైండ్ గేమ్ అంటున్నారు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్. జనాల అవసరాలే ఈ యాప్‌లకు పెట్టుబడి అని చెబుతున్నారు. ప్రశాంతంగా ఉండే మధ్యతరగతి జీవితాల్లో ఆన్ లైన్ అప్పులు చిచ్చు రేపుతున్నాయి. స్మాల్‌ వ్యాలెట్‌, బబుల్‌ లోన్‌, గో క్యాష్‌, బిలియన్‌ క్యాష్‌, లోన్‌ బజార్‌ వంటి పేర్లతో వందలాది యాప్‌లను రూపొందించి గూగుల్‌ ప్లే స్టోర్‌లో వదులుతున్నారు. ఇలాంటి యాప్ లు ఒకటికాదు రెండుకాదు దాదాపు 200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు గడిపే వారికి ఆయా యాప్స్‌ లింక్ పంపుతారు. మీకు లోన్ అప్రూవ్ అయిందని లింక్ క్లిక్ చేయాలని ఫోన్ కు మెసేజ్ పెడతారు. చిన్న చిన్న అవసరాలకు మీ దగ్గర డబ్బుల్లేవా..? ఐతే తక్కువ వడ్డీకి మేం అప్పిస్తాం.. షూరిటీ అస్సలు అవసరమే లేదు. అంటూ బుట్టలో వేస్తారు. లింక్ ఓపెన్ చేసి తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్తారు. వాటిని ఓపెన్‌ చేయగానే ఫొటో, ఆధార్‌ కార్డుతోపాటు సెల్‌ఫోన్‌లో గూగుల్‌ డ్రైవ్‌కు సింక్‌ అయిన కాంటాక్టు నంబర్లు తమకు పంపిస్తే చేస్తే వెంటనే 3 వేలు నుంచి 50 వేలు వరకూ అప్పు ఇస్తామంటారు. అప్పులో 10శాతం ప్రాసెసింగ్‌ చార్జీల కింద కట్ చేసి మిగిలిన ఎమౌంట్ గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. రుణం తీర్చేందుకు 15 నుంచి 20 రోజులు మాత్రమే టైమ్ ఇస్తారు. సకాలంలో చెల్లించకుంటే వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ, లేట్ పేమెంట్ ఛార్జీలు.. ఇలా తీసుకున్న అప్పు గోరంత అయితే.. వడ్డీ కొండంత పెరుగుతుంది. డెడ్ లైన్ దాటిన తర్వాత వేధింపుల పర్వం మొదలవుతుంది. అప్పు తీర్చనివాడివి ఎందుకు తీసుకున్నావ్., నీకు బ్రతికే అర్హత ఉందా అంటూ నీచంగా మాట్లాడతారు. డీఫాల్టర్ గా ప్రకటించి బంధువులు, ఫ్రెండ్స్ కి మెసేజ్ లు పంపి పరువు తీస్తారు.

లోన్ తీసుకున్న పాపానికి ఇంటి గుట్టే కాదు.. వ్యక్తిగత పరువు మర్యాదలు కూడా గంగలో కలుస్తున్నాయి. తెలిసినవాళ్లను అప్పు అడిగే కంటే.. ఆన్ లైన్ లో తీసుకుని తీర్చేద్దామనుకుంటే.. లోన్ యాప్ లు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పు కడతారా.. ఆత్మహత్య చేసుకుంటారా అన్న స్థాయిలో రెచ్చిపోతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. సామాన్యులనే కాదు.. ప్రముఖులకూ తప్పడం లేదు లోన్ యాప్ వేధింపులు. మంత్రులు, మాజీ మంత్రులుకు కూడా ఫోన్లు చేసి సతాయిస్తున్నారు.

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో పేద, మధ్య తరగతి వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చిన్నచిన్న అవసరాల కోసం యాప్ ల ద్వారా అప్పులు తీసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజలు బెదిరింపులకు భయపడి ఎక్కువ వడ్డీలు చెల్లిస్తారన్నది మనీ యాప్ ల లెక్క.

డబ్బు అవసరం మనిషితో ఎంతపనైనా చేయిస్తుంది. అవసరానికి డబ్బు దొరకలేదని చాలామంది అధిక వడ్డీ అయినా తప్పక అప్పులు చేస్తుంటారు. అప్పు తీసుకుంటారు కానీ, అధిక వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తీర్చలేక పరువు పోతుందని భయపడిపోతున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

కొందరు తమకున్న చిన్నపాటి ఆస్తులు, ఇళ్లను అమ్మి మరీ ఆన్ లైన్ అప్పులకు వడ్డీలు కట్టి బయటపడుతున్నారు. అలా తీర్చలేని వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. చట్టబద్ధత లేని యాప్ ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వేధింపులకు పాల్పడే యాప్ ల పై ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో గాని లేదా ఏవిధమైన బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్.బి.ఐ చట్టం 1934 లోని సెక్షన్ 45-1ఎ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉంది. ఆర్.బి.ఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదు. కేవలం యువత అవసరాలను ఆసరాగా చేసుకుని కోసం ఆన్‌లైన్ లోన్ ఇస్తూ వారి జీవితాలను చిదిమేస్తున్నాయని విచారణలో తేలడంతో అప్పులిచ్చే యాప్ లపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు.

యువత అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ఆన్‌లైన్ యాప్‌ల సంస్థలు డబ్బులు ఎరగా వేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే సులభంగా రుణాలు ఇస్తున్నారు. దీంతో తాత్కాలికంగా అవసరాలు తీరతాయనే ఉద్ధేశ్యంతో వెనకాముందు ఆలోచించకుండా డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఒత్తిళ్లకు తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ యాప్‌ల్లోలోన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆన్‌లైన్ యాప్‌లో అప్పు తీసుకున్న అనంతరం వారు పెట్టే వేధింపులు తట్టుకోలేక తనువు చాలిస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. లోన్ తీసుకుని వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య పెరిగిపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఇలాంటి యాప్‌లను బ్యాన్ చేయాలని డిమాండ్ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా సులభంగా రుణాలిచ్చి ఆ తర్వాత వేధిస్తున్నారని కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. రుణం తీసుకున్న వారికి సంబంధించిన వ్యక్తులకు సందేశాలు పంపించి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లఘిస్తూ రుణాలు ఇవ్వడం నేరమని వివరించారు. బాధితులు బలన్మరణాలకు పాల్పడకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్‌లైన్‌ యాప్‌లకు ఆర్‌బీఐ అనుమతి లేదని.. అందులో చాలా వరకు చైనీస్‌ యాప్‌లే ఉన్నట్లు కనుగొన్నారు. ఆయా యాప్‌లకు రిజిస్టర్‌ అయిన చిరునామాలు సరిగా లేవని గుర్తించారు. ఆయా కేసులన్నింటినీ పరిశీలించి బాధ్యులైన యాప్‌ నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్‌ క్రైం నిపుణులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆయా కేసుల్లో మృతుల సెల్‌ఫోన్ల నుంచి, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారంతా కూడా ఇన్‌స్టెంట్‌ యాప్‌ల వేధింపుల వల్లే మృతిచెందినట్లు తెలుసుకొని కేసులు నమోదు చేశారు.

కాగా తీసుకున్న అప్పును తిరిగి రాబట్టే క్రమంలో అప్పు తీసుకున్న వారికి.. వారి కాంటాక్టు లిస్ట్‌లో ఉన్నవారికి ఫోన్లు చేయడం, వాట్సాప్‌ సందేశాలు పంపడం వంటి పనుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యాప్‌ నిర్వహకులతోపాటు కాల్‌ సెంటర్‌ నిర్వహకులపై చట్టపరమైన తీసుకునేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు పరిపాటిగా మారుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది తమ పరి పరిజ్ఞానం, తెలివితేటలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ మోసాలు మరి ఎక్కువయ్యాయి. ఇలాంటి వాటిలో ఎక్కువగా బ్యాంకింగ్ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి మరి నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా లోన్ అప్లికేషన్ మోసాలకు పాల్పడే రాకెట్ గ్రూపులు.. అవాంతరాలు లేని రుణాన్ని అందిస్తామన్న పేరుతో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటున్నారు. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రుణం కోసం ప్రయత్నించేవారు ఎక్కువే. లాక్ డౌన్ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారు. అప్పటినుంచి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నవారంతా రుణం కోసం బ్యాంకుల గుమ్మం తొక్కుతున్నారు. అయినా బ్యాంకుల్లో కావాల్సినంత రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇచ్చినా డాక్యుమెంట్లతో పాటు అన్ని సరిగా ఉంటేనే లోన్లు ఇస్తాయి. లేదంటే లేదు. అందుకే ఎక్కడ తొందరగా రుణం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి చిన్నపాటి ఫైనాన్స్ సంస్థలు. తమ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఇన్ స్టంట్ లోన్లతో గాలం విసురుతున్నాయి. లిమిటెడ్ డాక్యుమెంటేషన్, క్షణాల్లో బ్యాంకు అకౌంట్లోకి మనీ క్రెడిట్ చేయడం.. ఈజీగా లోన్ రావడంతో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఆన్ లైన్ లోన్ యాప్‌లపై ఆధారపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఇన్ స్టంట్ లోన్ అని సెర్చ్ చేసేస్తున్నారు. దాదాపు 200 లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. క్షణాల వ్యవధిలో మీ బ్యాంకు అకౌంట్లో మనీ క్రెడిట్ చేసేందుకు రెడీ అంటున్నాయి.